ఆకలి తీర్చే మహానుభావుడు


Sun,September 9, 2018 01:56 AM

Annam-Foundation
అమ్మను మించి దైవమున్నదా అంటే.. ఉందనే అంటున్నారు వీళ్లు. ఎందుకంటే వారికి అమ్మలా ఆదరించి, నాన్నలా చేరదీసి, మహానుభావుడిలా ఆకలి తీర్చే శ్రీనివాసరావు ఉన్నాడు కాబట్టి. అన్నం శ్రీనివాసరావు వారికి ఓ అండ, భరోసా, ఓ దిక్కు. తమ పాలిట ఆకలి తీర్చే మహానుభావుడని అంటున్నారు. అనాథలకు, అభాగ్యులకు అండగా నిలుస్తూ.. నాలుగు మంచిమాటలు చెప్పేకన్నా.. నలుగురికి సాయం చేయడమే మిన్నా అని చెబుతున్నాడు అన్నం శ్రీనివాసరావు.
- శీలం శ్రీనివాస్, సెల్: 9642457569

ఆకలితో ఉన్నోడే.. ఎదుటోడి ఆకలిని గుర్తించగలడు. కష్టాలను అనుభవించినవాడే.. బాధల్లో, కష్టాల్లో ఉన్నవారిని చేరదీయగలడు. చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించి, ఆకలికోసం కడుపు మాడ్చుకున్న ఈ వ్యక్తే... ఇప్పుడు వందలాది మంది ఆకలిని తీర్చుతున్నాడు. కుటుంబ సభ్యులు, కొడుకులు, కుమార్తెలు వెలివేయబడిన ఎంతోమంది వృద్ధులకు పెద్ద కొడుకుగా ఉంటున్నాడు. అనాథలకు, వృద్ధులకు ఆశ్రయం కల్పించి, మూడు పూటలా కడుపునిండా అన్నం పెడుతూ.. వారి దృష్టిలో దేవుడయ్యాడు. పేగుబంధాన్ని మరిచి కన్నవారిని నడిరోడ్డుపై వదిలేస్తున్న ఎంతోమంది పుత్రరత్నాలు అన్నం శ్రీనివాసరావు నుంచి చాలా నేర్చుకోవాలి.
Annam-Foundation2
ఆకలి తెలిసివాడు: అన్నం శ్రీనివాసరావుది మహబూబాబాద్ జిల్లా సమీపంలోని గార్ల మండలం పొన్నగంటితండా. సౌభాగ్యమ్మ, రామయ్య దంపతులకు ఐదో సంతానంగా జన్మించాడు. చిన్నప్పటి నుంచే బతికేందుకు ఎన్నో కష్టాలు అనుభవించాడు. పూటగడువని పరిస్థితిలో కూడా పక్కవాడి ఆకలిని తీర్చిన మంచి మనిషి. అంత కష్టాల్లోనూ ఐతపు మంగపతిరావు నిర్వహణలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో చదివాడు. అప్పుడే ఏటిలో కొట్టుకుపోతున్న తోటి విద్యార్థిని ప్రాణాలకు తెగించి కాపాడడం ఆయన సాహసం, సేవా తత్పరతకు నిదర్శనం. పదో తరగతి వరకు చదువుకున్న శ్రీనివాసరావు ఇల్లు గడువడం కోసం ఓ ఆసామి వద్ద కూలిపనికి కుదిరాడు. పేదరికం నుంచి గట్టెక్కేందుకు తల్లితో కలిసి ఊరూర తిరిగి దుస్తులమ్మే వ్యాపారం చేశాడు. బూర్గంపాడు మండలంలోని సారపాక ఐటీసీ పేపర్‌మిల్లు నిర్మాణ పనుల్లో, బెంగుళూరు పెంకుల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేశాడు. అడవికెళ్లి కట్టెలు తెచ్చి ఊరూరు తిరిగి అమ్మి పొట్టపోసుకునేది వారి కుటుంబం. కొంతకాలానికి టెలికాం శాఖలో రోజువారీ కూలీగా చేరి, ఉద్యోగి మారాడు.

దిక్కులేని వారికి దిక్కు: అనాథలు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు అన్నం శ్రీనివాస్. రోడ్డుపక్కన అనాథ శవం కనిపిస్తే చాలు.. ఆ శవానికి అన్నీ తానే అయి అంత్యక్రియలు చేస్తాడు. రోడ్డు మీద ఎవరైనా మతిస్థిమితం లేని వ్యక్తులు కనిపిస్తే వారిని తీసుకెళ్లి తండ్రిలా, అన్నలా, కొడుకులా సపర్యలు చేస్తాడు. జీవితమంతా సేవకే అంకితం చేసిన ఆ మానవతామూర్తి పేరు అన్నం శ్రీనివాసరావు. ఇప్పటివరకు 500 మందికి పైగా అనాథ శవాలకు అంత్యక్రియలు చేశాడు. ఇంటి నుంచి తప్పిపోయిన వారిని తిరిగి సొంతవారి దగ్గరికి చేర్చడం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడం, మతిస్థిమితం లేనివారిని చేరదీసి సొంతమనిషిలా వారి బాగోగులు చూసుకుంటూ వైద్యం చేయించడం వంటి పనులు ఆయన నిత్యకృత్యాలు. ఖమ్మం నగరంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డులో ఆశ్రమం ఏర్పాటు చేశాడు. మొదట దానవాయి గూడెంలో ఆశ్రమం ఏర్పాటుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

సేవకు తగిన గుర్తింపు: అన్నం శ్రీనివాసరావు సేవలను గుర్తించి అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ అనే ఫారిన్ సంస్థ ఇంటర్నేషనల్ మాన్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు ప్రదానం చేసింది. స్టేట్ బీసీ ఫ్రంట్ జ్యోతిరావు పూలే అవార్డునందించింది. అప్పటో ఏపీ సాంస్కృతిక సంస్థ తెలంగాణ రత్న అవార్డుతో పాటు జాతీయ ఉత్తమ పౌరుడు బిరుదునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర తొలి, ద్వితీయ అవిర్భావ వేడుకల సందర్భంగా ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డు, అబ్దుల్‌కలాం అవార్డు అందుకున్నాడు. సర్ సీవీ రామన్ అకాడమీ మదర్‌థెరిస్సా ఎక్సలెన్సీ అవార్డుతో శ్రీనివాసరావు సేవలను కొనియాడింది. హ్యూమన్ ఎక్స్‌లెన్సీ అవార్డును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్నాడు. 2015లో బెంగళూరు నుంచి అకాడెమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సమత ఆధ్వర్యంలో డాక్టరేట్ అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీనివాసరావు వివిధ సంస్థల్లో గౌరవ సభ్యులుగా సేవలందిస్తున్నాడు.

సేవలోనే సంతృప్తి..

సమాజంలో ఎంతోమంది అనాథలు, మతిస్థిమితం లేనివారిని చేరదీసి వారికి సేవ చేయడంలోనే నాకు నిజమైన సంతృప్తి ఉంది. నా సేవలను విస్తృతం చేయాలని ఉంది. ఆశ్రమానికి సొంత భవనం లేదు. ప్రభుత్వం దయతో ఆశ్రమానికి స్థలం కేటాయిస్తే జిల్లా వ్యాప్తంగా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతానికి దాతల సహాయంతోనే ఆశ్రమాన్ని నడిపిస్తున్నా. అన్నం ఆశ్రమానికి దాన ధర్మాలు చేయదలచిన వారు 94910 88522, 93900 24108 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
- డాక్టర్ అన్నం శ్రీనివాసరావు, అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.

408
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles