అమ్మతప్ప ఎవరూ నమ్మలేదు..


Sun,November 12, 2017 12:17 AM

ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా.. హిట్టు కొట్టామా లేదా.. అనేదే ముచ్చట. ఒక సినిమాను డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ కూడా చేయడమంటే మాటలు కాదు. అది రెండు పడవల ప్రయాణం లాంటిది. రెండింటిలో ఒక్క పడవ స్పీడు ఎక్కువైనా, తక్కువైనా అసలు కథ బిస్కెట్ అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక చేత్తో సినిమాకు దర్శకత్వం వహిస్తూ మరో చేత్తో నిర్మాతగా కూడా వ్యవహరించాడు సందీప్‌రెడ్డి వంగా. ఒక డైరెక్టర్ గురించి చెప్పాలంటే వంద సినిమాలు చూడాల్సిన అవసరం లేదు. ఒక్క సీన్ చూసినా చాలు. అలా ఒక్క సీన్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాడు. ఒక్క సినిమాతో తెలుగు సినిమాకు కొత్త లుక్ ఇచ్చాడు. ఈ కొత్త డైరెక్టర్ ప్రస్థానం సాగిందిలా..నాకు మొండితనం ఎక్కువ. చిన్నప్పటి నుంచైనా సరే.. ఏదైనా కావాలనుకుంటే ఎలాగైనా సరే.. సాధించేవాడిని. ఆ మొండితనమే అర్జున్‌రెడ్డి సినిమా విషయంలో నన్ను వెనక్కి తగ్గనివ్వలేదు. ఎవరో ఏదో అన్నారని.. నా కథను కుదించలేను.. నిడివి ఎక్కువైందని పెంచలేను. ముద్దు సీన్ల మీద కొంతమంది చేసిన కామెంట్స్ వింటే నాకు గమ్మత్తుగా అనిపించింది. ముద్దు అనేది ప్రేమను వ్యక్తపరచడానికి ఒక మార్గం. ముద్దు సీన్ లేకుండా ప్రేమకథ చెప్పమంటే, సినిమా తీయమంటే ఎలా కుదురుతుంది? అనిపించింది. చాలామంది అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌లో నేనే కనిపించాను అన్నారు. అయితే.. కథకుడే దర్శకుడైనప్పుడు నా రిఫ్లెక్షన్ కచ్చితంగా ఉంటుంది కదా! నా ఊహకు, నా జీవితానికి లింక్ చేసుకుని హీరో క్యారెక్టర్ రాసుకున్నా. అలాంటప్పుడు నేను కనిపిస్తా కదా! నేనే కాదు.. ఏ క్యారెక్టరైనా రైటర్ ఊహించినట్టుగానే రాసుకుంటాడు. ప్రేక్షకుడి, విమర్శకుడి ఊహలకు అనుకూలంగా కాదు. అలా రాసుకుంటే ఆ కథలో ప్రాణం ఉండదు. చాలామంది అర్జున్‌రెడ్డి సినిమాతో తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించావు అన్నారు. కానీ నేనలా అనుకోవడం లేదు. నేను కథ చెప్పే పద్ధతిలో, నా ైస్టెల్లో అర్జున్‌రెడ్డి కథ రాసుకున్నా, సినిమా తీశా. అది చాలామందికి నచ్చింది. కానీ.. సినిమా తీయడంలో కొత్తగా నేనేం క్రియేట్ చేయలేదు. కథ చెప్పడంలో ఎవరి ైస్టెల్ వారికి ఉంటది.
Sandeep

ప్రతీ మనిషికి ఒక గతం ఉంటది. ఒక్కో స్టేజీలో ఒక్కొకరిని కలుస్తుంటాం. ఆ ఒక్కొక్కరితో ఒక్కోలా రిలేషన్‌షిప్ ఉంటది. ఒక ఫెయిల్యూర్ లవ్‌స్టోరీ ఉంటది. ఆ ఫెయిల్యూర్ లవ్‌స్టోరీలో ఉన్న వ్యక్తి రైటర్ అయితే.. కథలో డెప్త్ ఉంటది. అర్జున్ రెడ్డి కథ కూడా అంతే. అలా అని నా ప్రేమకథ గురించి రివీల్ చేయలేను. స్కూల్లో, కాలేజీలో చదువులో ఫస్ట్ ఉండేవాడిని. బ్రిలియంట్ స్టూడెంట్ అనే పేరుంది మనకు. నంబర్‌వన్ కాదు. గొడవల్లో ఎక్కువగా పాల్గొనేవాడిని. నన్ను, నా ఫ్రెండ్స్‌ని ఎవరైనా ఏమైనా అన్నారంటే.. వాడికి పగిలిపోవాల్సిందే. అంటే ఏదో కావాలని గొడవలు పెట్టుకోవాలని కాదు.. లౌక్యంగా తప్పించుకోవడం నాకు తెలియదు. గొడవ పడితే ఇంట్లోవాళ్లకు తెలుస్తుంది.. టీసీ ఇచ్చి స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తారు.. ఇలాంటివేం పట్టించుకునేవాడిని కాదు. స్కూల్ లైఫ్ నుంచి పిజియోథెరపీ పూర్తి చేసేంత వరకు ఇదే తంతు. ఇక సినిమాల వైపు ఎలా టర్న్ అయ్యానో చెప్తే మీరు ఆశ్చర్యపడుతారు. ఎంబీబీఎస్ చేద్దామనుకున్నా. కానీ సీటు రాలేదు. ఏ లక్ష్యమూ లేకుండా ఉండడం కంటే ఏదో లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఏదో ఒక డిగ్రీ పూర్తి చేయాలి. కాబట్టి కర్ణాటకలో ఎస్‌డీఎం కాలేజీలో ఫిజియోథెరపీలో చేరా. ఫిజియోథెరపీ సెంకడ్ ఇయర్‌లోకి వచ్చాక నాకు ఫ్యూచర్ కనిపించింది. ఇది కాదు.. నేను చేయాల్సింది అనిపించింది. వెంటనే ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశా. చాలామంది వద్దురా.. మనకు అవసరమా చెప్పు ఈ సినిమాలు, మంచిగ ఓ క్లినిక్ పెట్టుకోక ఈ సినిమా ఫీల్డ్ అవసరమా ఇలా ఎన్నో రకాల కామెంట్లు చేశారు.

కానీ అమ్మ మాత్రం నేను సినిమా చేస్తాను అని నమ్మింది. మా అమ్మ నమ్మకం వమ్ము కాలేదు. డాక్టర్ వృత్తిలో ఉండాలంటే పూర్తిగా సామాజిక సేవా దృక్పథంతో ఉంటేనే బాగుంటుంది. లేదంటే డబ్బులు సంపాదించాలన్న ఆశ ఉండాలి. ఆ వయసులో, ఆ సమయంలో నాకు ఈ రెండూ లేవు. ఎందుకంటే అప్పటికే నాన్న బిజినెస్ చేసేవారు. ఆర్థికంగా పర్వాలేదు. అన్నయ్య విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాకేమో డాక్టర్‌గా ఫిట్ కాను అనిపించేది. ఆ ఆలోచన నన్ను ఫిల్మ్ మేకింగ్ వైపు నడిపించింది. దీనికి తోడు పెయింటింగ్, కెమెరా, లైటింగ్‌ల పట్ల చిన్నప్పటి నుంచే బాగా ఇష్టం, అవగాహన ఉండేది. ఆ ఫొటోగ్రఫీ మీద ఉన్న ఇష్టమే కథగా మారింది. ఇదే నా మొదటి సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా నేనే చేసేందుకు బాగా ఉపయోగపడింది. సినిమాలో బోర్డు మీద కనిపించే బొమ్మలు నేనే వేశా. బైక్ బొమ్మలు, ఇతర డ్రాయింగ్స్‌లో కొన్ని నేను వేశా.. కొన్ని వేరేవాళ్లతో వేయించా. వాలీబాల్ గేమ్ అంటే చాలా ఇష్టం. బాగా ఆడుతా కానీ.. బెస్ట్ ప్లేయర్‌ని కాదు. చాలామంది ఫ్రెండ్స్ నువ్వు వాలీబాల్ బాగా ఆడుతావ్.. నీ సినిమాలో ఫుట్‌బాల్ పెట్టావేంటి? అని అడిగారు. అర్జున్ రెడ్డి అనే రెబల్ క్యారెక్టర్‌కి ఫుట్‌బాల్ గేమే కరెక్ట్. అదో వయోలెటిక్ గేమ్. ఫుట్‌బాల్, రగ్బీ ఆటల్లో ఉండే కోపం, గొడవలు వేరే గేమ్‌లో ఉండవు. ఎదుటివాడిని గెలవాలన్న కసిని పెంచే గేమ్ అది.
Sandeep1

అర్జున్ రెడ్డి కథ రాసుకోడానికి నాకు రెండున్నర ఏళ్లు పట్టింది. ఎక్కడికెళ్లినా.. ఏం చేస్తున్నా కథ నా బుర్రలో అలా తిరుగుతూ ఉండేది. ఈ కథ ముందు శర్వానంద్‌తో చేద్దామనుకున్నా. తనకు కూడా కథ నచ్చింది. కానీ ప్రొడ్యూసర్స్ ఎవరూ దొరకలేదు. నేనే ప్రొడ్యూస్ చేద్దామనుకున్నా. ఫస్ట్ సినిమా.. డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేయడం కష్టమేమో సందీప్.. రిస్క్ తీసుకోకు అన్నాడు శర్వానంద్. అప్పటికే ఇచ్చిన కమిట్‌మెంట్స్ వల్ల శర్వానంద్ తప్పుకున్నాడు. అప్పటికి పెళ్లిచూపులు షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు. విజయ్‌కి కథ చెప్పా. ఓకే చెప్పాడు. అప్పుడే పెళ్లిచూపులు రిలీజ్ అయింది. విజయ్‌కి మంచి పేరొచ్చింది. కొంచెం ధైర్యమొచ్చింది. చాలాసార్లు విజయ్ నేను కూర్చుని సినిమా పోతే పరిస్థితి ఏంటి? అని ఆలోచించేవాళ్లం. సినిమా గురించి వివాదాలు వచ్చినప్పుడు కూడా విజయ్ సపోర్ట్ ఇచ్చాడు. అర్జున్ రెడ్డికి ముందు నాగార్జున కేడీ సినిమాకు పనిచేశా. క్రాంతి మాధవ్ నాకు మంచి ఫ్రెండ్. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాకు ప్రీ ప్రొడక్షన్‌లో మూడు నెలలు పూర్తిగా కేటాయించా. కథ రాసుకుని ప్రొడ్యూసర్స్ కోసం వేటలో ఉన్నా. ఓ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా, ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పేరు పడింది.

ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆరేళ్లు గడిచిపోయిన తర్వాత ఒక స్టెప్ స్టార్టయింది. ఎప్పుడూ కొత్తగా కనిపించడం నాకు అలవాటు. అందుకే ఎప్పటికప్పుడు నా లుక్ మార్చుకుంటా. ఆరు నెలలు ఒకేలా కనిపించడం ఎందుకో నాకు నచ్చదు. వారం క్రితం నా ఫ్రెండ్ ఇంటికొచ్చాడు. ఇద్దరం కలిసి బయటకెళ్దామనుకున్నాం. నా కారు చూసి.. ఏందిరా.. నువ్వింకా సాంత్రో కారే వాడుతున్నవా? అన్నాడు. నవ్వొచ్చింది.. ఒక్క సినిమాకే బెంజ్‌లో తిరిగేస్తామా? అనిపించింది. అదేమాట వాడితో కూడా అన్నా. చాలామంది అర్జున్ రెడ్డి సినిమాతో చాలా డబ్బులొచ్చాయనుకుంటారు. కానీ అదేం లేదు. నాన్న దగ్గర్నుంచి తీసుకున్న డబ్బులు నాన్నకిచ్చేశా. ఏవో కొన్ని చిల్లర ఖర్చులకు సరిపడా డబ్బులు నేనుంచుకున్నా. డబ్బుల కన్నా విలువైన పేరొచ్చింది. అది చాలు నాకు. అమ్మానాన్న వరంగల్‌లో ఉంటారు. డైలీ అమ్మానాన్నలకు ఫోన్ చేసి మాట్లాడుతా. వాళ్లతో మాట్లాడగానే ఏదో తెలియని ఒక పవర్ నాలో నిండినట్టు అనిపిస్తది. నేను సినిమా తీస్తా అన్నప్పుడు ఎవరూ నమ్మలేదు నన్ను. మా అమ్మ మాత్రం నీ సినిమా ఎప్పుడొస్తది రా? అని అడిగేది. ఈ సక్సెస్ చూసి అమ్మ చాలా హ్యాపీ. ఆమె హ్యాపీగా ఉందంటే.. నేను కూడా హ్యాపీ.

1345
Tags

More News

VIRAL NEWS