ఇతడు వేల మొక్కలు నాటాడు


Sun,September 2, 2018 01:11 AM

Gangadhar
మొక్కలంటే అతనికి ప్రాణం, మొక్కలు నాటడమంటే చాలా ఇష్టం. పర్యావరణ సంరక్షణ అతని ధ్యేయం, మొక్కలు నాటే కార్యక్రమం ఉందంటే అందరికంటే ముందుగానే అక్కడ ప్రత్యక్షమై కార్యక్రమంలో భాగస్వామి అవుతాడు. ఇంటికో మొక్కను పంపిణీ చేసి నాటమంటాడు. పాఠశాల విద్యార్థులతో మొక్కలు నాటిస్తాడు. అటు ప్రజాప్రతినిధులు,ఇటు అధికారులు, మరోవైపు ప్రజల సహకారంతో మొక్కలు నాటడంతో పాటు నాటిన మొక్కలు ఎండి పోకుండా కాపాడిన ప్రజలకు, విద్యార్థులకు చిన్న చిన్న బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. కోటి మొక్కలు నాటడమే జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే 38 వేల మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు. పర్యావరణ పరిరక్షకుడు మరో వనజీవి గాలి భాస్కర్ పరిచయం..
-బేతి గంగాధర్, సెల్: 9959021021

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని రంగరావుపల్లికి చెందిన గాలి భాస్కర్ గ్రామంలో చిన్న కిరాణం కొట్టు, చికెన్ సెంటర్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇందులో వచ్చిన సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుంటాడు. రోజురోజుకూ పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిని కాపాడటానికి తన వంతు కృషి చేయాలనుకున్నాడు. 2011లో పర్యావరణ సంరక్షణపై మక్కువతో నవోదయ పర్యావరణ స్వచ్ఛందసేవా సంస్థను ఏర్పాటు చేసాడు. ఏ కార్యక్రమాన్నయినా ఇంటి నుండి ప్రారంభిస్తేనే విజయం సాధిస్తామన్న నమ్మకంతో మొదట తన గ్రామంలోనే పర్యావరణ పరిరక్షణకు నడుం బింగించాడు. గ్రామంలోని ప్రజలు సైతం భాస్కర్ చేస్తున్న మంచి పనికి సహకరించారు. దీంతో మొదటగా గ్రామంలో ఇంటింటికీ ఒక్కో మొక్క చొప్పున పంపిణీ చేసాడు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాడు. జిల్లా మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా ఉత్తమ సామాజిక సేవకునిగా అవార్డును అందుకున్నాడు.

38 వేల మొక్కలు

కిరాణ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూనే, కొంత మొత్తం వినియోగించి నర్సరీల నుండి మొక్కలను తీసుకు వచ్చి పంపిణీ చేయడంతో పాటు స్వచ్ఛందంగా మొక్కలు నాటుతుంటాడు. రహదారులకు ఇరువైపులా, ప్రార్థనా మందిరాలు, పంట పొలాలు, పాఠశాలల్లో స్థానికంగా ఉండే ప్రజలు, యువజన సంఘాలు, విద్యార్థుల ద్వారా ఇప్పటికే 38,000 మొక్కలు నాటాడు. మొక్కలు నాటడమే కాకుండా వేసవి కాలంతో మొక్కలు ఎండి పోకుండా ట్రాక్టర్ల ద్వారా నీటిని అందిస్తున్నాడు. తాను పెంచడమే కాకుండా యువకులు, విద్యార్థులకు మొక్కల పెంపకం వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తూ మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహిస్తున్నాడు. ప్రస్తుతం భాస్కర్ నాటిన మొక్కలు అతను చేసిన కృషికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

మొక్కలు నాటి పెంచిన వారికి ప్రోత్సాహం

గంగాధర మండలంతోపాటు చుట్ట పక్కల మండలాల్లోని వివిధ గ్రామాల్లో మహిళలకు, విద్యార్థులకు సొంత ఖర్చుతో తీసుకు వచ్చిన పండ్ల, పూల మొక్కలను స్వచ్ఛందంగా అందజేస్తుంటాడు. తాను మొక్కలు నాటడంతో పాటు పాఠశాల విద్యార్థులతో, ప్రార్థనా మందిరాలు, ఖాళీ ప్రదేశాల్లో స్థానిక యువజన సంఘం సభ్యులతో మొక్కలు నాటిస్తాడు. అంతేకాకుండా ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేస్తాడు. గ్రామాల్లో సైతం గృహిణులకు మొక్కలు పంపిణీ చేసి నాటిస్తాడు. మొక్కలు నాటడంతోపాటు అవి ఎండిపోకుండా కాపాడిన వారికి బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తుంటాడు.
Gangadhar1

ప్రముఖల అభినందనలు

పర్యావరణ సంరక్షణకు నడుం బిగించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న గాలి భాస్కర్‌కు ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి అభినందలు వెల్లువెత్తాయి. గత ఏడాది ఆగస్టు 15న జిల్లా మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా ఉత్తమ సామాజిక సేవకునిగా అవార్డును అందుకున్నాడు. ప్రకృతి ప్రేమికునిగా మొక్కలు నాటి పెంచుతున్న సందర్భంగా కమిషనర్ కమలాసన్‌రెడ్డి భాస్కర్‌ను తన కార్యాలయంలో అభినందించారు.

435
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles