ఆదిమానవుడి ఆనవాళ్ల పుట్ట సురగొండయ్య గుట్ట!


Sun,April 22, 2018 12:38 AM

తెలంగాణలో ప్రతీ ప్రాచీన కట్టడానికి ఏదో చరిత్ర, ఆధ్యాత్మిక నేపథ్యం ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి సురగొండయ్య గుట్ట. ఆదిమ చరిత్ర ఆనవాళ్లతో ఆధ్యాత్మిక, పర్యాటక, పరిశోధనా కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ గుట్ట ఒకనాటి ఆదిమానవుడి నివాస స్థావరంగా భావిస్తున్నారు. ఈ విశేషాలే ఈవారం దర్శనం.ఎక్కడ ఉన్నది?:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాతాడ్వాయి మండలం దామెరవాయిలో ఉన్నది.

ఎలా వెళ్లాలి?:

హైదరాబాద్ నుంచి వరంగల్ 145 కిలోమీటర్ల దూరం. వరంగల్ నుంచి 95 కిలోమీటర్ల దూరం వెళితే తాడ్వాయి, అట్నుంచి 17 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే దామెరవాయి వస్తుంది. దామరవాయికి రెండు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఆదివాసీ తెగలు ఆరాధ్యంగా భావించే సురగొండయ్య గుట్ట ఉంది.
Gutta

విశిష్టత:

ఇది ఆదివాసుల ఆరాధనా క్షేత్రం. మానవ జాతుల పరిణామ క్రమాన్ని తెలియజేసే చారిత్రక సాక్ష్యాలుగా ఇక్కడ ఆది మానవుని సమాధులున్నాయి. ఒకట్రెండు కాదు 145కు పైగా ఆదిమానవుని సమాధులు ఉండటం ఇక్కడి విశిష్టత.

గుత్తికోయల ఆరాధ్యుడు:

కొండపై సురగొండయ్య విగ్రహం ఉన్నది. వినాయకుడి విగ్రహంలా కనిపిస్తుంది. ఈ గ్రామంలో ఎక్కువ జనాభా గుత్తికోయలదే. మేడారంలో రెండు సంవత్సరాలకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకంటే ముందుగా పుష్యమాసం పున్నమికి ఈ విగ్రహం వెనుకటి రోజుల్లో జంతుబలి ఇచ్చి పండుగ చేసుకునేవారు.

నిర్మాణ శైలి:

సమాధుల నిర్మాణంలో నాటి మానవులు అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సుమారు నాలుగు మీటర్ల పొడవు, మూడు మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో కరకుగా చెక్కిన ఇసుక రాళ్లతో ఈ గుహలను నిర్మించారు. సమాధి చుట్టూ నాలుగు పెద్ద బండలను పెట్టి, వాటికి పై కప్పుగా మరో అతి పెద్ద రాయిని పెట్టారు. ప్రతి సమాధిలోను ఒక చిన్న నీటి తొట్టిలాంటి రాతి కట్టడాన్ని నిర్మించి ఉంచారు. సమాధి చివర మూలలో నాలుగు అడుగుల ఖాళీ వదిలారు. ఈ గుహ నిర్మాణానికి వర్తులాకారంలో సుమారు పది అడుగుల వ్యాసార్ధంతో చుట్టూ బండలను పేర్చి ప్రహరీ గోడని నిర్మించారు. దామెరవాయి పరిసర ప్రాంతాల్లో ఆదిమానవుల సమాధులు అసంఖ్యాకంగా ఉన్నాయి.

అప్పట్లోనే వాస్తు:

ఒక్కో సమాధి మధ్య సుమారు 100 అడుగుల దూరం ఉంది. ఇవి ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కుచెదరలేదు. వీటిని చూస్తే పక్కా ప్రణాళిక బద్ధంగా, నైపుణ్యంతో నిర్మించినట్లు తెలుస్తుంది. అన్ని సమాధులకు పైన కప్పుగా వాడిన ఒక్కో రాయి కచ్చితంగా 10 నుంచి 20 టన్నుల బరువు ఉంటుంది. సమాధుల ముఖద్వారాలు ఉత్తర, దక్షిణ దిక్కులకు మాత్రమే ఏర్పాటు చేయడాన్ని బట్టి చూస్తే వాళ్లు వాస్తు సంప్రదాయాన్ని పాటించి ఉంటారని స్థానికుల అభిప్రాయం.
Gutta1

ఈజిప్ట్ పిరమిడ్‌లా:

సురగొండయ్య గుట్టపైనున్న ఈ సమాధులు ఈజిప్టులోని పిరమిడ్ల లాగా మనిషి మరణం తరువాత మళ్లీ పునర్జన్మ ఉంటుందనే బలమైన విశ్వాసంతోనే ఆనాటి మానవులు నిర్మించి ఉంటారు. ఆది మానవులు చనిపోయిన తర్వాత మానవ శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు కావచ్చు. దీంతోపాటు వారికి వృత్తులు ఏమీ లేకపోవడంతో శవాలను పూడ్చిపెట్టి సమాధులను నిర్మించేందుకు ఎక్కువకాలం కేటాయించేవాళ్లని దక్షిణ భారతదేశ వ్యాప్తంగా సమాధులపై పరిశోధనలు చేసిన పురాతత్వ శాస్త్రవేత్త గురు రాజారావు పేర్కొన్నారు.

సమాధులపై పరిశోధన:

మైసూరు విశ్వ విద్యాలయంలో పురావస్తు ప్రొఫెసర్‌గా రాజారావు పని చేశారు. అయన రాసిన మెగాలిథిక్ కల్చర్ ఇన్ సౌత్ ఇండియా పరిశోధనా గ్రంథంలో డాక్టర్ విలియంకింగ్, మూలహారన్ అనే జియాలజిస్టులు 1877వ సంవత్సరంలో వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలోని అటవీప్రాంతంలో ఈ సమాధులను కనుగొన్నట్లు పేర్కొన్నారు. 1918వ సంవత్సరంలో వేక్ ఫీల్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు నిజాం పాలనలో పురావస్తు శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన ఖాజా అహ్మద్ తెలిపారు. ఈ నిర్మాణాలను బృహత్ శిలాయుగం నాటి డోల్మన్స్‌గా పేర్కొన్నారు. నిర్మాణంలో రాతి శిలలకు సంబంధించిన పనిముట్లను వాడారని, అందువల్ల వీటి నిర్మాణం కేవలం మూడు నుంచి ఐదు వేల సంవత్సరాల మధ్యకాలంలో జరిగి ఉంటుందని ఆయన అంచనా వేశారు. తెలంగాణలో మొత్తం 12 రకాల అదిమానవుని సమాధులు ఉన్నాయని అందులో ఈ రకమైన సమాధులు కేవలం గోదావరి పరీవాహక ప్రాంతాలలో మాత్రమే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాకాసి బండలు:

ఇక్కడి మానవ నిర్మిత సమాధులు గోదావరి నదీ పరీవాహక ప్రాంతానికి చెందిన పాతరాతి యుగంనాటి మానవ జాతులకు సంబంధించినవిగా స్థానికులు పేర్కొంటున్నారు. వీటిని రాకాసి బండలు, రాక్షసిగూళ్లు, రాకాసి గుహలు అని పిలుస్తున్నారు. వీటి గురించి స్థానికులను అడిగితే ఇలా వివరించారు. మా ముత్తాతల కాలానికి ముందే ఇవిక్కడ ఉన్నాయి. రాక్షసుల శవాలను ఇక్కడ పాతిపెట్టారనీ.. చనిపోయిన రాక్షసులు ఎప్పటికైనా మళ్లీ బతికి బయటకు వస్తారనే భయంతో సమాధి లోపల నీటి తొట్టిని, బయటకు రావడానికి చిన్న దారిని వదిలి వేశారని స్థానికులు చెప్తున్నారు.

870
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles