ఆకట్టుకునే హస్కీ వాయిస్ గీతామాధురి


Sun,June 18, 2017 03:37 AM

ఆమె గాత్రం మధురం. ఆమె గానం సుమధురం. ఆమె పాడిన పాటలన్నీమరపురాని మాధుర్యాలు. బాలగాయనిగా తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టి తన గానంతో వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి, ప్లేబ్యాక్ సింగర్‌గా చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకుంది. సై సింగర్స్ ఛాలెంజ్ కార్యక్రమంలో
తనదైన ముద్ర వేసి అంచలంచెలుగా ఎదిగిన గాయని. తన హస్కీ వాయిస్‌తో తెలుగు ప్రేక్షకుల
మనసుదోచిన సుమధుర గీతాల మణి గీతామాధురి.


ప్లేబ్యాక్ సింగర్.. అనగానే ఒకప్పుడు మనకు వేళ్లమీద లెక్కబెట్టే స్థాయిలో ఉండేవారు. కానీ కాలం మారింది. ఎంతోమంది వర్దమాన గాయకులు బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా తమదైన గానంతో అలరిస్తున్నారు. అలాంటి వారిలో అవకాశాలను అంది పుచ్చుకుని అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రతిభ ఉన్న గాయనిగా అందరికీ సుపరిచితురాలైంది శొంఠి గీతామాధురి.
ఆగస్టు 24, 1989లో పుట్టిన గీతామాధురి తొలుత బుల్లితెరపై తన మధురమైన గానంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. కులశేఖర్ దర్శకత్వంలో 2007లో వచ్చిన ప్రేమలేఖ రాశా అనే చిత్రంలో మల్లెపూలు గొల్లుమంటవి అనే పాటతో సినీరంగ ప్రవేశం చేశారు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తరువాత 2008లో వచ్చిన నచ్చావులే సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాట ఎంతో పాపులర్ అయ్యింది.
GeethaMadhuri

నిన్నే నిన్నే కోరా.. నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా
ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా
నచ్చావే.. ఓ నచ్చావే.. నచ్చావులే.. అని సాగే టైటిల్‌సాంగ్ గీతామాధురి వాయిస్‌కు మంచి గుర్తింపు నిచ్చింది. అంతేకాదు, ఈ పాటకు బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా తొలి నంది అవార్డును కూడా అందుకుంది. అదే పాటకు సంతోషం అవార్డు కూడా లభించింది. గీతామాధురి తల్లిదండ్రులు శొంఠి ప్రభాకర్ శాస్త్రి, లక్ష్మి. వీరిది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. ప్రభాకర్ ఎస్‌బీహెచ్ బ్యాంక్‌లో ఉద్యోగి. ఆమె చిన్నతనంలోనే వీరు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. దీంతో ఆమె చదువంతా వనస్థలిపురంలోని లయోలా పాఠశాలలో సాగింది. చిన్నప్పటి నుంచే సంగీతం అంటే మాధురికి ఆసక్తి ఉండడంతో ఆమెకు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద శాస్త్రీయ, సినీ, లలిత సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఆ సమయంలోనే ఈటీవీలో ప్రసారమైన సై సింగర్స్ ఛాలెంజ్‌లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచింది. దీంతో ప్లేబ్యాక్ సింగర్‌గా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. నచ్చావులే విజయం తర్వాత చిరుత సినిమాలోనూ పాడే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

చమ్క చమ్క చమ్మీరే చిన్నారి సింగారే
మొలక పలికే చిలకేరే కులికేటి కులుకేరే
ముట్టుకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పలికేరేఅంటూ పాడిన ఆ గీతం బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా మా ఆవార్డు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె హస్కీ వాయిస్‌కు తగినట్లు ప్రత్యేక గీతాలెన్నో పాడే అవకాశం లభించింది.
మగాళ్లు వట్టి మాయగాళ్లే ప్రేమంటే ఏవిటో తెలిదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే
మగాళ్ల ఒళ్లంత తిమ్మిరంతే మా లాగా లైఫ్‌లాంగ్ వుండరంతే అంటూ గోలీమార్ చిత్రంలోని ఈ పాట ఆమె వాయిస్‌ను ఎక్కడికో తీసుకుపోయింది. తన గాత్రంతో తెలుగు సినిమా పాటని పరిగెత్తించింది. ఈ పాటకు గాను బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. మధురమైన స్వరంతో ఆమెకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ట్రెడిషనల్, మెలోడీస్, ఫాస్ట్‌బీట్, వెస్ట్రన్, హస్కీ, ఐటెమ్ ఇలా డిఫరెంట్ ైస్టెల్స్‌లో పాటలు పాడడం ఆమెకే చెల్లింది.

గుండెల్లో గిటారు మోగించావే
నాకేవేవో సిల్లీ థాట్స్ నేర్పించావే
అంటూ ఏక్ నిరంజన్ సినిమాలో పాడిన పాట గీత పాడిన పాటల్లో మంచి మెలోడీ పాట. ఆ తరువాత మిర్చి చిత్రంలోనూ డార్లింగే అంటూ పాడిన పాట నేటికి అందరినీ ఆకట్టుకొంటున్నది.
నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు
మనసేమో గిల్లా గిల్లా కొట్టెస్కుంటాందే
డార్లింగే ఓసి నా డార్లింగే
డార్లింగే ఏంది ఈ ఫీలింగే ఈ పాట సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు గాయనిగా మాధురికి మరింత గుర్తింపును తీసుకువచ్చింది. గుడ్‌మార్నింగ్ సినిమాలోనూ ఎదలో నదిలాగా కదిలిన భావాలు అనే పాటకు గీత నంది అవార్డు అందుకుంది. మగధీర చిత్రంలోనూ నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది
నాకోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది అంటూ తన ప్రేమికుడు తనకోసం చేసే చిలిపి పనులను తలచుకుంటూ సాగే పాట ఇది.
అలా మొదలైంది సినిమాలో...
ఇన్నాళ్లు నా కళ్లు గ్రహించలేదు
నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని అని పాడింది.
పుట్టిన ప్రతి మనిషి ఎలాగు పోతాడని కానీ పోయేలోపు ఏదో ఒకటి చేసి పోవాలని తద్వారా ఈ ప్రపంచాన్నే జయించాలంటూ నేనింతే చిత్రంలో..
పుడుతూనే ఉయ్యాలా నువ్వుపోతే మోయ్యాలా
ఈ లోపే ఏదో చేయ్యాలా ఎళ్ల ఎల్ల దునియానే ఎలాలా అంటూ మాధురి పాడిన పాట నిరాశ నిండిన హృదయంలో ఆశను రేకెత్తించేలా సాగుతుంది.
దిల్లకు థిల్లకు దిల్లకు దిల్ల దిల్లకు దిల్లకు దిల్ల దిల్లకు థిల్లకు దిల్లకు దిల్ల దిల్లకు దిల్లకు దిల్ల
మిలుకు మిలుకు చిలక నీ మీట పెదవే కొరక దిల్లకు థిల్లకు దిల్లకు దిల్ల దిల్లకు చేయకె పిల్ల
రచ్చ చిత్రంలోని ఈ పాట అటు సంగీత పరంగానూ, ఇటు సాహిత్య పరంగానూ గీతా కెరీర్‌కు మరింత బలాన్నిచ్చింది.

ఊపిరి చిత్రంలో యువతను ఉర్రూతలూగించిన పాట
జంట నగరాలకు మంటపెట్టే నాజూకు నడుమొంపు నాట్యమయూరి ఛీ..చీ..
నాటు మయూరి కుమారి నెమలి ఆట పాట నేడే చూడండి కాస్కో రాజా యేస్కో బాజా వంటి ప్రేక్షకాదరణ పొందిన పాటలన్నీ గీతా మాధురి పాడినవే. ఆమె హస్కీ వాయిస్ ఆమెతో అన్ని రకాల పాటలు పాడించేలా చేసింది. అలా తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో సుమారు 550 పాటలు వివిధ చిత్రాల్లో, ఆల్బమ్స్‌లో పాడింది. తెలుగు సినిమా పరిశ్రమ, అభిమానులు గీతను దక్షణభారత శ్రియాగోషల్‌గా పిలుచుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేసిన అనుభవం ఉన్న గీతామాధురి మరిన్ని పాటలు పాడాలని ఆశిద్దాం.

జనతా గ్యారేజ్ చిత్రంలో స్పెషల్‌సాంగ్ కోసం గీతామాధురి పాడిన నేను పక్కా లోకల్ పాట సూపర్ హిట్‌సాంగ్‌గా నిలిచింది. ఈ పాటలో కాజల్ నర్తించడం ఒక ప్రత్యేకత అయితే, తనదైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకువచ్చి సినిమా విజయంలో గీతామాధురి కూడా భాగమయింది.
హలో మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం
నా సొంతపేరు బంగారం ఒంటితీరు తగరం
పుట్టిందేమో యానాము కాకినాడ తీరం
అంటూ పాటకు ముందొచ్చే ట్రాక్ మాధురి గొంతుకు చాలా బాగా కుదిరింది.
ఇంగిలీషులోన దణ్ణమెట్టనెప్పుడూ
తేటతెలుగులోనె మీకు వందనం
ఫేసుక్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడూ
నాకు ఇష్టమంట పసుపు సెందనం
ఎందుకంటే.. నేను పక్కా లోకల్ పక్కాలోకలూ
నేను వాడే గాజుల్ కోకా రైకల్ అన్నీ ఊరమాసు లెక్కలూ.. అంటూ పాడిన ఈ పాట అటు మాస్ ఇటు క్లాస్ జనాన్ని ఉర్రూతలూగించింది.
ఇక చరిత్ర సృష్టించిన బాహుబలి ది బిగినింగ్‌లోనూ..
ఓ.. ఓ.. హోహో బంగారు కలల్ని గుండెలోతు గాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది
కొండలు కోనలు అడ్డమై తగిలిన బండరాతి లోయలే నిలువునా చీల్చినా
ఆగనిది ప్రాణనది అలసిపోనిది జీవనది అంటూ పాడిన పాటకు ఫిలింఫేర్ అవార్డు లభించింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన గీతా మాధురి ప్రేమించి పెళ్లి చేసుకుంది. టాలీవుడ్‌లో హీరోగా చేస్తున్న ఆనంద కృష్ణ నందును గీతా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరు ఇరువైపుల పెద్దలను ఒప్పించి 9 ఫిబ్రవరి 2014న వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ అంతకు ముందే అదితి అనే షార్ట్‌ఫిలింలో హీరోహీరోయిన్లుగా నటించారు.

అవార్డులు


నంది అవార్డులు
నచ్చావులే- నిన్నే నిన్నే కోరా
గుడ్‌మార్నింగ్ -ఎదలో నదిలాగా
ఫిలింఫేర్ అవార్డులు
బాహుబలి-జీవనది
గోలీమార్ -మగాళ్లు వట్టి మాయగాళ్లు
మా అవార్డు
చిరుత - చమ్క చమ్క
సంతోషం అవార్డు
నచ్చావులే- నిన్నే నిన్నే
సౌత్‌స్కోపు అవార్డు
ఏక్ నిరంజన్ -గుండెల్లో గిటారు.
వీటితో పాటు పలు పాటలకు సైమా, ఐఫా, అప్సర, బిగ్‌ఎఫ్‌ఎం, గామా తదితర అవార్డులు అందుకున్నారు.
GulfAndhra

1704
Tags

More News

VIRAL NEWS