ఇల్లే గ్రంథాలయం మనసే మమతాలయ!


Sun,October 7, 2018 01:48 AM

Library
ఓ నాలుగెకరాల పొలం ఉంటే చేస్తారు? చేతనైతే వ్యవసాయం చేస్తారు. లేకపోతే ఐదుకో పదికో అమ్మేసి హాయిగా జీవితాన్ని గడుపుతారు. అంతే కదా? మీరైతే ఏం చేస్తారు? ఏవో కుటుంబ అవసరాలు తీర్చుకొని కులాసాగా ఉంటుండొచ్చు. కానీ కూరెళ్ల విఠలాచార్య తనకున్న ఆరెకరాల భూమిని పేదలకు దానమిచ్చి.. తాను మాత్రం ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇల్లును కూడా గ్రంథాలయంగా మార్చి ఎందరికో విద్యా విజ్ఞానాన్ని అందిస్తున్నారు. పుస్తకాలకు.. మనిషికి ఉన్న అనుబంధానికి సరైనఅర్థం చెప్తున్నారు!

పసుపులేటి వెంకటేశ్వరరావు
సెల్: 8885797981

తాను నేర్చుకున్నది.. తనకు తెలిసినది పది మందికి పంచాలన్నదే కూరెళ్ల విఠలాచార్య అభిమతం. పుస్తకం జీవితాన్ని ప్రభావితం చేస్తుందనీ.. పుస్తకం ద్వారా నేర్చిన విజ్ఞానాన్ని పది మందికి పంచితేనే పుస్తకానికి, చదువుకు విలువ ఉంటుందని ఆయన నమ్ముతారు. సాంకేతికత పెరిగినా పుస్తకానికి ఉండే ప్రాధాన్యత తగ్గలేదనీ.. మున్ముందూ పుస్తక సంప్రదాయం ఇలాగే కొనసాగాలని అభిలషిస్తున్నారు సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలో కొలువుదీరిన కూరెళ్ల సాయి సాహితీ కుటీరంలోకి వెళ్లి దాని విశేషాలేంటో తెలుసుకుందాం.

సాహిత్య సాగు

పేద కుటుంబంలో పుట్టి.. ఎన్నో ప్రయాసలకు ఓర్చి చదువుకొని.. నేడు భవిష్యత్ తరాల జీవితాల్లో చదువు అనే వెలుగులు నింపేందుకు శ్రీకారం చుట్టారాయన. పుట్టిన ఊరికి మేలు చేయాలనే ఉద్దేశంతో వెల్లంకిలో అతి పెద్ద పుస్తక భాండాగారాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక స్పృహతో సచిత్ర పద్యకృతి విఠలేశ్వర శతకాన్ని రాశారు. తెలుగులో గొలుసుకట్టు నవలపై ఎంఫిల్, తెలుగు నవలలో స్వాతంత్య్ర ఉద్యమ చిత్రణంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. సాహిత్యంపై ఎన్నో పరిశోధనలు, రచనలు చేశారు.

పల్లె విద్యా పరిమళాలు

భువనగిరి మండలం, వడాయి గూడెం అనే పల్లెటూరులో అక్షర ఉద్యమం ప్రారంభించి.. ఉదయం పాఠశాలలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూ.. రాత్రి పూట వయోజనులకు విద్య నేర్పారు. ఎంతగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా పుస్తకాలు ఉంటేనే విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోగలమని భావించిన విఠలాచార్య పల్లెటూరి విద్యా పరిమళాలను వికసింప చేసేందుకు వెల్లంకి గ్రామంలోని ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం సాయి సాహితీ కూటీరంలో కొన్ని వేల సంఖ్యలో పుస్తకాలు, గ్రంథాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, రామాయణం, మహాభారతం, ఇతర గ్రంథాలు, అరుదైన పుస్తకాలు, అన్నీ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, పరిశోధనా గ్రంథాలు అందుబాటులో ఉంచారు. విఠలాచార్య ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో దొరికిన పుస్తకాలను ఉపయోగించుకుని ఇప్పటికే దాదాపు 8 మంది విద్యార్థులకు పైగా వివిధ అంశాలలో పీహెచ్‌డీలను పూర్తి చేశారు. మరి కొంతమంది పలు అంశాలపై పరిశోధన చేస్తున్నారు.

పేదలకు భూదానం

స్వగ్రామమైన వెల్లంకిలో ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టి ఇచ్చేందుకు తన వంతుగా 6 ఎకరాల స్థలాన్ని ఉచితంగా తన గ్రామస్తులకు ఇచ్చారు. ఆ తరవాత ఈ ఆరెకరాల స్థలంలో ప్రభుత్వం గ్రామస్తులకు ఇళ్లను నిర్మించి ఇచ్చింది. ఈ కాలనీకి ఆచార్యుల వారి కన్న తల్లి పేరు వచ్చేలా లక్ష్మీనగర్ అని నామకరణం చేశారు. కూరెళ్ళ ఎంతో మంది విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి దాతల సహకారంతో ఉన్నత చదువులకు ఆర్థిక వనరులు కల్పించి ప్రయోజకులను చేశారు. వికలాంగులైన విద్యార్థినీ, విద్యార్థులను ఆదరించి వారిని సైతం ఉన్నత చదువులు చదివించారు.అంతేకాకుండా జీవనోపాధిని కూడా కల్పించారు. అస్పృశ్యత నివారణోద్యమంలో భాగంగా నీరునెముల గ్రామంలో 1954లో సబ్బండ వర్ణాల వారికి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక సమైక్యతకు పాటు పడ్డారు.

రిక్షా వాలాకు పుస్తకం అంకితం

హైదరాబాద్‌లో 1957లో హెచ్‌ఎస్‌సీ పరీక్ష రాశారు కూరెళ్ళ. చివరి పరీక్ష కావడంతో తన సామాను సర్దుకుని విఠలాచార్య భువనగిరి వెళ్లడానికి రిక్షాపై నాంపల్లి వెళ్లారు. ఆ సమయంలో రైలు రావడంతో రిక్షావాలాకు ఇవ్వాల్సిన డబ్బులకు సరిపడా చిల్లర లేక ఇవ్వలేకపోయారు. అప్పటి నుంచి రిక్షావాలాకు కిరాయి ఇవ్వలేక పోయాననే చిన్న బాధ ఆచార్య మనసులో తొలుస్తూ ఉండేది. తన వల్ల రిక్షావాలాకు అన్యాయం జరిగిందనే సంఘటనను మర్చిపోలేక ఆయన రాసిన దొందూ... దొందే!! కావ్యాన్ని నిండు మనస్సుతో అతనికి అంకితం ఇచ్చి రుణ భారాన్ని, హృదయ భారాన్ని తీర్చుకున్నారు. దొందూ.. దొందే!! పుస్తకంలో 108 ఖండికలున్నాయి. అన్ని ఖండికలు చిన్నా, పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరినీ ఆకట్టుకునే విధంగా కూరెళ్ల రాశారు. అందులో అటు పండితులకు, ఇటు పామరులకు సైతం అర్థమయ్యేలా ప్రతి ఖండికను సరళ సుందరంగా, సందేశాత్మకంగానూ తెలిపారు.

తల్లి లేనిపిల్ల.. పిల్ల లేని తల్లి.. దొందూ దొందే!!

దేవుడు లేని గుడి.. దేశికుడు లేని బడి.. దొందూ దొందే!! నవ్వని పాపాయి.. చెల్లని రూపాయి.. దొందూ దొందే!! ఇలా తనదైన శైలిలో త్రిపద కవితలకు ముద్ర వేశారు విఠాలాచార్య.

బతుకమ్మ కళాబృందం

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన సాహిత్యంతోనే ఎందరినో కదిలించారు. ముఖ్యంగా 1952లో విద్యార్థిగా తొలి ఉద్యమంలోనూ, 1969లో ఉద్యోగిగా మలి ఉద్యమంలో సైతం కూరెళ్ల విఠలాచార్య పాలు పంచుకున్నారు. 2001 నుంచి తుది ఉద్యమం వరకూ కవిగా, రచయితగా ప్రముఖ పాత్ర పోషించారు. నల్గొండకు మంజూరైన విశవిద్యాలయానికి పోతన పేరు పెట్టాలని ప్రారంభమైన ఉద్యమానికి నాయకత్వం వహించారు. బతుకమ్మ కళా బృందాన్ని స్థాపించి ఊరూరా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని అందించేలా కార్యక్రమాలు నిర్వహించారు.

కూరెళ్ల ఫౌండేషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలురకాల పుస్తకాలను సేకరించేందుకు ప్రతినిధులు కూడా ఉన్నారు. వారు సేకరించిన పుస్తకాలను ఎప్పటికప్పుడు పోస్ట్ ద్వారా ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయానికి పంపుతుంటారు. చిన్నపాటి యూనివర్సిటీగా ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం రూపాంతరం చెందుతున్నది. తదనంతరం ఆయన ఈ గ్రంథాలయాన్ని చూసుకునేందుకు కొంతమంది సభ్యులతో ఆచార్య కూరెళ్ళ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి నెలా ఈ గ్రంథాలయ నిర్వహణకు అయ్యే ఖర్చును సైతం భరిస్తూ, చదువు కోవడానికి వచ్చిన పాఠకులను ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు కూరెళ్ళ. త్వరలో 20 లక్షల వ్యయంతో అతి పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించేందుకు శ్రమిస్తున్నారు.

తెలంగాణ వేమన-అభినవ పోతన!

తెలంగాణ కాగడాలు, కవితా చందనం, విఠలేశ్వర శతకం, మధుర కవి కూరెళ్ళ పీఠికలు, కూరెళ్ళ వ్యాసాలు, తెలంగాణ ఉద్యమ కవితలు, వంద శీర్షికలు, వంద సీసాలు, హైదరాబాద్ సంస్థానం, శిల్పాచార్యులు వంటి 20కి పైగా పుస్తకాలను కూరెళ్ళ విఠలాచార్య రాశారు. వివిధ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవడంతోపాటు ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు పలు రచనలు కూడా చేశారు. ఎంతో మందిని కవులుగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించారు. కూరెళ్ళ అందించిన సేవలకు గానూ మంచి గుర్తింపే లభించింది. ప్రజాకవి సుద్దాల హనుమంతు పురస్కారం, వాస్తు శిల్పి బి.ఎన్ రెడ్డి పురస్కారం, 1979లో నల్గొండ జిల్లా ఉత్తమ ప్రధానాచార్య అవార్డులు, లెజండరీ అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో జీవన సాఫల్య పురస్కారాన్ని విఠలాచార్య అందుకున్నారు. తెలంగాణ వేమన, అభినవ పోతన, నల్గొండ కాళోజీ, సుధీతిలక, సాహిత్య బ్రహ్మ, అక్షర కళా సమ్రాట్టు, కవి భూషణ, సాహిత్య ప్రపూర్ణ వంటి బిరుదులు పొందారు.

కూరెళ్ల గ్రంథాలయం!

వెల్లంకి గ్రామంలో 1954లోనే శ్రీశంభులింగేశ్వర గ్రంథాలయాన్ని స్థాపించి కొంత కాలం నిర్వహించారు తర్వాత తన సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చి ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయంగా పేరు పెట్టారు. పల్లెటూళ్లలో వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు దొరకక పట్టణాలకు వెళ్లలేని విద్యార్థినీ, విద్యార్థులు,సాహిత్య అభిమానుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద గ్రంథాలయాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో తన ఇంటిలోనే విశాలమైన లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న టి.చిరంజీవులు 2014 ఫిబ్రవరి 13న ముఖ్యాతిధిగా హాజరై కూరెళ్ళ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. లైబ్రరీ ప్రారంభించే నాటికి ఐదు వేల పుస్తకాలు మాత్రమే ఉండేవి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథ భిక్ష పేరుతో పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో నేడు 30 పై చిలుకు పుస్తకాలను సమకూర్చారు.

చదువుంటే విజ్ఞానం:

చదువుకోవడానికి నా లెక్క ఎవరూ బాధపడకూడదు. ఈ ఉద్దేశంతో నేను పుస్తకాల సేకరణ యజ్ఞం చేస్తున్నాను. చదువు ఉంటే విజ్ఞానం వస్తుంది. కాబట్టి మరింత ఉన్నతంగా అందరూ బతుకాలనేదే నా ఆశ. అందుకోసమే ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను.
కూరెళ్ల విఠలాచార్య

611
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles