ఈ ఊరోళ్లు ఎంత గొప్పోళ్లో!


Sun,March 17, 2019 01:39 AM

Mawlynnong-village
స్వచ్ఛభారత్ పేరుతో మోడీ ఈ దేశాన్ని స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుదాం అని పిలుపునిచ్చాడు. ఆ పిలుపు అందుకొని అన్ని రాష్ర్టాలు స్వచ్ఛబాట పట్టాయి. మన రాష్ట్రంలో గంగదేవి పల్లి కూడా దేశంలో ఉత్తమ గ్రామంగా అవార్డు అందుకున్నది. కానీ.. ఆసియాలోనే అత్యంత శుభ్రమైన ఊరొకటి ఉన్నది. ఆ ఊరోళ్లు ఎంత గొప్పోళ్లంటే ఆ ఊరిని అద్దంలా మార్చుకున్నారు.
Mawlynnong-village1
అదేంటీ? ఊరన్నప్పుడు చెత్త ఉండకపోవడమేంది? అని డౌటొచ్చిందా? వచ్చే ఉంటుంది. ఎందుకంటే నిత్యం చెత్తతో సోపతి చేస్తూ, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే అలవాటు మనకుంది కాబట్టి. మనందరికీ పరిచయం ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి గ్రామం తెలుసు కదా! దేశంలోనే ఉత్తమ గ్రామంగా ఎంపికైంది. అయితే.. ఇప్పుడు చెప్పే గ్రామం మాత్రం గంగదేవి పల్లి గ్రామం కంటే పదిరెట్లు ఉత్తమం. అవునూ.. ఇది నిజం. మేఘాలయలోని మౌలినాంగ్ అనే చిన్న గ్రామం ఆసియా ఖండంలోనే అతి శుభ్రమైన గ్రామంగా ఎంపికైది. ఊరంగా శుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడుతుంది. కేవలం 500 మంది జనాభా మాత్రమే ఉన్న ఈ ఊరు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిన్న గ్రామమైనప్పటికీ ఇక్కడి ప్రజలకు పరిశుభ్రత పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. ప్రతీ ఇంటి ముందు ఓ చెత్త బుట్ట ఉంటుంది. అది కూడా ప్రకృతికి ఏమాత్రం హాని చేయని వెదురుతో చేసింది. మామూలుగా అయితే రోడ్డు పక్కన చెత్త కనిపిస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ మౌలినాంగ్ గ్రామ ప్రజలు మాత్రం దారి వెంట వెళ్తున్నప్పుడు చెత్త కనిపిస్తే చాలు.. ఇంటి ముందు కనిపించే చెత్తబుట్టలో వేసి వెళ్తారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు శపథం కట్టుకొని తమ ఇండ్లను సైతం వెదురుతో నిర్మించుకున్నారు. మౌలినాంగ్‌లో వెదురుకర్రలతో 85 అడుగుల టవర్ నిర్మించారు. దాని పైకి ఎక్కి చూస్తే మౌలినాంగ్ గ్రామం మొత్తం కనిపిస్తుంది. అంతేకాదు.. పక్కదేశమైన బంగ్లాదేశ్ కూడా కనిపిస్తుంది. ఆ ఊరి జనాభా 500 మాత్రమే. అది మేఘాలయ రాష్ట్రంలో ఉన్న మౌలినాంగ్ అనే చిన్న గ్రామం. అటు పచ్చదనంలోనూ, ఇటు పరిశుభ్రతలోనూ మౌలినాంగ్ గ్రామం అందరి మన్నలను అందుకుంటున్నది.
Mawlynnong-village2
ప్రపంచమంతా కాంక్రీట్ అరణ్యంలా మారిపోతున్న ఈ తరుణంలో మౌలినాంగ్ మాత్రం పూర్తిగా ప్రకృతి ఒడిలో పెరుగుతున్న పసిపాపలా ఉంటుంది. 2003 సంవత్సరంలో ఆసియాలోనే అత్యంత శుభ్రమైన, స్వచ్ఛమైన గ్రామంగా మౌలినాంగ్ అవార్డు గెలుచుకున్నది. ఈ గ్రామం చుట్టూ ప్రవహించే సరస్సులు, చెరువుల్లో నీళ్లు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. ఆ నీళ్లలో పడవలో ప్రయాణిస్తూ నీటి అడుగున ఏముందో కూడా సులభంగా చూసేయొచ్చు. దీన్ని బట్టి ఆ చెరువులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అర్థమవుతుంది కదా! సిమెంట్ వాడకుండా చెట్ల వేర్లతో చేసిన వంతెనలు చెరువులను దాటడానికి ఉపయోగిస్తారు. మౌలినాంగ్ ప్రజలు నివసించే ఇండ్ల చుట్టూ అందమైన, రంగురంగుల పూలతీగలు, శుభ్రమైన రోడ్లు, పచ్చదనం, ఎక్కడ చూసినా వెదురు కర్రలతో వేసిన గుడిసెలు, రబ్బరు చెట్ల వేర్లతో నిర్మించిన వంతెనలు ఏదో కొత్త ప్రపంచానికి వెళ్లిన అనుభూతినిస్తాయి. ప్రపంచమంతా ఇంటర్నెట్, టెక్నాలజీ సాయంతో దూసుకుపోతుంటే.. మౌలినాంగ్ మాత్రం వాటితో పనిలేకుండా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఆ ఊరి ప్రజలు ఇంటర్నెట్ వాడరు. ఎవరికీ మొబైల్ ఫోన్స్ ఉండవు. అందరూ ల్యాండ్‌లైన్ ఫోన్లే వాడుతారు. ఎవరైనా అతిథులు మొబైల్ ఫోన్ తెచ్చుకుంటే స్విచ్ఛాఫ్ చేసి మీకే సహాయం కావాలన్నా మేమున్నాంగా అంటూ సున్నితంగా చెప్తారు. మనుషులు, వారి శుభ్రత, అలవాట్లే కాదు. వారు తినే ఆహారం కూడా ప్రకృతి సిద్ధమైనదే. దుంపలు, ఎర్ర మిరపకాయలు, పప్పు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని వాళ్లు ఇష్టంగా తీసుకుంటారు. అందుకే వారి ఊరిలాగే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. ఇవన్నీ చదువుతుంటే మీక్కూడా మౌలినాంగ్ చూడాలనిపిస్తుందా? మీ కోరిక న్యాయసమ్మతమే. మౌలినాంగ్ వెళ్లాలంటే దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి గౌహతికి విమాన సర్వీసులు, రైలు సర్వీసులు ఉన్నాయి. గౌహతి నుంచి మౌలినాంగ్ 190 కిలోమీటర్లు. లేదంటే.. షిల్లాంగ్ వెళ్లి కూడా మౌలినాంగ్ చేరుకోవచ్చు. షిల్లాంగ్ నుంచి మౌలినాంగ్ చేరుకోవాలంటే 118 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
Mawlynnong-village3

- ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

506
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles