ఇష్టం లేదని అబద్ధం చెప్పా!


Sun,May 13, 2018 01:06 AM

నేను బయాలజీ స్టూడెంట్‌ని. ప్రాణులంటే నాకు అమితమైన ప్రేమ. ఏ ఒక్క ప్రాణికీ నష్టం జరిగినా నా మనసు తట్టుకోలేదు. అప్పుడు డిగ్రీ సెకండియర్‌లో ఉన్నాం. నేను, శ్వేత, ప్రత్యు, దివ్య మంచి ఫ్రెండ్స్. మేం ఎప్పుడు బయాలజీ విషయాలు మాట్లాడుకునేవాళ్లం. మమ్మల్ని చూసినవాళ్లకు వింతగా, విచిత్రంగా అనిపించినా మేం పట్టించుకోకపోయేవాళ్లం. మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని మాకు ప్యూర్ బయాలజీ బ్యాచ్ అనే పేరు కూడా పెట్టారు కొందరు. మా జూనియర్ అబ్బాయి ఒకతను మమ్మల్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాడు. అతని పేరు మోహన్. అతని సమస్య బయాలజీ. బాగా చదువుకోవాలి. మంచి మార్కులు సంపాదించాలి అనుకునేవాడు. బయాలజీలో ప్రావీణ్యుడు కావాలట. దానికి మేమేం చెయ్యాలి? అని అడిగితే మీరే చెయ్యాలి అనేవాడు. అమాయకుడా? మాయకుడా అర్థం కాకుండా ఉండేవాడు మోహన్. స్టార్టింగ్‌లో దివ్యను ఫాలో అయ్యేవాడు. దివ్యా.. దివ్యా ఈ జీవి శాస్త్రీయనామం ఏంటి? ఆ జీవి ఏ వర్గానికి చెందినది? అంటూ దివ్యను అడుగుతూ విసిగించేవాడు. దానికి చిరాకు కలిగి నేను అంతంత మాత్రమే మహా ప్రభో.. నన్ను వదిలెయ్ అంటూ దివ్య బతిమిలాడితే ఇక శ్వేత వెంట పడ్డాడు. నీకో దండం నాయనా అని శ్వేత కూడా విసుక్కుంటే ప్రత్యును ఆశ్రయించాడు. నీ డౌట్స్ క్లియర్ చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే నేనే తక్కువగా వస్తుంటాను కాలేజీకి. వేరే దారి వెతుక్కోవడం బెటర్ అని ప్రత్యు చెప్పేయడంతో నా వెంట పడసాగాడు మోహన్. చాలామంచి అబ్బాయి. కాకపోతే అతను ఫాలో అయ్యే విధానం బాగా లేదు. బాగా నటిస్తాడు. ఆ ఓవరాక్షన్‌తో విసిగిపోయిన మా ఫ్రెండ్స్ అతడి బారి నుంచి తప్పించుకోగలిగారు. కానీ నేను అంత ఈజీగా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టొద్దనేది నా ఫిలాసఫీ. చూడు మోహన్. నీకు ఎలాంటి సందేహాలున్నా నన్నడగొచ్చు. నాకు తెలిస్తే కచ్చితంగా నీకు చెప్తా. అది పెద్ద పనేం కాదు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి, లేక వెంట పడినట్టు అడిగితే మాత్రం చెప్పలేను. అంత ఓపిక కూడా లేదు అని చెప్పేశాను.
Love

నేను చెప్పిన వాటిని బాగా వంట పట్టించుకొని ఏదైనా సందేహాలుంటే మాత్రమే ఫోన్ చేసేవాడు. కలిసేవాళ్లం. ఒకసారి ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్స్‌ను తీసుకొని చిల్కూరు దగ్గర ఉన్న మృగవని జింకల పార్క్‌కు తీసుకెళ్లారు కాలేజీ నిర్వాహకులు. 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం బస్సులో ప్రయాణిస్తే నాకు కళ్లు తిరిగే అలవాటుంది. దాన్నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. మృగవనికి వెళ్లినపుడు కూడా కళ్లు తిరిగి పడిపోయాను. శ్వేత, ప్రత్యు, దివ్య ఫొటోలు దిగడానికి ఇచ్చిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒళ్లంతా చల్లగా అయిపోయింది. హెచ్‌ఓడీ మేడమ్‌తో విషయం చెప్పాను. నువ్వు రెస్ట్ తీస్కోమ్మా. ఫారెస్ట్ రైడింగ్ ఉంది. జీప్‌లో వెళ్లాలి. అది అరుదైన అవకాశం. నీతో ఉంటే మేం కూడా అవకాశం కోల్పోతాం అన్నారు మేడం. నాకు బాధనిపించింది. లైట్ తీస్కొని బస్సులోనే పడుకున్నాను. నా గురించి తెలిసిందట మోహన్‌కు. ఆదరబాదరాగా వచ్చేశాడు. ఏమైందనీ అన్నాడు. కళ్లు తిరుగుతున్నాయి మోహన్ అన్నాను. నువ్వు రైడింగ్‌కు వెళ్లలేదా? అని అడిగితే.. వెళ్దామనుకున్నాను. నీ గురించి తెలిస్తే వచ్చా అన్నాడు. నాకేం కాలేదు. కొంచెం నీరసంగా ఉంది. నువ్వు వెళ్లు. నా వల్ల ఎందుకు మిస్ చేసుకుంటావు? అన్నాను. ఫర్వాలేదు. మా మామయ్య ఫారెస్ట్ ఆఫీసర్. అతనితో చాలాసార్లు వచ్చాను ఇక్కడకు. ఔనూ.. ప్రత్యు వాళ్లేంటి నిన్నిలా వదిలేశారు? పైగా మీ ఫ్రెండ్ అక్కడ బస్సులో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ బాబూ? నాతో వెటకారంగా మాట్లాడారు అని మోహన్ చెప్పడంతో ఇన్నిరోజులూ వాళ్లతో ఏర్పరుచుకున్న బంధమంతా తొలిగిపోయింది. సరే.

వాళ్ల గురించి వదిలెయ్ మోహన్. నా కోసం నువ్వు వచ్చావుగా అది చాలు అన్నాను. టూర్ అయిపోయి నేను ఇంటికి చేరేవరకూ మోహన్ నాతోనే ఉన్నాడు. ఇంట్లో కూడా జరిగిన విషయం చెప్పాను. అమ్మావాళ్లు మోహన్‌ని మెచ్చుకున్నారు. రెండ్రోజుల తర్వాత కాలేజీకి వెళ్లాను. ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. మోహన్‌ను తీసుకొని క్యాంటీన్‌కు వెళ్లాను. ఇద్దరం చాలాసేపు మాట్లాకున్నాం. అలా నెల రోజులు గడిచిపోయాయి. ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. మోహన్ అందరూ అనుకున్నంత చెడ్డబ్బాయి కాదు. మంచి లక్షణాలున్న అబ్బాయి. జీవితంలో లక్ష్యం ఉన్న అబ్బాయి అనిపించింది. నాకెందుకో నచ్చేశాడు. నాకు తెలియకుండానే నేను మోహన్‌ను ఇష్టపడ్డాను. ఒకరోజు అతడు రాకపోతే నా మనసు మనసులో ఉండేది కాదు. నన్ను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యూ బ్యాచ్ నాపై తప్పుడు ప్రచారం చేసింది. జూనియర్ అబ్బాయిని వెంటేసుకొని తిరుగుతుందని కాలేజ్‌లో అంతా టామ్ టామ్ చేశారు. హేమ అని మరో ఫ్రెండ్ పుట్టినరోజు ఓ హోటల్‌లో చేసుకున్నది. ఫ్రెండ్స్ అంతా వెళ్లాం. నాతో మోహన్‌ను కూడా తీసుకెళ్లాను. కేక్ కటింగ్, లంచ్ అయిపోగానే వెళ్దామనుకుంటున్న సమయంలో నేనంటే గిట్టనివాళ్లు కామెంట్ చేశారు. నాకు కోపం వచ్చింది. కానీ బర్త్‌డే పార్టీలో గొడవలెందుకు అని సైలెంట్‌గా ఉన్నాను. నా మౌనాన్ని ఆసరా చేసుకొని మళ్లీ ఏవేవో వాగారు. జూనియర్ అబ్బాయిని వెంటేసుకొని తిరుగుతున్నవ్ సిగ్గులేదా? అన్నారు. నా కోపం రెట్టింపయింది.

వాడు నా జూనియర్ కాదు. నా లవర్. నేను మోహన్ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకుంటాం అని గట్టిగా అన్నాను. అంతా సైలెంట్ అయ్యారు. మోహన్ షాక్ అయ్యాడు. పాపం ఫీలయ్యాడేమో అనుకున్నాను. కానీ అలాంటిదేమీ లేదని తెలిసింది. పొద్దున్నే ఫోన్ చేశాడు. ఏమైంది అనీ.. ఒక్కసారి అలా షాకిచ్చావు? అన్నాడు. ఏం కాలేదు. నా మనసులో ఉన్నమాటే చెప్పాను అని ఫోన్ పెట్టేశాను. వరుసగా ఐదు రోజులు కాలేజీకి వెళ్లలేదు. ఇదంతా ఓ డ్రామాలా అనిపిస్తుంది. నాతో అంత క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్ ఎందుకు నేనంటే ద్వేషిస్తున్నారు? అని ఆలోచించాను. మోహన్ కూడా తన ప్రేమను తెలిపాడు. ఇద్దరం కలిసి సినిమాలు, షికార్లు అంటూ చాలా ఎంజాయ్ చేశాం. ఒకరోజు హేమ ఇంటికొచ్చింది. చాలాసేపు మాట్లాడుకున్నాం. హేమ నాతో మరీ క్లోజ్‌గా ఉండదు. కానీ నా మేలు కోరుతుంది. మాటల్లో మాటగా మోహన్ గురించి ప్రస్తావన వచ్చింది. మోహన్ మంచబ్బాయి కాడనేది హేమ అభిప్రాయం. అనీ.. నేను నిజం చెప్తున్నా. మోహన్ నిన్ను ప్రేమించలేదు. నీతో ప్రేమించాను అని చెప్పిస్తానని పందెం కాశాడు. దానికి నేనే సాక్షిని. నువ్వు అతడితో చనువుగా ఉండటం నచ్చకపోవడంతోనే శ్వేత, ప్రత్యు, దివ్య నీతో అలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడొకసారి మోహన్‌కు కాల్ చెయ్. ఎన్ని అబద్ధాలు ఆడుతాడో నీ కళ్లారా చూస్తావు. అతడు ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో తిరుగుతున్నాడో మొత్తం నాకు తెలుసు అన్నది హేమ.
నాకు దిమ్మ తిరిగిపోయింది. ఏంటీ? ఇదేమైనా సినిమానా అనిపించింది. హేమకు ఎవరో చెప్పి ఉంటారు.. నా మనసులోంచి మోహన్‌ను తీసేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పిందేమో అనుకొని లైట్‌గా తీసుకొన్నాను. కానీ చెక్ చేసుకో అన్న హేమ మాటలు ఏదో సంకేతాల్ని ఇస్తున్నాయి. కాలేజీకి హాలీడేస్ వచ్చాయి.

మోహన్‌ను చెక్ చేయడానికే ఒకరోజు ఫోన్ చేశాను. ఎక్కడున్నావు మోహన్. నీతో అత్యవసరంగా మాట్లాడాలి అన్నాను. కుదరదు. నేను బయట ఉన్నా అన్నాడు మోహన్. బయటంటే ఎక్కడ? నాతో కలవడానికి కూడా వీల్లేనంత దూరంలో ఉన్నావా? అన్నాను. కోపగించుకున్నాడు. పనిమీద ఉన్నానని చెప్తుంటే వినిపించడం లేదా అని విసుక్కున్నాడు. వెంటనే హేమకు ఫోన్ కలిపాను. హేమా.. మోహన్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అర్జెంట్‌గా అన్నాను. ఎందుకు? ఏమిటి అని కూడా అడగకుండా ఓకే అన్నది హేమ. పది నిమిషాలకు నాకు ఫోన్ చేసి.. నేను స్కూటీ తీసుకొని వస్తున్నా. రెడీగా ఉండు అన్నది. నాకు విషయం అర్థమైంది. పావుగంటలో హేమ వచ్చేసింది. స్కూటీ ఎక్కాను. నెక్లెస్ రోడ్డు దగ్గర ఆపి.. అదిగో.. నీ మోహన్ అని చూపించింది హేమ. తట్టుకోలేని దృశ్యం అది. వేరే అమ్మాయితో ఉన్నాడు మోహన్. ఛీ.. అంటూ నన్ను నేనే తిట్టుకుంటూ ఇంటికొచ్చేశాను. మరుసటి రోజు మోహన్ నా దగ్గరికి వచ్చాడు. ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఏవేవో సోదీ ముచ్చట్లు చెప్పబోయాడు. ప్రాణులను చంపటం తెలియదు నాకు. అందుకే మోహన్‌ను తిట్టలేదు, కొట్టలేదు. నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. భావేద్వేగంలో నీతో ఏదో అనేశాను. అంతే తప్ప నీ మీద నాకెలాంటి ప్రేమ లేదు అని అబద్ధం చెప్పేసి మోహన్ నుంచి తప్పుకున్నాను. తొలిప్రేమ అంటే ఎంతో మధురంగా ఉంటుంది అంటుంటారు. కానీ నా తొలిప్రేమ చూశారుగా ఎంత చేదుగా ఉందో. మళ్లీ ప్రేమకంటూ ప్లేస్ ఉంటే నాలాంటి ప్రాణులను ప్రేమించే వాడినే ప్రేమిస్తా. అలాంటివాడు దొరికే వరకు ఎదురుచూస్తూ.. ఓ ప్రేమ ప్రాణి అనీ.!

1336
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles