ఆ ఐదుగురు..!


Sun,April 21, 2019 03:31 AM

వీళ్లంతా గృహిణులే. అందులోనూ సామాన్యులు. కానీ అందరిలా వంటింటికే పరిమితం కాలేదు. సంకల్పంతో, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లారు. నేడు లక్షల్లో సంపాదిస్తున్నారు. కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఆ చిరు పారిశ్రామిక వేత్తల పరిచయమిది.

ఇంటిపైనే సిరుల పంట..

ఢిల్లీకి చెందిన నమ్రతా గోయోంక ఎలాంటి ఎరువులు వాడకుండా సాగు చేస్తున్నారు. ఇంటిపైనే సహజ సిద్ధమైన కూరగాయలు, పుట్టగొడుగులు పండిస్తూ ఆదాయం పొందుతున్నారు. మిద్దె తోట లాంటిది ఏర్పాటు చేసిన నమ్రతా అతి కొద్ది సమయంలోనే గ్రీన్ ఆప్రాన్ సంస్థ ఏర్పాటు చేసి తన సహజసిద్ధ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. డీహైడ్రేటింగ్ నుంచి ఉపశమనం కలిగించే జాక్‌ఫ్రూట్స్, వివిధ రకాల కాయగూరలు పండిస్తున్నారు. నమ్రతా తనకు ఉన్న ఆసక్తితో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసర్చ్(ఐఐహెచ్‌ఆర్)లో మిద్దె తోటల సాగు అంశంలో శిక్షణ పొందారు. మష్రూమ్స్ ద్వారా ఆమె నెలనెలా వేలల్లో ఆదాయం పొందుతున్నారు.
Namrata-Goenka

మూసివేసే కంపెనీ లాభాల్లోకి..

పంజాబ్‌కు చెందిన సందీప్‌రాయత్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత తన తండ్రి చేస్తున్న వ్యాపారంలోకి ప్రవేశించారు. కొన్నాళ్ల తర్వాత తండ్రి మరణించడంతో వ్యాపారం నష్టాల్లోకి వెళ్లిపోయింది. దాదాపు రూ.10 కోట్లు అప్పులు, 45 కోర్టు కేసులు ఇవన్నీ ఆమెను వేధించాయి. కానీ ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా ఆమె ధైర్యంతో బాధ్యతలన్నీ భుజాలపై వేసుకున్నారు. ఒక్కొక్కటిగా తన వ్యాపారంలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకున్నారు. ప్రస్తుతం టాటా మోటర్స్, మహీంద్రా మహీంద్రా తదితర కంపెనీలకు విడిభాగాలను అందిస్తున్నారు. మూసి వేసే దశలో ఉన్న కంపెనీని లాభాల బాటలో పయనించేలా చేసి 350 మంది కార్మికులకు ఆమె అండగా నిలిచారు. ఆమె ప్రతిభను గుర్తించిన పంజాబ్ ప్రభుత్వం పర్మన్ పత్ర అవార్డును 2011లో అందజేసింది.
Sandeep-Riat

రైతులకు అండగా..

చెన్నైకి చెందిన మేనక, తిలక్‌రాజ్ దంపతులకు 2009లో అబ్బాయి పుట్టాడు. ఆ సమయంలో బాబుకు మంచి ఆహారం అందించాలనుకున్నారు. దానికోసం మార్కెట్లో శోధించారు. కానీ ఎక్కడ చూసినా కల్తీనే. ఇలా వారు తమ బిడ్డ విషయంలో మంచి ఆహారం అందించలేకపోతున్నామని బాధపడ్డారు. మరెవ్వరూ ఇలా బాధపడొద్దని ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేసి పలు ప్రాంతాల్లో, పంటక్షేత్రాల్లో పర్యటించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో, రైతులతో ముచ్చటించారు. వందల ఏండ్ల కిందట వేలల్లో వరి రకాలు సాగుచేసేవారని, ప్రస్తుతం పదుల సంఖ్యలో వరి వంగడాలను కూడా సాగు చేయట్లేదని శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకున్నారు. స్థానికంగా ఉండే రైతులకు అవగాహన కల్పించారు. 25 రకాలకు పైగా వరిని పండించేట్లుగా వేలాది మంది రైతులను ప్రోత్సహించారు. మేనక స్థాపించిన అశ్వత్ ఎకో ఆర్గానిక్స్ షాపు ద్వారా రైతులు పండించిన బియ్యాన్ని విక్రయిస్తున్నారు. రైతులను సేంద్రియ వ్యవసాయం చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం వేలాదిమంది వినియోగదారులకు ఆమె మంచి పోషక విలువలున్న బియ్యం అందిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు.
menaka-tilak-raj

ఆమె ఇష్టం లక్షల మందిని చేరింది..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిషా మధులికకు వంటలంటే ఇష్టం.. వండడమంటే మరీ ఇష్టం.. వండే విధానం ఇతరులకు తెలియజెప్పడమంటే ఇంకా ఇష్టం. అదే ఈమెకు ఇప్పుడు ఉపాధినిస్తున్నది. ఆ అభిరుచే ఆమెను సెలబ్రిటీ చెఫ్‌గా మార్చింది. ఇంట్లో తాను చేసే వంటలకు కుటుంబీకులు, బంధువులు ఫిదా అయ్యేవారు. అలా తన వంటలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారామె. తాను తయారు చేసిన వంటల వీడియోలు తీసి బ్లాగ్‌లో పొందుపర్చారు. అనంతరం మిత్రుల సలహా మేరకు యూట్యూబ్‌లో తన వీడియోలను అప్‌లోడ్ చేయసాగారు. మొదటిసారి 16 మే 2011లో వీడియోను అప్‌లోడ్ చేశారు. అప్పటి నుంచి కొత్త కొత్త వెరైటీలతో నిత్యం వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పేరు మీద ప్రారంభించిన యూట్యాబ్ చానెల్‌కు ఆరు లక్షల మందికి పైగా సబ్‌స్కైబర్స్ ఉన్నారు.
Nisha-Madhulika

వంద రూపాయల అప్పుతో..

చెన్నైకి చెందిన పట్రిషియా 17 ఏండ్ల వయసులో ప్రేమలో పడింది. 18 ఏండ్లకే విడాకులు తీసుకుంది. ఇక అప్పట్నుంచీ ఆమెను ఆర్థిక కష్టాలు వెంటాడాయి. దిక్కుతోచని స్థితిలో ఆమెకు వంటపై ఉన్న ఇష్టమే ఆమె ఉపాధిగా మార్చుకోవాలనుకున్నది. తల్లివద్ద నుంచి రూ.100 అప్పుగా తీసుకున్నది. ఆ డబ్బుతో మెరీనా బీచ్‌లో చిరుతిళ్లు అమ్మడం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్ది మొత్తంలో డబ్బు పోగేసి స్థానికంగా ఆర్డర్‌పై వంటలు తయారుచేసి సైప్లె చేయడం మొదలెట్టింది. ప్రారంభంలో ఇద్దరికి ఉపాధినిచ్చిన ఆమె ప్రస్తుతం తన రెస్టారెంట్ల ద్వారా 200 మందికి ఉపాధినిస్తున్నది. రోజుకు రెండు లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నది.
Patricia-Narayan

793
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles