ఇంద్రజిత్తు


Sun,December 2, 2018 02:23 AM

indreajith
అమోఘమైన తెలివి తేటలు, మహోన్నతమైన బలపరాక్రమాలు, శాస్ర్తాలన్నీ నేర్పిన విద్యా వివేకాలు, ప్రపంచానికే ఆసరా అయ్యేంత అధికారం.. ఇలాంటివన్నీ ఉన్నా సమాజానికి చేటు చేసే ధోరణి పెరిగిపోతుంది తప్ప ఆదర్శభావాలతో రాబోయే తరాలను ఉద్ధరించాలనే తలంపే రావడం లేదు. చెడుపై గెలిచేది మంచే అయినా, దాని వంతు వచ్చేలోగా దాని నీడలో బతికేవారి మనసులకు తగిలే గాయాల మాటేమిటీ? బలం బలహీనతకు చేయూతనివ్వాలే గానీ, బలహీనతను మట్టుపెడుతూ పోతే చివరకు మిగిలేదేంటనే ఆలోచనలు ఒక్కోసారి మనలను సతమతం చేస్తుంటాయి. కాస్త మనసు మీదకు తీసుకొని ఆదుర్దాపడితే క్షణకాలం ఊపిరి ఆగినంత పనవుతుంది. గతం నుంచే భరోసా, భవిష్యత్తుపై పెంచుకునే ఆశల కారణంగానే ఇంద్రజిత్తులాంటి మేధావినీ, తెలివైన వీరుడినీ, బలమున్న బ్రహ్మర్షి వారసుడినీ అధర్మం దిశగా నిలబెట్టిందనే వాస్తవం నుంచి సమాజం ఏం ఆశించాలి? అలాంటి వాడి ఆగడాలకు కాసేపు రామలక్ష్మణులే తల్లడిల్లారంటే, మామూలు వారి మాటేమిటి?

- ప్రమద్వర

రావణుని పెద్ద కొడుకైన మేఘనాథుడే ఇంద్రజిత్తు. మాయావీ, మేధావీ అయిన మేఘనాథుడు రావణుడిని ఇంద్రుని చెరనించి విడిపించడానికి ఇంద్రుని గెలిచి జేయుడైన కారణంగా ఇంద్రజిత్తుగా పేరుగడించాడు. తండ్రిని మించిన కొడుకు, అహంకారి, తన బలం పట్ల గర్వాన్నీ, తన మాయ విద్య పట్ల హెచ్చిన ఆత్మవిశ్వాసాన్ని ఇంద్రజిత్తు తన వ్యక్తిత్వంగా మలుచుకున్నాడు. దేవేంద్రుడిని జయించిన వాడూ, ముల్లోకాలనూ ముప్పతిప్పలు పెట్టిన లోక శత్రువూ, అధర్మాలకూ, అకార్యాలకూ నెలవైన వాడూ అయిన ఇంద్రజిత్తు కనులెర్ర జేస్తే కాలాంతకుడే కనుమూస్తాడట. చివరికి తన రాక్షస జాతి అంతమైపోయేందుకు తానే ఆనవాలుగా మిగిలిపోయాడు.

రావణలంక వానరుల దాడితో అల్లకల్లోలం అయిన సమయంలో, మహా మహా రాక్షస వీరులందరూ మరణించిన తరుణంలో రావణుడు మానసికంగా కుంచించికుపోయి, ఆలోచనలతో ఉడికిపోయి లంక జాగ్రత్త అని అంటాడు. లంకను కాపాడండని తన వారిని ఆజ్ఞాపిస్తాడు. మహారావణుడైన తన తండ్రి శోకంతో దీనంగా నిట్టూర్చడం సహించని ఇంద్రజిత్తు రావణునితో, నేనింకా బతికే ఉన్నాను. నేనుండగా నా తండ్రి బాధపడటమా! అని రావణుడై రణరంగానికి వెళతాడు. అనేకమంది వానర వీరులను తన వెలుగుల బాణాలతో అతలాకుతలం చేస్తాడు. రామలక్ష్మణులపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. రామలక్ష్మణులు మూర్ఛపోతారు. అదే తన విజయమనే గర్వంతో లంకకు చేరుతాడు.

రావణుడు తనకు ఆప్తులైన రాక్షసులూ, తన పరివారంలోని వారు అందరూ హతులైనారనీ, ఇక నీవు తప్ప లంకను ఎవరూ కాపాడలేరనీ ఇంద్రజిత్తును పిలిచి తన మాయా యుద్ధంతో శత్రువులను మభ్యపెట్టమని పురమాయిస్తాడు. తండ్రి ఆజ్ఞతో ఇంద్రజిత్తు యజ్ఞభూమికెళ్ళి హోమం చేస్తాడు. అందులోంచివచ్చిన అంతర్దాన రథం ఎక్కి మహాసముద్రంలా ఉన్న వానర సేనను తన బాణాలతో అల్లకల్లోలం చేశాడు. బాణాల వర్షం కురుస్తుంది. ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. అనేక మంది వానరులను మట్టుపెట్టాడు. మాయలు తెలిసిన వాడూ, యుద్ధకళలోనూ నిపుణుడూ అయిన ఇంద్రజిత్తు మాయ సతను కల్పించి తన రథంలో తీసుకొస్తున్నట్టుగా చూపిస్తూ యుద్ధరంగంలో వస్తుంటే, హనుమ దీనంగా, దిగులుగా, దయనీయ స్థితిలో ఇంద్రజిత్తు రథంపై సీతను చూస్తాడు. ఇంద్రజిత్తు సీత జుట్టు పట్టుకుని ఆమెను కత్తితో వధించినట్లు మాయ చేస్తాడు. అంతే హనుమ, వానరులూ దిగ్భ్రాంతి చెంది రామలక్ష్మణులకు విషయం చెప్పి భోరున విలపిస్తారు. రామలక్ష్మణులూ కాసేపు నిజమని భావించి నివ్వెర బోతారు. విభీషణుడు ఇంద్రజిత్తు మాయల గురించి చెప్పి, రావణుడు సీతను చంపడనే విశ్వాసం కలిగించాక తేరుకుంటారందరూ. అంత బలమున్నా, అన్ని మాయలు తెలిసినా, ఎదురు నిలిచి పోరాడే దమ్ములున్నా, అన్ని మాయలు తెలిసిన, ఎదురు నిలిచి పోరాడే దమ్ములున్నా, ఇంద్రజిత్తు తనదైన పైశాచిక ఆనందంతో రామదండును మానసికంగా కుంగదీయాలనే ఇదంతా చేశాడు.

ఇంద్రజిత్తు భూత బలినిచ్చి సంపూర్ణ యుద్ధ హోమం చేస్తున్నాడు. అది పూర్తి కాకూడదనే విషయం విభీషణుడు సూచిస్తే వానరులు రాక్షసులందరినీ మట్టుపెడతారు. లక్ష్మణుడితో ఇంద్రజిత్తు చాలా భయంకరంగా పోరాడతాడు. ఇద్దరూ ఇద్దరే ఎంతకూ యుద్ధం తెగడం లేదు. కానీ లక్ష్మణుడు సంధించిన ఇంద్రాస్ర్తానికి దిక్కులు దద్దరిల్లేలా, ఆకాశాం పగిలేలా, మహా అగ్నిగోళంలా వెళ్ళి ఇంద్రజిత్తును తాకింది. అంతే ఇంద్రజిత్తు నేల రాలాడు. మిగిలిన రాక్షసులు ప్రాణ భయంతో లంకకు పరుగులు తీశారు. మహా మహా రాక్షసులందరూ పోయారు. ఇంద్రజిత్తు తన పంతం వల్ల ఎంతోమంది రాక్షసులను తన వెంట మృత్యు ఒడిలోకి తీసుకెళ్లాడు. చక్కని రూపం, మహాశౌర్యం శరీరంగా గల ఇంద్రజిత్తు కాంతి పోయిన సూర్యుడిలా నేలపై పడివుండటం చూసి విభీషణుడికి కంటతడి ఆగలేదు. విభీషణుడి మనస్సు చెప్పినట్టు ఇంద్రజిత్తు లాంటి మహావీరులూ, శాస్త్రకోవిదులూ, అధికార దురంధరులూ చెడునడవడికకు అలవాటు పడిపోయి, అధర్మానికి నిలువెత్తు రూపంగా నిలిచి చరిత్రను చెదపట్టిస్తున్నారు. అదే వారిలోని శక్తీ ధర్మంగా మారితే చరిత్ర మరోలా ఉండేదేమో కదా!

చక్కని రూపం, మహాశౌర్యం

శరీరంగా గల ఇంద్రజిత్తు కాంతి పోయిన సూర్యుడిలా నేలపై పడివుండటం చూసి విభీషణుడికి కంటతడి ఆగలేదు. విభీషణుడి మనస్సు చెప్పినట్టు ఇంద్రజిత్తు లాంటి మహావీరులూ, శాస్త్రకోవిదులూ, అధికార దురంధరులూ చెడునడవడికకు అలవాటు పడిపోయి, అధర్మానికి నిలువెత్తు రూపంగా నిలిచి
చరిత్రను చెదపట్టిస్తున్నారు.

293
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles