ఆధిపత్య పోరు..


Sun,August 13, 2017 04:46 AM

-సార్వభౌమత్వం వైపు అడుగులు షురూ..

mana-charitraమొక్క.. పెరిగి మానుగా మారి మహావృక్షంగా ఎదగాలంటే ఎన్ని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాలి? ఎన్ని ఎదురుదెబ్బలు తినాలి? అయితేనేం.. అలా ఎదిగిన మహావృక్షం ఎంతమందికో నీడనిస్తుంది. ఎన్నో ప్రతిఫలాలనూ అందిస్తుంది. అచ్చంగా.. స్వచ్ఛంగా.. కాకతీయ మహాసామ్రాజ్యం కూడా ఇలాగే ఎదిగింది. రాష్ట్రకూటుల దగ్గర సేనానులుగా చేరిన కాకతీయులు తర్వాత పశ్చిమ (కళ్యాణి) చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. అప్పటికి ఆ చాళుక్య రాజ్యం అవసాన దశలో ఉన్నది. ఆధిపత్య పోరు నడుస్తున్నది. సరిగ్గా ఇక్కడే.. ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోటులను, ఎదురుదెబ్బలను, మహాయుద్ధాలను చవిచూసిన కాకతీయులు సార్వభౌమత్వం వైపు అడుగులు వేయడం షురూ చేశారు. అలా రెండవ ప్రోలరాజు కాలంలో భావి కాకతీయ మహా సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి.

అతనిది నిశ్శబ్ద తిరుగుబాటు.
అశశ్వద్ యుద్ధ నిబద్ధ గహ్వర మతిం..
నిరంతరం తిరుగుబాటుకు నిగూఢంగా ఆలోచనలు చేసే మనస్సు- తైలపుని గురించి శాసనాలు చెప్పిన వాస్తవం ఇది.
పశ్చిమ చాళుక్య రాజు.. ఆరో విక్రమాదిత్యుని కొడుకు ఈ తైలపుడు. అతనికి కుమార తైలపుడు, తైలపదేవ అనే పేర్లు కూడా ఉన్నాయి. తండ్రి పాలనలోనే కుమార వృత్తిగా కందూరునాడును పాలిస్తుండేవాడు.

నృపేశ్వరస్య పురతః రాజాంగణే శ్రీ జగదేకమల్ల పృథ్వీపతేః - అని హనుమకొండ శాసనం ప్రోలుడి గురించి చెబుతున్నది. ఈ మాటలను బట్టి తిరుగుబాటును అణచడంలో విశ్వాసపాత్రుడైన సామంతుడుగా ప్రోలుడు రాజు జగదేకమల్లుని పక్షాన నిల్చాడని చరిత్రకారులు చెప్పారు. ఇవేకాక ప్రోలరాజుకు సంబంధించిన అనేక సైనిక విజయాల గురించి గణపేశ్వరాలయ శాసనం చెబుతున్నది. రెండవ ప్రోలరాజు హయాంలోనే ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమైంది. ప్రతాపరుద్ర చరిత్రలో పేర్కొన్న ఈ విషయం క్రీ.శ. 1264 నాటి చింతలూరి తామ్ర శాసనం ద్వారా చరిత్రకారులు నిర్ధారించారు. ఓరుగల్లు కోటలోని స్వయంభూ దేవాలయాన్ని నిర్మించింది కూడా ఈయనే.


విక్రమాదిత్యుడు బతికి ఉన్నంత కాలం కందూరు చోడులు చాళుక్య ప్రభువులకు విధేయంగా ఉండేవారు. కానీ ఆయన మరణం తర్వాత, అంటే.. పెద్ద కొడుకు భూలోకమల్లుడు (తైలపుడి అన్న) రాజ్యానికి వచ్చినప్పటి నుంచి ప్రభువు పట్ల ఆ నాయకుల్లో అపనమ్మకం ఏర్పడింది. ఇందుకు కారణం తైలపుడు. తనకు కుమార వృత్తిగా వచ్చిన కందూరునాడును స్వతంత్రంగా ఏలాలన్న అతని కోరిక. అందుకే కందూరు చోడరాజ సోదరులు భీమ, గోకర్ణుల మధ్య కలహం పెట్టాడు. ప్రభువు భూలోకమల్లునికి కాస్త విశ్వాసపాత్రుడుగా ఉండే భీమచోడునిని చంపించాడు. ఈ విషయం మహారాజు భూలోకమల్లునికి తెలిస్తే యుద్ధం తప్పదని భావించిన తైలపుడు గోవిందరాజు మద్దతు కూడగట్టుకున్నాడు.

గోవిందరాజు చాళుక్య సేనాని. కొండపల్లి సీమ (పానగల్లు రాజ్యానికి ఆగ్నేయ దిశగా ఉన్న రాజ్యం-ప్రస్తుత హుజూర్‌నగర్ దాకా)ను పాలించేవాడు. ఇతనికి శౌచ గాంగేయుడు అనే బిరుదు ఉండేది. ఇతని మద్దతుకుగాను తైలపుడు పానగల్లు ప్రాంతంలో కొంత భాగాన్ని ఇచ్చాడు.
గోకర్ణుని హత్య తర్వాత.. తండ్రినీ, మండలాన్నీ పోగొట్టుకున్న ఉదయనచోడుడు (గోకర్ణుని కొడుకు) రాజు భూలోకమల్లుని దగ్గరకు వెళ్లాడు. తైలపుని కూటమి, కుట్రల గురించి ఫిర్యాదు చేశాడు. ఇందుకు ఆగ్రహించిన భూలోకమల్లుడు ఉదయచోడునికి రాజ్యం ఇప్పించాల్సిందిగా రెండవ ప్రోలుడిని ఆదేశించాడు.

ఈ ఆజ్ఞ అనుసారం కాకతీయ ప్రోలరాజు గోవిందరాజును తరిమివేసి పానగల్లులో ఉదయచోడునికి పునఃప్రతిష్టించాడు. దీంతో తైలపుడు ప్రోలుడిపై పగతో రగిలిపోయాడు. కాకతీయ రాజ్య ఉత్తర సరిహద్దులో అలజడి సృష్టించేందుకు మేడరాజు, ఇతని సోదరుడు గుండన (మంత్రకూట నాయకుడు-ప్రస్తుత మంథని)ను మచ్చిక చేసుకున్నాడు.
మేడరాజు పొలవాస మండల నాయకుడు. పొలవాస వరంగల్‌కు ఉత్తరాన ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని పొలాస. హనుమకొండను తాకుతూ నర్సంపేట వరకూ ఈ మండలం ఉండేది. కాకతీయులు, మేడరాజు కుటుంబాలు రెండూ ఒకే స్థాయి హోదా ఉన్న రాష్ట్రకూట సేనానులు. రాష్ట్రకూటుల తర్వాత పక్కపక్కనే ఉన్న తమ ప్రాంతాలను మహా మండలేశ్వరులుగా కొనసాగటాన్ని చాళుక్యులు అనుమతించారు. పొలవాస నాయకులు చాళుక్యుల పట్ల మొదట్లో స్నేహపూర్వకంగానే ఉన్నా కొంత కాలం తర్వాత విభేదించారు. చివరగా మేడరాజు చాళుక్య ప్రభువు వైరులతో చేయి కలిపి స్వతంత్రుడవ్వాలని ఆకాంక్షించాడు.

దీన్ని అదునుగా చేసుకుని తైలపుడు పొలవాస నాయకులను తనతో కలుపుకొన్నాడు. దీన్నంతటినీ గమనిస్తూనే ఉన్న భూలోకమల్లుడు తన కుమారుడు జగదేకమల్లుడిని ఉత్తరాధికారిగా నియమించి సింహాసనంపై కూర్చోబెట్టాడు.
చాలాకాలం నుంచి తమ సార్వభౌమత్వాన్ని అలక్ష్యం చేస్తూ వస్తున్న మేడరాజు, గుండరాజులపై జగదేకమల్లుడు బలగాన్ని పంపాడు. ఈ నాయకులను అణచివేయడంలో తన శౌర్యప్రతాపాలను చూపుతూ కాకతీయ ప్రోలరాజు యుద్ధంలో కీలకపాత్ర పోషించాడు. మంత్రకూటలో జరిగిన యుద్ధంలో ప్రోలుడు గుండయను ఓడించాడు. అతన్ని బందీగా పట్టుకొచ్చి నిండుసభలో ప్రభువు ముందు గుండు కొట్టించాడు. వక్షస్థలంపై వరాహ ముద్రను వేసి, అతని తల నరికాడు.
ఈ గుండయ శిరోఖండనం గురించి తెలుసుకున్న తైలపుడు హడలిపోయాడు. అసలు కుట్రకు కారకుడినైన తనని వదిలిపెట్టరని భావించాడు. అనుకున్నట్లుగానే తైలపుడిని కూడా ప్రోలరాజు యుద్ధంలో ఓడించి, బందీగా పట్టుకుని వచ్చాడు. కానీ జగదేకమల్లునికి తైలపుడు పినతండ్రి, రాజకుటుంబీకుడు అయిన కారణంగా జాలితో, ప్రేమతో వదిలివేశారు.
నృపేశ్వరస్య పురతః రాజాంగణే శ్రీ జగదేకమల్ల పృథ్వీపతేః - అని హనుమకొండ శాసనం ప్రోలుడి గురించి చెబుతున్నది. ఈ మాటలను బట్టి తిరుగుబాటును అణచడంలో విశ్వాసపాత్రుడైన సామంతుడుగా ప్రోలుడు రాజు జగదేకమల్లుని పక్షాన నిల్చాడని చరిత్రకారులు చెప్పారు.

ఇవేకాక ప్రోలరాజుకు సంబంధించిన అనేక సైనిక విజయాల గురించి గణపేశ్వరాలయ శాసనం చెబుతున్నది. రెండవ ప్రోలరాజు హయాంలోనే ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమైంది. ప్రతాపరుద్ర చరిత్రలో పేర్కొన్న ఈ విషయం క్రీ.శ. 1264 నాటి చింతలూరి తామ్ర శాసనం ద్వారా చరిత్రకారులు నిర్ధారించారు. ఓరుగల్లు కోటలోని స్వయంభూ దేవాలయాన్ని (కాకతీయల దగ్గర పరుసవేది ఉండేదా? - జూలై 2, 2017 నాటి మన చరిత్ర) నిర్మించింది కూడా ఈయనే.
రెండవ ప్రోలరాజుకు రుద్రదేవుడు, మహాదేవరాజు, హరిహర, రేపోల్ల దుర్గ అనే నలుగురు కుమారులున్నారు. వీరిలో రుద్రదేవుడు, మహాదేవరాజులు సుప్రసిద్ధ చక్రవర్తులుగా ఆ తర్వాత వెలుగొందారు.

చాళుక్య చక్రవర్తి తరఫున కోట వంశస్థుడైన చోడోదయుడు, హైహయ నాయకులను ప్రోలరాజు ఎదుర్కొన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో ప్రోలుడు వీరమరణం పొందినట్లుగా క్రీ.శ. 1169 నాటి ద్రాక్షారామ శాసనంలో, క్రీ.శ. 1195 నాటి పిఠాపుర శాసనంలో ఉన్నది.
ప్రోలుడు సాగించిన ఈ యుద్ధ పరంపర, శౌర్య ప్రతాపాలు.. భావి కాకతీయ మహాసామ్రాజ్యానికి బీజాలు వేశాయి. అయితే, అవి సార్వభౌమత్వం వైపు కాకతీయులు సాగించిన అడుగులు మాత్రమే.
రెండవ ప్రోలుడి తర్వాత అతని పెద్ద కొడుకు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చాడు. ఇక్కడే మొక్క కాస్తా మానైంది. ఇక మహావృక్షంగా ఎలా ఎదిగిందో.. కాకతీయ మహాసామ్రాజ్యానికి తొట్టతొలి సార్వభౌముడుగా అతను ఎలా గెలిచి నిలిచాడన్నది మరింత ఆసక్తికరం.
నగేష్ బీరెడ్డి, 91827 77177

1494
Tags

More News

VIRAL NEWS