అమ్మకు వందనం


Sun,May 13, 2018 01:50 AM

అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు కదలవు. అమ్మగురించి చెప్పాలంటే.. మాటలు సరిపోవు. అమ్మ గురించి పాడాలంటే.. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ ... కదిలే దేవత అమ్మ .. కంటికి వెలుగమ్మాఎవరు రాయగలరూ...అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం ఎవరు పాడగలరూ... అమ్మ అనురాగం కన్నా తియ్యని రాగం.. ఇవేనా? ఇంతకంటే ఎంత గొప్పగా పాడినా అమ్మ గురించి తక్కువే పాడినట్లు. అంత గొప్నది అమ్మ. మన కళ్లల్లో వెలుగై.. పసితనంలో కంటికి రెప్పై.. బాల్యంలో చదువై.. యవ్వనంలో మార్గదర్శియై.. ఉద్యోగ- వివాహాల్లో అభివృద్దియై ఉంటుంది అమ్మ. ఒక సమాజం ఆరోగ్యవంతంగా...క్రమశిక్షణాయుతంగా.. బాధ్యతాయుతంగా..నైతిక విలువలను పాటిస్తూ.. పెద్దలను గౌరవిస్తూ.. తోటివారిని ప్రేమిస్తూ.. ఎలాంటి కల్మషాల్లేని వాతావరణంతో వర్ధిల్లుతుందంటే.. అమ్మ పాత్రే కీలకం. ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏటా మే రెండో ఆదివారం మదర్స్ డే ఒక సందర్భం మాత్రమే. అయినా.. అమ్మకు ఒకరోజు ఏంటి..? ప్రతి రోజూ అమ్మదే. దైవాన్ని మించిన అమ్మను ప్రేమించే వారున్నట్లుగానే కన్నతల్లి భారమని వదిలించుకునేవారూ ఉన్నారీ లోకంలో! మాతృత్వపు మమకారాన్ని కనికరం లేకుండా కాటికి పంపుతున్నవారూ ఉన్నారు. అమ్మ అనుభవిస్తున్న భిన్న పార్శ్వాలను ఒకసారి పరిశీలిద్దాం!కని.. పెంచి... పెద్ద చేసి.. విద్యాబుద్ధులు నేర్పించి.. లాలించి.. పాలించి.. క్రమశిక్షణ తప్పితే దండించి.. మనం ఎదిగితే సంతోషించి.. సమాజంలో మనకో స్థానం కల్పించేది అమ్మ.. మనిషి జీవితానికి అమ్మనే ఆదిగురువు. అసలు ఈ సృష్టికి మూలమే అమ్మ. అమ్మ పాత్రలో జీవించిన నటీమణులు ఉన్నారు. అమ్మను ప్రేమగా చూసుకునే సెలబ్రిటీలూ ఉన్నారు. అదే సమయంలో అ అమ్మను అనాథగా మార్చుతున్న కొడుకులు ఉన్నారు. మనిషి మాయమై, మానవత్వం మంటగలిసి అమ్మను వదిలించుకుంటున్న కసాయిలూ ఉన్నారు. చందమామ రావే అంటూ రాని చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టి, మాటలు నేర్పి, తప్పటడుగులు వేయకుండా నడిపిస్తూ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే అమ్మలను నిజంగా ప్రేమించే వారెంతమంది? అసలు మాతృమూర్తులకు ఎంతమేర సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం దక్కుతున్నాయన్నది ఆలోచించాల్సిన అంశం.
Mothersday

నా కష్టాన్ని చూడలేదు!

ప్రతి పేరెంటుకు తమ పిల్లలంటే ఇష్టముంటుంది. అయితే, నా విషయంలో మా పేరెంట్స్‌కు కొంచెం ఎక్కువ అని నేననుకుంటాను. ముఖ్యంగా మా అమ్మ ఉషా నేను కష్టపడితే చూడలేదు. ఎక్కువ కష్టపడుతున్నానని బాధ పడుతుంటారు. నాకు ఫలాన స్టోరీ అయితే బావుంటుంది అని అమ్మతో ఎప్పుడూ కథల గురించి డిస్కస్ చేస్తుంటాను. ఛలో కూడా అలా చేసిందే. అయితే ఆ సినిమా నేను చేస్తే బాగుంటుంది అయితే ఎవరు ముందుకు రావడం లేదని నేను బాధపడితే నువు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని తనే ఆ సినిమా ప్రొడ్యూస్ చేశారు. నేను వద్దు అన్నా కూడా తను ఆ చిత్రాన్ని నిర్మించారు. నా విషయంలో అమ్మ, నాన్న, అన్న అందరి సహకారం ఉంది. నేను ఏదైనా సాధిస్తే గిఫ్ట్ ఇవ్వడం అమ్మకు అలవాటు. అలాగే ఛలో విజయవంతం అయిన తర్వాత నాకు కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే నాకు గిఫ్ఠ్‌లు సాధారణమే కనుక నేను మరో కారు అడిగా. ఆ సినిమా విజయవంతం అయ్యాక అమ్మ సినిమాకు పనిచేసిన వారందరికీ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారు. నాకు చివరికి ఇచ్చారు. అదే విషయం అడిగితే అందరూ సంతోషంగా ఉంటేనే కదా మనం సంతోషంగా ఉండేది అని అన్నారు. నా మనసును అర్థం చేసుకోవడంతో పాటు నా కోసం ఎంత దూరమైనా వెళ్లగలిగే అమ్మను నాకిచ్చాడా దేవుడు.
-నాగశౌర్య, సినిమా హీరో
Mothersday1

అమ్మే నా స్నేహితురాలు!

మా నాన్న ఆర్మీలో పనిచేసేవారు. అందువల్ల ఎప్పుడూ ట్రాన్స్‌ఫర్‌లు ఉండేవి. అమ్మ రాగిణి గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ మమ్మల్ని చూసుకోవడానికి, ఆయన వెంట ఉండడానికి ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఉండిపోయారు. చిన్నతనం నుండి కూడా అన్నీ తానై మమ్మల్ని పెంచిపెద్ద చేశారు. నాన్న మా నుండి దూరం అయ్యాక ఆమె తండ్రిగా, తల్లిగా, స్నేహితురాలిగా అన్ని రోల్స్ ఆమెనే అయ్యింది. నేను చేసే ప్రతి పనికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రేడియోలో చేసినా, ఈవెంట్స్ చేసినా, ఇంటికి స్నేహితులు వచ్చినా, స్నేహితులతో బయటకు వెళ్లినా మా వ్యక్తిత్వం తెలుసు కనుక ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. తను వంట చేయడమే కాదు నాకు ఎలా చేయాలో కూడ నేర్పింది. అమ్మ వాయిస్ నా వాయిస్ ఒకేలా ఉంటాయి. దీంతో ఒక్కోసారి నేను పనిలో ఉంటే తను కాల్ రిసీవ్ చేసుకుంటే నేనే అనుకుని నా స్నేహితులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. క్రమశిక్షణ విషయంలో ఎంత కఠినంగా ఉంటారో, ప్రేమతో ఉంటే మాత్రం స్నేహితురాలిగా ఉంటారు.
ఆర్.జె. కావ్య (ఆర్.రోహిణి), రేడియోజాకీ, ఈవెంట్ యాంకర్
Mothersday2

అమ్మ ధైర్యమే నా ఎదుగుదల

మా అమ్మ రవిజ్యోతి హౌజ్‌వైఫ్ అయితే తను మంచి అర్టిస్ట్. ఆయిల్ పెయింటింగ్స్, నిర్మల్ బొమ్మలు వేస్తారు. నాన్న జాబ్ చేస్తుండడం వల్ల ఇంటి వ్యవహరాలన్నీ అమ్మే చూసుకునేవారు. అందువల్ల తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండుగలు, కళలు అన్నీ అమ్మ నుండే నేర్చుకున్నాను. ఆమె ఆర్ట్ చూసే నేను ఆర్కిటెక్చర్ చదివాను. అమ్మ వల్లనే కళల ఫీల్డ్ మీదా ఆసక్తి కలిగింది. ఇక అమ్మ మంచి కుక్. వెజ్, నాన్ వెజ్ వంటలు ఎంతమందికైనా ఇట్టే వండేస్తారు. అందువల్లే ఆమెనుండి నేను వంటలు కూడా నేర్చుకున్నాను. ఆమెకు ఓపిక ఎక్కువ. అందుకే ఎన్ని సమస్యలు ఎదురైనా మనం ధైర్యం కోల్పోవద్దు. ధైర్యలక్ష్మి మనతో ఉంటే అందరు లక్ష్మీలు మన వెంటే ఉంటారు అని చెప్పేవారు. ఈ క్రెడిట్ అంతా నూటికి నూరుశాతం అమ్మకే చెందుతుంది.
-కత్తి కార్తీక, యాంకర్, ఆర్కిటెక్చర్
Mothersday3

మరుజన్మకూ మళ్లీ నీవే అమ్మ
ఓ పసివాడి బుడి బుడి నత్త నడకలా..
గోనేసంచి ఉయ్యాలా గోరు వెచ్చని నీరులా..
చలిగాలి వేడి అలలా, చెదిరిపోయిన నిద్ర కలలా
చెప్పలేని చేదు బాధలా, తియ్యనైన తేనె తీపిలా..
భయంతో రాత్రి బెంగలా!
తనివి తీరా కమ్ముకొచ్చిన నిద్రలా
ఆకలి తీరని వేళ కమ్మనైన
అమ్మ రొమ్ము పాలలా...
నా బాల్యం ఎంతో మృదువుగా సాగిపోయింది.
అది గుర్తుకు వచ్చిన మరుక్షణమే మరో జన్మంటూ ఉంటే నీ కడుపులో పెరగాలని ఆశ అమ్మా.
హ్యాపీ మదర్స్ డే....


ఇట్లు
నీ చిన్న కుమారుడు
రమేష్ బాబు (తాగుబోతు రమేష్)


మాతృమూర్తుల మహా పూజోత్సవం

పెద్దపల్లి జిల్లా పుణ్యగోదావరి నదీ తీరాన కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరిఖనిలో మే13న మదర్స్‌డే సందర్భంగా ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాతృమూర్తులకు మహాపూజోత్సవం పేరుతో ఏకంగా రెండువేల మంది అమ్మలకు గౌరవప్రదమైన పాదపూజ, పది గ్రాముల వెండినాణేంతో వైభవంగా సత్కారం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, కోరుకంటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కోరుకంటి చందర్ ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. స్వంత తల్లిదండ్రులనే వదిలించుకుంటున్న నేటి సమాజంలో అమ్మ ఎవరికైనా అమ్మే అంటూ ఆ మాతృమూర్తులను పూజించడం అభినందనీయం. పారిశ్రామిక ప్రాంతంలో ఉద్యమాన్ని నడిపించిన కోరుకంటి చందర్ ఇప్పుడు ఈ అరుదైన కార్యక్రమం ద్వారా పలువురి అభినందనలు అందుకుంటున్నారు. అమ్మలను సత్కరించుకునే అవకాశం ఈ మదర్స్‌డే రోజున నాకు కలిగింది. వారికి పాదాభివందనం చేసే అదృష్టం కలిగినందుకు ఆనందిస్తున్నాను.
-కోరుకంటి చందర్, కోరుకంటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు
Mothersday4

మానవత్వం మరిచి అమ్మను వదిలి...

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్నవాడుఅని అందెశ్రీ అన్నట్లు నవమాసాలు మోసి, పిల్లల్ని కని, పెంచి పెద్దచేసిన కన్న తల్లిని మావవత్వపు విలువలు నశించి రోడ్డున పడేస్తున్నారు కొందరు కొడుకులు. వారి నిరాదరణతో అనాథలుగా వీధుల్లో ప్రాణాలు విడుస్తున్నారు ఎంతోమంది అమ్మలు. మచ్చుకు కొన్ని..

ఖమ్మంలో ఓ అమ్మ

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం మొండికుంట గ్రామానికి చెందిన సరోజనమ్మకు ఏడుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు. 5గురు కొడుకులు. తన కడుపున పుట్టినోళ్లను చూసుకుని మురిసి పోయింది. రక్తమాంసాలు ధారగా పోసి సంపాదించిన ఆస్తులను ఐదుగురు కొడుకులకు పంచేసింది. పది ఎకరాల పొలాన్ని వాటాలేసుకుని పంచుకున్న సుపుత్రులు.. తల్లి సరోజనమ్మను మాత్రం.. వీధిలోకి నెట్టేశారు. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో సరోజనమ్మకు కష్టాలు మొదలయ్యాయి. తండ్రి చనిపోయిన దగ్గరనుంచి పొలం పంచాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొడుకుల బుద్ధిబాగా తెలిసిన సరోజనమ్మ ... పొలాన్ని పంచడానికి ఒప్పుకోలేదు. వృద్ధాప్యంలో నాకు దిక్కెవరు... పొలం చేతుల్లో ఉంటే.. ఏ కొడుకైనా ఇంత అన్నం పెట్టకపోతాడా అని ఆశించింది. కాని.. పొలం మీద ఆశ పెట్టుకున్న కొడుకులు.. అమ్మకు అన్నం పెట్టడానికి మాత్రం ముందుకు రాలేదు. దీంతో మెండికుంటలోని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. అన్నం నీళ్లకు దూరమై చివరికి ప్రాణాలు విడిచింది.
Mothersday5

ఆత్మహత్యే శరణ్యమని..

కన్నబిడ్డలు.. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లికి చెందిన రేల లింగమ్మ(90)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పిల్లలు పుట్టాక కొన్నాళ్లకే భర్త జగ్గారెడ్డి చనిపోయాడు. దీంతో రేయింబవళ్లు కష్టపడి ఆ తల్లీ.. బిడ్డలను ప్రయోజకులను చేసింది. 12ఎకరాల భూమిని కూడబెట్టింది. ముగ్గురు కుమారులకు ఒక్కొక్కరికీ 4 ఎకరాల చొప్పున భూమిని పంచింది. అమ్మ సంపాదించిన ఆస్తిని తీసుకున్న కుమారులు.. ఆ తర్వాత అమ్మను వదిలేశారు. పిడికెడు మెతుకులు పెట్టే దిక్కులేకపోవడంతో లింగమ్మ వీధుల వెంట కాలం వెల్లదీస్తూ వచ్చింది. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో అక్కడ ఆహారం తీసుకునేది. ఇలా కొన్ని రోజులు గడిచాక కలత చెందిన ఆమె చనిపోవడమే తన సమస్యకు పరిష్కారమని భావించి.. మాడ్గులపల్లిలోని నాగార్జునసాగర్ ఎడమకాల్వ వద్దకు శుక్రవారం ఆటోలో బయలుదేరింది. కాల్వ వద్ద ఓ మూలకు తన చెప్పులతోపాటు కర్రను వదిలిపెట్టి కాల్వలోకి దిగి తనువు చాలించేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. హెడ్‌కానిస్టేబుల్ జాఫర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని లింగమ్మను స్టేషన్‌కు తరలించారు.
Mothersday6

అమ్మను అడవిలో విడిచిపెట్టి...

నలభై గజాల చిన్నపాటి ఇంటి కోసం కన్నతల్లిని అడవిలో వదిలేసిన ప్రబుద్ధుడి దుర్మార్గమిది. హైదరాబాద్ అడ్డగుట్ట వాసి రాజమణి ఎల్లమ్మ(72) వితంతువు. నిటారుగా కూడా నడవలేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు కొడుకు నర్సింహ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిని వెళ్లగొడితే ఇంటిని దక్కించుకోవచ్చని నర్సింహ ఎత్తు వేశాడు. స్నేహితుడైన లింగంతో కలిసి తల్లి ఇంటికి వెళ్లాడు. గాంధీ ఆస్పత్రిలో చేరుస్తానని చెప్పి ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆస్పత్రికి కాకుండా యాదగిరిగుట్ట ప్రాంతానికి తీసుకెళ్లాడు. తల్లి చేతి కడియాలు, మట్టెలు తీసుకుని చెట్టుకింద వదిలేసి వచ్చాడు. మరోపక్క తల్లి ఆస్పత్రిలో ఉందని నర్సింహ చెప్పడంతో ఆమె కూతుళ్లు పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తల్లి లేకపోవడంతో నర్సింహను నిలదీశారు. తల్లి ఎక్కడుందో చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. దీంతో నర్సింహ భయపడి, తల్లి కోసం మంగళవారం లింగంతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లాడు. అక్కడ బిచ్చమెత్తుకుని కడుపు నింపుకుంటున్న తల్లిని ఆటోలో తీసుకొచ్చి అర్ధరాత్రి తోబుట్టువు ఇంటిముందు దింపేసి వెళ్లిపోయాడు. ఎల్లమ్మ కూతుళ్ల ఫిర్యాదుతో పోలీసులు నర్సింహను, లింగాన్ని అరెస్టు చేశారు.
Mothersday7

అస్పత్రిలో వదిలేసి..

నవ మాసాలూ మోసి.. కని పెంచిన కన్నతల్లి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుంటే అనాథలా ఆస్పత్రిలో వదిలేసి వెళ్లాడు ఓ కర్కశుడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లేపల్లికి చెందిన దుర్గమ్మ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమె కొడుకు రాయలింగు గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి వెళ్లాడు. రోజులు గడిచినా కొడుకుతో పాటు బంధువులు ఎవరూ ఆస్పత్రివైపు రావడం లేదు. దీంతో వైద్యులు, సిబ్బంది ఆమెకు సేవలు చేశారు.
Mothersday8

కొడుకులకు భారమై అనాధలా..

మిర్యాలగూడలోని బంగారుగడ్డకు చెందిన ఆలేటి ధనలక్ష్మికి ఆరుగురు కొడుకులతో పాటు ఓ కూతురుంది. ఓ కుమారుడు చనిపోగా.. మరో కుమారుడు పట్టణం వదిలిపోయాడు. మిగిలిన నలుగురు కుమారులు స్థానికంగా వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. అంతిమ ఘడియల్లో ఎవరికీ భారం కాకూడదని లక్ష రూపాయలు తనదగ్గరే ఉంచుకుని నెలకో కొడుకు దగ్గర ఉంటోంది. అకస్మికంగా అనారోగ్యం పాలైంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆస్పత్రిలో కన్నుమూసింది. చనిపోయిన తల్లి మృతదేహాన్ని తీసుకు పోవడానికి ఏ కుమారుడూ ఇష్టపడలేదు. పైగా దవాఖాన ముందే గొడవపడ్డారు. దీంతో కూతురు స్పందించి తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సన్నద్ధమైంది. తన కారులోకి శవాన్ని ఎక్కించింది. కొడుకులు, కోడళ్లు ఆమెతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న స్థానికులు కన్నతల్లిని ఇంటికి తీసుకెళ్లి కడసారిగా సాగనంపేందుకు మీకు ఇబ్బందేంటి అంటూ నిలదీశారు. శవాన్ని వదిలేసి వెళ్తే పోలీసులకు పట్టిస్తామని బెదిరించారు. మీతో కాకపోతే మేం తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తాం.. అంటూ పారిశుద్ధ్య కార్మికులు ముందుకు వచ్చారు. దీంతో అక్కడ ఉండేందుకు ఇబ్బంది పడిన కుమారులు హుటాహుటిన అంబులెన్స్ రప్పించి తల్లి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.

కొడుకులకు దూరమై..

కన్న తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకే నిర్ధాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలి వెళ్లాడు. రాగిల్ల లసుమమ్మ (103)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అందరికి పెండ్లిళ్లు చేసింది. తల్లిని పోషించేందుకు ఇద్దరు బిడ్డలు ప్రతి నెల కొంత ఆర్థిక సహాయం అందించేవారు. కానీ కొడుకులు మాత్రం గొడవలు పడి ఆమెను కట్టారాంపూర్‌లోని ఫకీర్‌వాడలో ఉన్న పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో వదిలేసి వెళ్లాడు. అర్బన్ హెల్త్ సెంటర్‌లోని సిస్టర్స్ పోలీసులకు సమాచారం అందించడంతో పాటు లసుమమ్మను నీడకు చేర్చారు. చుట్టు పక్కల నివసిస్తున్న స్థానికులు అవ్వకు బువ్వ పెట్టారు. చివరికి పోలీసులు హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో చేర్చారు.

అందరూ పోయి....

వరంగల్‌కు చెందిన రాజమ్మకి సుమారు 90ఏళ్లకు పైగా ఉంటాయి. ఆమెకు నలుగురు సంతానం. కొడుకులు అర్థాంతరంగా తనువు చాలించారు. ఉన్న ఒక్క కూతురు అత్తగారింటికి పరిమితమయ్యింది. దీంతో రాజమ్మకు నా అనే వాళ్లు లేకుండా పోయారు. అటు కొడుకులు చనిపోయి ఇటు ఉన్న ఒక్క కూతురు ఆర్థిక పరిస్థితి సరిగా లేక అవ్వను సరిగా పట్టించుకోకపోవడంతో రాజమ్మ అనాథలా మారింది. రాజమ్మ దీనస్థితిపై స్థానికులు చలించిపోయి కూడు, గూడు కల్పించాలని కొన్ని ఆశ్రమాలను సంప్రదించారు. కానీ కూతురు ఉందన్న కారణంతో ఆశ్రమ నిర్వాహకులు అవ్వను అక్కున చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారని స్థానికులు వివరించారు. ఇప్పటికైనా అవ్వను ఎవరైనా ఆదరిస్తే బాగుంటుందని అక్కడి వారంతా కోరుతున్నారు. కూతురిని వంకగా చూపించి రాజమ్మను ఆశ్రమ నిర్వాహకులు నిరాకరించడం సరికాదనీ అంటున్నారు.

అందరూ ఉన్నా అనాధలా

కని, పెంచి, ప్రయోజకులను చేసిన కన్న తల్లినే వదిలించుకున్నారు ఆ కసాయి బిడ్డలు. ఆస్తులు పంచుకున్నారు. ఆదరించాల్సిన తల్లిని మాత్రం అనాథను చేశారు. ఆస్పత్రిలో చికిత్స చేయిస్తామని తీసుకువచ్చి ఆమెను వదిలి వెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా, కొల్హాపూర్‌కు చెందిన నారాయణమ్మకు కొడుకు, కూతురు ఉన్నారు. ఆమె భర్త ఆర్టీసీలో పనిచేసి చనిపోయాడు. ఆయన మరణానంతరం వచ్చిన పింఛన్ సొమ్ము కొడుకు, కూతురు పోటీ పడి లాగేసుకున్నారు. ఇప్పుడు నారాయణమ్మకు పింఛన్ ఆగిపోయింది. దీంతో అమ్మను వదిలించుకునేందుకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తామంటూ అనంతపురం జిల్లా ధర్మవరం తీసుకెళ్లి వదిలివేశారు.

1544
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles