ఇప్పుడు మేం స్నేహితులం!


Sun,March 11, 2018 01:36 AM

నేను డిగ్రీ చదివే రోజులు. మా కాలేజీ కో ఎడ్యుకేషనే అయినప్పటికీ ఎందుకో ఏమో అమ్మాయిల శాతం చాలా తక్కువగా ఉండేది. నాతో కలిపి మా బ్యాచ్‌లో మొత్తం ఏడుగురం ఉండేవాళ్లం. అబ్బాయిలు.. అమ్మాయిలు అని భేదం నాకు లేదుగానీ.. చిన్నప్పట్నుంచే అబ్బాయిలతో పెద్దగా మాట్లాడకపోయేదాన్ని. ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో రెండు మూడు మాటలు మాట్లాడి సైలెంట్‌గా ఉండేదాన్ని. నా సైలెంట్‌ను మెచ్చుకునేవాళ్లున్నారు. తిట్టుకునేవాళ్లూ ఉన్నారు. చిట్టి చాలా మంచిది ఎవరి జోలికి పోదు. తన పనేంటో తాను చేసుకుంటుంది అనేవాళ్లు కొందరు. ఈ జమానాలో ఇలా ఎవరితో అంటీముట్టకుండా.. ముభావంగా ఉంటే ఎలా? అనేవాళ్లు ఇంకొందరు. ఎవరు ఏమనుకున్నా.. చిన్నప్పట్నుంచి నేను అలాగే పెరిగాను. ఇప్పటికిప్పుడు నా ప్రవర్తన మార్చుకోవాలంటే కష్టం అని నేను నాలాగే ఉండటానికి ప్రయత్నించేదాన్ని. అయితే.. నా ఈ నిశ్శబ్ద ధోరణే నా జీవితాన్ని మలుపు తిప్పింది. కాలేజీలో కూడా నన్ను చిట్టీ అనే పిలిచేవాళ్లు. అబ్బాయిలు ఇరవై ఆరుమంది ఉండేవాళ్లు.

ఎందుకో ఏమోగానీ నా సైలెన్స్‌ను అమ్మాయిలు భరించలేకపోయేవాళ్లు. కానీ అబ్బాయిలైతే నన్ను అభిమానించేవాళ్లు. డీసెంట్ ఫెలో అనేవాళ్లు. నాది బయలాజికల్ సైన్స్ కాబట్టి ప్రాక్టికల్స్ క్లాసెస్‌ను గ్రూప్‌లుగా విభజించేవాళ్లు. మా గ్రూప్‌లో నేను.. మరో నలుగురు అబ్బాయిలు. ప్రాక్టికల్స్ కాబట్టి.. ఉన్నదే ఐదుగురం కాబట్టి నేను వాళ్లతో మంచి కమ్యునికేషన్‌తోనే ఉండేదాన్ని. వాళ్లు కూడా నాతో మంచిగానే ఉండేవాళ్లు. అయితే వాళ్లలో కిషోర్ అనే అబ్బాయి నన్ను బాగా ఇష్టపడేవాడట. నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నేను సైలెంట్‌గా ఉండటం అతనికి నచ్చేదట. అంతా బాగానే ఉంది కానీ అతడు నాతో ఈ విషయం చాలా రోజులవరకూ చెప్పలేదు. అతనిది కూడా నాలాగే విలేజీ బ్యాక్‌గ్రౌండ్. అతడూ పెద్దగా ఎవరితో మాట్లాడడు. అవసరం ఉంటేనే ఓ నాలుగు మాటలు మాట్లాడి సైలెంట్‌గా ఉంటాడు. మాటతీరు.. ప్రవర్తనను చూసి తోటివాళ్లు ఆటపట్టించేవాళ్లు. దీంతో అతడు ఒంటరిగా ఫీలయ్యేవాడు. ఒకసారి ప్రాక్టికల్ క్లాస్ స్టార్ట్ అయింది. ఉన్నట్టుండి ఇద్దరు డుమ్మా కొట్టారు. నేను కిషోర్ ఇంకో అబ్బాయి నవీన్ ముగ్గురమే ఉన్నాం. నవీన్ క్లాస్ అయిపోగానే వెళ్లిపోయాడు. లంచ్ టైమ్‌లో నేను.. కిషోర్ కలిసి తింటున్నాం. ఇద్దరం ఇద్దరమే. పొడి పొడి మాటలు. చిట్టీ.. అంతా నన్ను ఆటపట్టిస్తారు.
Love

నాకు కాలేజీ విడిచి వెళ్లిపోవాలనిపిస్తుంది. వేరే కాలేజీలో చేరుతాను. నేను పల్లెటూరిలో పుట్టాను.. పెరిగాను. నా మాటలు ఇలాగే ఉంటాయి. అయినా మరీ చండాలంగా ఏమీ మాట్లాడటం లేదు కదా? మరి వీళ్లెందుకు నన్ను ఆటపటిస్తున్నారు? నాతో ఆడుకునే హక్కు వీరికెక్కడిది? అని అమ్మాయి ఏడ్చినట్టు ఏడ్చేశాడు. నాకు బాధనిపించింది. అతనిలో ఇంత బాధ ఉందా? అనిపించింది. వేరేవాళ్లతో చెప్పి ఉంటే ఏదన్నా ప్రయోజనం ఉండునేమోగానీ.. పోయిపోయి నాతో చెప్పాడు అని నేనూ బాధపడ్డాను. అప్పటికప్పుడు ఏదో సర్ది చెప్పి వెళ్లిపోయా. కానీ హాస్టల్‌కెళ్లాక ఎందుకో అతడే గుర్తొచ్చాడు.

మరీ ఇంత అమాయకంగా ఉంటారా అబ్బాయిలు అనిపించింది. నాకు కొంచెం రిలీఫ్ అయింది. ఎందుకంటే నేనే అమాయకురాలిని అనుకుంటే నాకంటే అమాయకులు ఉన్నార్లే అనిపించింది. నా విషయం పక్కకు తప్పుకుంది. పదే పదే కిషోరే గుర్తొస్తున్నాడు. కాలేజ్‌కెళ్లాక మళ్లీ ఏదో ముచ్చట చెప్పాడు. నేను అతన్ని ఓదార్చాను. ఇలా రోజులు గడుస్తున్నాయి. అతడిలో చాలా మార్పు వచ్చేసింది. వాస్తవానికి అతడు ఇంటలిజెంట్. తనను బనాయిస్తున్నారనీ.. వేరేవాళ్లకు ఓసారి అవకాశం ఇస్తే తనమీద దృష్టి ఉండదనీ కావాలని ఓసారి ఎగ్జామ్ మామూలుగా రాశాడు. కానీ నాతో కలిసి తిరగడం వల్ల అతనిలో చాలా మార్పులు వచ్చాయి. ఎవరికీ భయపడటం లేదు. ఒకసారి మా క్లాస్ గిరి అనే అబ్బాయి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఏంటి ఆ బిత్తిరోన్ని వేసుకొని తిరుగుతున్నావ్? వాడికి లేనిపోనివేవో నేర్పిస్తున్నావ్. అంత బాగా నచ్చాడా వాడు? మేం అందంగా లేమా? అంటూ ఏదోదే మాట్లాడాడు. కిషోర్‌కు ఈ విషయం చెప్పొద్దనుకున్నా. కానీ మా ఫ్రెండ్ రజిత చెప్పేసింది. కోపం తెచ్చుకున్న కిషోర్ వెంటనే గిరి దగ్గరకు వెళ్లి ఘర్షణకు దిగాడు. చిట్టీ అంటే నాకిష్టం. నేనంటే ఆమెకిష్టం. ఇప్పటిదాకా మా మధ్య స్నేహమే తప్పా వేరే ఏమీ లేకుండే. లేనిపోని అభాండాలు ఆ అమ్మాయిపై వేశావు.

ఇప్పుడు కాలేజీ అంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. సైలెంట్‌గా ఉంటుందనుకుంటే అబ్బాయిలను ఆగం చేస్తుంది కదా అని చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నా మేం ఇప్పట్నుంచి ప్రేమికులం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని బెదిరించాడట. నాకు ఈ విషయం రజిత చెప్పింది. నేను ఆశ్చర్యపోయా. కానీ నాలా ఆలోచించే అబ్బాయితో ప్రేమ అనేసరికి నా మనసు వద్దు అని చెప్పలేకపోయింది. కిషోర్ నేనంటే నీకు నిజంగా ఇష్టమా? అన్నాను. అవునుఅన్నాడు కిషోర్. అలా సెకండియర్ గడిచింది. ఫైనలియర్‌లో బాగా చదువుకొని పీజీ చేసిన తర్వాత పెండ్లి చేసుకుందామని డిసైడయ్యాం. చదువు.. ప్రేమ తప్పిస్తే మాకు వేరే ప్రపంచమే లేదు. కిషోర్ కాలేజీతో పాటు క్యాటరింగ్ కూడా చేసేవాడు. వచ్చిన డబ్బులతో నాకు చాలాసార్లు డ్రెస్‌లు తీసుకున్నాడు. సినిమాలకు కూడా వెళ్లాం.

అయితే విషయం కాస్తా మా అన్నకు తెలిసింది. మా అన్నయ్య గిరి, వాళ్ల బావ ఇద్దరూ క్లాస్‌మేట్స్. గిరి మా మీద కోపంతో వాళ్ల బావ ద్వారా మా అన్నయ్యకు విషయం చెప్పాడు. చూడు చిట్టీ.. అమ్మానాన్నలు మనల్ని చాలా పద్ధతిగా పెంచారు. వ్యవసాయం చేయగా వచ్చిన ప్రతీ పైసాను కూడబెట్టి మనల్ని చదివిస్తున్నారు. కిషోర్ గురించి నాకు తెలుసు. అతను మంచోడే. కాదనలేను. కానీ ఈ ప్రేమలు అవీ మనకెందుకు చెప్పు? అని అతి సున్నితంగా మందలించాడు. నేను తట్టుకోలేకపోయాను. నా స్వభావం వల్ల నేను పుట్టినప్పట్నుంచి ఎవ్వరితో షేర్ చేసుకోలేని విషయాలను కిషోర్‌తో చేసుకున్నాను. పేరెంట్స్ కంటే ఎక్కువ చనువుతో అతనితో ఉన్నాను. నాలో ఒక మంచి మార్పు వచ్చింది కిషోర్ వల్లనే. ఇంకోటి అతను కూడా నాలాంటి వ్యక్తే కావడం. ఇంతకన్నా అదృష్టం నాకేముంటుంది అనే సమయంలో ఈ ఘర్షణ జరగడం నాకు బాధగా అనిపించింది. ఎలాగైనా కిషోర్‌ను దూరం చేసుకోవద్దనుకొని అన్నయ్యతో గొడవకు దిగాను. నాకు ఇష్టం వచ్చిన అబ్బాయితో ప్రేమలో ఉంటే తప్పేంటి? అనే సరికి అన్నయ్య తట్టుకోలేకపోయాడు. నాపై చేయి చేసుకున్నాడు కూడా. ఎంత చెప్పినా నేను వినకపోవడంతో కిషోర్‌ను కొట్టడానికి గిరితో సహా వెళ్లాడు అన్నయ్య. అతన్ని కొట్టడమే కాదు.. మళ్లీ చిట్టివైపు చూస్తే ప్రాణాలతో ఉండవని బెదిరించారు. కిషోర్ కూడా వారితో గట్టిగానే మాట్లాడాడు. అయితే దురదృష్టం వెంటాడి మమ్మల్ని విడదీసింది. సిటీలో ఈ ప్రేమ గొడవలు జరుగుతుండగానే కిషోర్‌వాళ్ల మేనత్త కుటుంబ గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. అంత్యక్రియల రోజే ఆస్తుల గురించి పంచాయతీ అయిందట. కిషోర్ వాళ్ల మామయ్య ఆర్నెళ్లకే మరో పెండ్లి చేసుకున్నాడు. అప్పటికే ఒకమ్మాయి ఉంది. ఆమె ఇంటర్ చదువుతున్నది. వేరే పెండ్లి చేసుకుని ఇక ఆ అమ్మాయినేం చూసుకుంటాడని కిషోర్‌తో పెండ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. అందరిముందు నేను చిట్టీని ప్రేమించాను.. ఆమెనే చేసుకుంటానని కిషోర్ అన్నాడట.

చూడు కిషోర్. నువ్వు తీసుకునే నిర్ణయం మీదే ఆ అమ్మాయి భవిష్యత్ ఆధారపడి ఉంది అని ఒత్తిడి తీసుకురావడంతో ఏమీ చేయలేక.. ఇష్టం లేకున్నా కిషోర్ ఆ అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు.
పెండ్లయిన ఆర్నెళ్లకు నాకు ఈ విషయం తెలిసింది. మా అన్నయ్యే చెప్పాడు. వాడంతట వాడు పెండ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు. నువ్వు ఇంకా పిచ్చిదానిలా ఆలోచించకు అని కోప్పడ్డాడు. అన్న చెప్పింది ఏమాత్రం నమ్మలేదు. ఏదో బలమైన కారణం లేనిదే కిషోర్ ఒప్పుకోడు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నా. చేసేదేమీ లేక వేరే అబ్బాయితో పెండ్లి చేసుకున్నా. పెండ్లి తర్వాత కూడా నేను ఎంబీఏ చేశాను. ఒకట్రెండు కంపెనీల్లో జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. కానీ ఊళ్లో ఉండటం వల్ల వెళ్లలేకపోయాను. పెండ్లి తర్వాత కొన్నాళ్ల వరకు మేం బాగానే ఉన్నాం. అబద్దాలు చెప్పి భర్తను మోసం చేయడం ఇష్టం లేక నా ప్రేమ విషయం చెప్పాను. మా భర్త కూడా కొంతకాలం నన్ను అర్థం చేసుకున్నాడు.

కాకపోతే ఎవరో కావాలని అతడికి లేనిపోనివి నూరి పోశారు. పెండ్లికి ముందే నేను కిషోర్‌తో కలిసి ఎంజాయ్ చేశాననీ.. తిరిగాననీ అప్పుడప్పుడు అంటుంటాడు. మాకిప్పుడు ఇద్దరు పిల్లలు. ఇంట్లో ఉంటే ఇలాంటి గొడవలు వస్తాయని హైదరాబాద్ వచ్చేశాం. నా ఎంబీఏ ఇప్పుడు పనికొచ్చింది. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నాకు క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. ఒకరోజు ఆఫీస్‌కు వెళ్తున్నా. క్యాబ్ వచ్చి ఆగింది. నేను ఆదరాబాదరగా రెడీ అయి క్యాబ్ ఎక్కాను. తీరా చూస్తే ఆశ్చర్యం. క్యాబ్ డ్రైవర్ కిషోర్. ఆశ్చర్యపోయాను. షాకయ్యాను. అసలు నమ్మలేకపోయాను. ఇది కలేమో అనుకున్నాను. కానీ నిజం. కిషోర్ మళ్లీ కలిసినందుకు నేను హ్యాపీగా అయితే ఉన్నాను. రోజూ అతనితో మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడు నాకు ఫ్యామిలీ కూడా ఉన్నది. ఏమీ చేయలేం. కాకపోతే స్నేహితులుగా ఉంటున్నాం. ఆఫీసులో కూడా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇప్పటికే ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేసి గొడవలు తెచ్చుకున్నాను. ఇక అన్నీ ఇలాగే చెప్పుకుంటూ పోతే నాకంటూ సంతోషించడానికి ఏదీ ఉండదని ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచుతున్నాను.
కిషోర్.. విధి మనల్ని విడదీసింది. ఎవరి అంతట వాళ్లున్నాం. సంసార పనుల్లో బిజీగా ఉన్నాం. కానీ అనుకోకుండా.. ఆశ్చర్యంగా ఇప్పుడు మనం మళ్లీ కలుసుకున్నాం. నీ మనసులో ఏమీ పెట్టుకోకు. నా మనసులోనూ ఏమీ లేదు. ఇప్పుడు మనం ప్రేమికులం కాదు. స్నేహితులం. స్నేహితులుగానే ఉందాం. హ్యాపీగా ఉందాం.

ఇట్లు
నీ స్నేహితురాలు చిట్టీ!

తొలిప్రేమకు ఆహ్వానం!
ప్రేమ శాశ్వతం. ప్రేమ యథార్థం. ఈ ప్రపంచమంతా ప్రేమమయమైతే ఎంతో బాగుండనిపిస్తుంటుంది. అలాంటి ప్రేమలో తొలిప్రేమది మధురఘట్టం. ఒక రకంగా నిజమైన ప్రేమకు జ్ఞాపిక తొలిప్రేమ. కాలేజీ లైఫ్‌లో ప్రేమాభిమానాలను చూరగొన్న.. మీ లైఫ్‌లోకి తొంగిచూసిన.. తెరువని పేజీయై మీ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన, తడియారని తొలిప్రేమ గురించి రాసుకోవాలనుందా? మరొక్కసారి ఆ జ్ఞాపికను చూసుకోవాలనుందా? అక్షర రూపంలో అద్భుత కావ్యంగా మలుచుకునే అవకాశం మీకు మేము కల్పిస్తున్నాం. ఇదే మా ఆహ్వానం!
ప్రేమ కథలు రాయాల్సిన చిరునామా: బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034. ఈ-మెయిల్ : sunmag@ntdaily.news

1226
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles