ఆదికవి సాహితీ సౌరభాలపాలకుర్తి


Sun,July 16, 2017 12:58 AM

భౌగోళిక.. వాతావరణ.. చారిత్రక స్థితిగతుల్లో తెలంగాణకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి విశిష్టత కలిగిన తెలంగాణ భూభాగంలో మరింత విశిష్టత కలిగిన ప్రాంతమే పాలకుర్తి. జనగామ జిల్లాలోని ఈ ఊరికి సాహిత్య.. సాంస్కృతిక.. కళా.. ఉద్యమ రంగాల్లో గొప్ప చరిత్ర ఉన్నది. విప్లవోద్యమాలకు పాలకుర్తి చిరునామా. వీర వనిత చాకలి ఐలమ్మ పాలకుర్తి బిడ్డ కావడం విశేషం. పోరాటాలతో పాటు సాహితీ సౌరభం కూడా ఇక్కడ విలసిల్లింది. తొలి తెనుగు విప్లవ కవి సోమనాథుడు జన్మించిన పురిటి గడ్డ ఇది. కాకతీయ రాజులు పాలించిన గడ్డ, కవులు కళాకారులకు సాహితీవేత్తలకు పురిటి గడ్డ పాలకుర్తి.గ్రామ స్వరూపం:
ఊరు : పాలకుర్తి
మండలం : పాలకుర్తి
జిల్లా : జనగామ
జనాభా :7819
ఓటర్లు :5258

సరిహద్ధులు:
తూర్పు : దర్దేపల్లి
పడమర : తొర్రూరు
ఉత్తరం : విస్నూరు
దక్షిణం : బమ్మెర
Paalakurthi

ఎక్కడ ఉంది? :

జనగామ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రత్యేకతలు :

కాకతీయ రాజులు పాలించిన గడ్డ. తొలి తెనుగు విప్లవ కవి పాల్కురికి సోమనాథుడు జన్మించిన గడ్డ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అండగానిలిచిన గడ్డ. హరిహరులు స్వయంభూవులుగా వెలిసిన ఆలయం పాలకుర్తి సొంతం. సోమనాథుడి సమాధి పాలకుర్తిలోనే ఉంది.

పేరెలా వచ్చింది? :

కాకతీయ రాజుల పాలనాకాలంలో పాలరాయుడి పేట పేరుతో ఈ ప్రాంతం ఏలుబడిలో పాలరాయుడి పేట పేరు క్రమక్రమంగా పాలకుర్తిగా రూపాంతరం చెందిందని కొందరు చెప్తుంటారు. మరికొందరు చెప్పేదేంటంటే కవి సోమనాథుడి ఇంటి పేరు పాల్కురికి.. తన సాహితీ సౌరభంతో ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనదిచ, సోమనాథుని ఇంటిపేరున ఈ గ్రామానికి పాల్కుర్తి.. తర్వాత పాలకుర్తిగా వ్యవహారంలోకి వచ్చిందనీ అంటారు.
Paalakurthi1

చారిత్రక నేపథ్యం :

కాకతీయ రాజుల పాలనలో పాలరాయుడు అనే సామంత రాజు పాలకుర్తిలో ఉండేవాడు. కాకతీయ రాజులు నాయంకర పద్ధతిలో సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేవారు. పాలరాయుడి కోటలో సైన్యాన్ని ఉంచేవారు. కాకతీయ రాజులకు యుద్ధ సమయంలో పాలకుర్తి నుంచీ పాలరాయుడు సైన్యాన్ని పంపేవాడని అంటారు. అదే విధంగా సోమనాథుడు పాలకుర్తిలోనే జన్మించాడు. తన రచనలతో ఇక్కడి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కవిగా పేరొందాడు. సామాన్య ప్రజల జీవితాలను తన కావ్యాలుగా, కథానాయకులుగా మార్చిన గొప్ప కవి సోమనాథుడు. చాకలి ఐలమ్మ మెట్టిన గడ్డ పాలకుర్తి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆంధ్ర మహాసభ ఏర్పాటులో పాలకుర్తికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాలకుర్తి పాత్ర మరవలేనిది. విసునూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి, అతడి కుమారుడు జగన్మోహన్ రెడ్డి (బాపూదొర), జానమ్మ దొరసానుల అరాచకాలపై తిరగబడ్డ గడ్డ పాలకుర్తి. ఇక్కడ పర్యాటక ప్రాంతాలూ ఉన్నాయి. కోనేరు, పంచగుళ్లు, పాలకుర్తి సోమనాథుడి సమాధి, పాటిమీది ఆంజనేయ స్వామి దేవాలయం, కాకతీయుల కోట, పాండవుల గుట్ట లాంటి చారిత్రక ప్రాంతాలుగా ఉన్నాయి.
Paalakurthi2

సోమనాథుడి సాహితీ నేల :

పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. వీరశైవ ప్రచారకుడిగా.. బసవపురాణం గ్రంథకర్తగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పేరున్నది. ఆదికవిగా.. విప్లవకవిగా మూడు భాషల్లో పండితుడిగా కీర్తిగాంచాడు సోమనాథుడు. ఇప్పటికీ సోమనాథుడి కాలంనాటి ప్రముఖ వీరశైవ క్షేత్రం ఉన్నది. ఆయన పూజ చేసి.. కొలిచిన సోమనాథాలయం ఉన్నది. ఈ ప్రాంతంపై చెరగని ముద్రవేసిన సోమనాథుడి సమాధి.. శిలా విగ్రహం.. ఇతర ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు సోమేశ్వరుడిని పూజించడం వల్ల జన్మించడంతో సోమనాథుడు అనే పేరు పెట్టారని గ్రామస్థులు చెప్తుంటారు. తెలంగాణ గర్వించదగ్గ రచనలు ఆయన సొంతం. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, భోగిని దండకం, చెన్నమల్లు సీసలు, బసవ రగడ, బసవ తోరణం వంటి రచనలతో పాటు చాలా పద్యాలు రాశాడు సోమనాథుడు. ఈ రచనల పరంగా ఆయన్ను ఆధునిక విప్లవ కవి అంటుంటారు. సోమనాథుడి మరణానంతరం పాలకుర్తిలో సోమనాథుడి సమాధి కట్టించారు. అదే సోమనాథ ఆలయం. సోమనాథుడి సమాధి మీద శివలింగాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తారు. సోమనాథ ఆలయంలో సోమనాథుడు తీసిన బావి కూడా ఇప్పటికీ ఉన్నది.
Paalakurthi3

చారిత్రక కట్టడాలు :

వందల సంవత్సరాల క్రితం ఇక్కడ రుషులు తపస్సు చేసేవారని.. వారికి ప్రత్యక్షమైన సోమేశ్వరుడు వారి కోరికపై భక్తజనులను ఆదరించడానికి స్వయంభూవుగా వెలిశాడని చెప్తుంటారు. సప్త రుషుల కోరికపై సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని కొందరంటుంటారు. పూర్వం ఒక వృద్ధురాలు నిత్యం స్వామికి ప్రదక్షిణ చేసేదట. అయితే ప్రదక్షిణ మార్గం లేక కొండ చుట్టూ తిరిగి వచ్చేదట. వయసు మీద పడుతున్న కొద్దీ ఆమె కొండచుట్టూ తిరగలేక ప్రయాస పడుతుంటే పరమేశ్వరుడు తన ఆలయం వెనుక కొండను చీల్చి ప్రదక్షిణ మార్గమేర్పరిచి ఆ వృద్ధురాలి ప్రయాసను తప్పించాడట. అందుకే ఇది చెక్కనిట్లుగా.. పగులగొట్టినట్లుగా కాకుండా చీల్చినట్లు కనిపిస్తుంది. శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం ఇక్కడి మరో ప్రత్యేకత. ఇది జనగామ జిల్లాలోనే అతి పెద్ద దేవాలయం. విష్ణుమూర్తి కలిసి ఉన్న దేవాలయం పాలకుర్తిలో ఉండడం చారిత్రక ప్రదేశం. కొండ దిగువన పాలకుర్తి సోమేశ్వరుడి సమాధి ఉన్నది. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో బమ్మెర పోతన గ్రామం బమ్మెర ఉన్నది. పాలకుర్తిలో సోమనాథుడి కాలంనాటి చెరువు ఉన్నది.
Paalakurthi4

పర్యాటక కేంద్రంగా విలసిల్లాలి:

పాలకుర్తి ప్రాంతం పర్యాటక కేంద్రంగా విలసిల్లాలి. పాలకుర్తి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. వెలసిన పుణ్యక్షేత్రం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇటీవల టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు పాలకుర్తికి రూ.10 కోట్లు, బమ్మెరకు 8 కోట్లు, వల్మిడికి 5 కోట్లు ప్రకటించడం ఆనందంగా ఉంది. పర్యాటక కేంద్రంగా త్వరలోనే వెలుగొందనుందని ఆశిస్తున్నాం.
-డాక్టర్ రాపోలు సత్యనారాయణ

వారసత్వ సంపదగా గుర్తించాలి:

పాలకుర్తి మహా కవి సోమనాథుడు పుట్టిన గడ్డ. పాలకుర్తి అసలు పేరు పాల్కూరికి. క్రమక్రమంగా పాలకుర్తిగా రూపాంతరం చెందింది. పాలకుర్తి చరిత్ర వారసత్వ సంపదగా గుర్తిస్తే మరింత అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ సోమేశ్వర ఆలయం ఉంది.
-దేవగిరి రామన్న శర్మ
Paalakurthi5

1087
Tags

More News

VIRAL NEWS