అమ్మకు వందనం

Sun,May 14, 2017 03:59 AM

విశ్రాంతి.. విరామం లేని జీవితం ఈ ప్రపంచంలో ఉన్నదంటే అది ఒక్క అమ్మది మాత్రమే. నుదుటిపై అమ్మ పెట్టిన మొదటి ముద్దు సాక్షిగా.. మురిపాలను రంగరించి పట్టిన ముర్రుపాల సాక్షిగా.. నీ ముద్దా.. నా ముద్దా అంటూ చందమామను చూపిస్తూ పెట్టిన పాలబువ్వ ముద్దల సాక్షిగా ఇది నిజం. కోట్లు.. లక్షలు అవసరం లేదు అమ్మకు. బిడ్డ కళ్లలో ప్రకాశవంతమైన వెలుగొక్కటి చాలు. అదే ఆమెకు వేయి కాగడాల వెలుగులను అందిస్తుంది. బిడ్డ నుంచి ఏదీ ఆశించదు.. స్కూల్‌కి వెళ్లేటప్పుడు వ్యాన్‌లోంచి తొంగిచూస్తూ అమ్మా బాయ్ అని చెప్పే ఒక్క మాట కోసం తప్పితే. ఇంత చేస్తున్న అమ్మకు ఏమీయగలం.. ఆ కదిలే దేవత గురించి ఏం చెప్పగలం..? రోజూ మన గురించే ఆలోచిస్తూ.. మన క్షేమం కోసం తపిస్తూ ఉండే అమ్మ గురించి ఈ ఒక్క రోజే కాదు, ప్రతి రోజూ గుర్తుచేసుకుందాం. మమతల పందిరి వేసి.. కంటికి వెలుగైన అమ్మను మనఃస్సాక్షిగా కొలుద్దాం. అమ్మా.. నీకు వందనమమ్మా.

కడుపుల పెట్టుకుని చూసుకున్నది..


చిన్నతనం నుంచి అన్నీ తానై పెంచుతుంది అమ్మ. ఎంతమంది పిల్లలున్నా అందర్నీ కడుపుల పెట్టుకుని చూసుకుంటుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా విలవిల్లాడిపోతుంది. మా అమ్మపేరు వెంకటమ్మ. ఆమె చదువుకోకపోయినా మేము చదువుకోవాలని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించేది. మా కష్టాల్లో బాధల్లో తను భాగస్వామి అయ్యి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. ఏదైనా తప్పు చేసినప్పుడు నాన్న కోప్పడితే అమ్మ మాత్రం వాటిని కప్పిపుచ్చి, జీవితంలో ఎదగాలని, నలుగురిలో ఆదర్శంగా నిలవాలని కోరుకునేది. మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం మూలంగా మా ఇంట్లో నా చిన్నతనం నుంచే చైతన్యం ఉంది. అన్ని విషయాల పట్ల పాజిటివ్ దృక్పథం ఉండేది. చదువు, ఆదర్శాలు, మానవతా విలువల గురించి మా అమ్మ వివరిస్తుండేది. ఉన్నత విలువలు బోధించేది. అందువల్ల చిన్నతనంలోనే విద్యార్థి రాజకీయాల్లోకి వెళ్లగలిగాను.

ERajender

తినేవరకు వదిలేది కాదు


మా అమ్మ గోవిందమ్మ. మేం పదకొండు మందిమి. నేను అందులో ఐదోవాడిని. అందరి బాగోగులూ తనే చూసుకునేది. చిన్నతనం నుంచి కూడా నాకు చదువుకోవడం అంటే ఇష్టం. ఎడ్యుకేషన్ విషయంలో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. నేను జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో కానీ, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ అన్ని రంగాల్లోనూ నన్ను ప్రోత్సహించింది. నేను ఏమైపోతానో అని నాన్న నిరంజన్‌రావుకు కొంత అనుమానం ఉండేది. కానీ అమ్మకు మాత్రం నేను ఏదో ఒకరోజు మంచి పొజిషన్‌కు చేరుకుంటానన్న నమ్మకం ఉండేది. మా ఆరోగ్యం బాగాలేక మంచాన పడినప్పుడు మమ్ములందర్నీ అమ్మ, పెద్దక్కయ్యనే చూసుకున్నారు. అమ్మ నా దగ్గరే ఉండేది. డైలీ న్యూస్ ఎడిటర్‌గా, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, మంత్రి, క్యాబినెట్ మినిస్టర్‌గా ఉన్న సమయంలోనూ నేను సమయానికి తిన్నానో లేదోనని ప్రతి నిమిషం ఆలోచించేది. ఇంట్లో ఉంటే సమయానికి తినేంతవరకు వదిలిపెట్టేది కాదు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ అన్నీ తనే చూసుకునేది. ఆమె చనిపోయేంతవరకు కూడా నన్ను చంటిపిల్లాడిగానే చూసుకుంది. ఐ లవ్ మై మదర్.

Keshavrao

మహానుభావురాలు


మా తల్లిదండ్రులు వెంకటలక్ష్మి. వారికి మేం ఎనిమిది మంది సంతానం. 80-82 లోనే మాలో ఐదుగురిని ఏకకాలంలో హైదరాబాద్‌లో చదివించారంటే వారి ముందుచూపు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మేం స్థాయిలో ఉన్నామంటే వాళ్లు చేసిన కష్టం, వాళ్లు నడిపించిన తీరే కారణం. వారివల్లే అందరం బాగున్నాం. పెద్ద కుటుంబాన్ని అమ్మ ఒక్కతే చూసుకుంది. అందరికీ వంట చేయడం, అవసరాలు తీర్చడం అంతా అమ్మే చేసేది. కనీసం పనిమనిషి కూడా లేదు. పొద్దున లేచింది మొదలు ఒక మెషీన్‌లాగా పనిచేసేది. ఆమె జీవితంలో ఆమె గురించి ఏనాడు ఆలోచించలేదు. నిత్యం మా బాగుకోరిన మహానుభావురాలు మా అమ్మ. వారి జ్ఞాపకార్థం విగ్రహాలు పెట్టించాం. ప్రస్తుతం పాత విగ్రహాల స్థానంలో కాంస్య విగ్రహాలు పెట్టిస్తున్నాం. ఆ విగ్రహాల శిలాఫలకంలో వారి గురించి నాలుగు మాటలు రాయించాం. కష్టేఫలికి నిదర్శనం మీ జీవితం / కర్తవ్య నిర్వహణకే మీ జీవితం అంకితం / కలలు సాకారం చేసుకోవడం మీ అభిమతం / కలతలెరుగని దంపతులుగా మీ కీర్తి శాశ్వతం / కన్నవారికి సదా ఆచరణీయం మీ ఇంగితం.

Madusudhanachari

అమ్మ సపోర్ట్ చాలా ముఖ్యం


నాన్న ఆదిలాబాద్ టీచర్‌గా ఉద్యోగం చేస్తూ.. మాకు చాలా దూరంగా ఉండాల్సి వచ్చేది. నెలా, రెండు నెలలకో సారైనా ఆయనను కలిసేవాళ్లం కాదు. అందుకే అమ్మతోనే నాకు అనుబంధం ఎక్కువ. పెద్దకూతుర్ని కావడంతో ప్రతి విషయాన్నీ చర్చించేది. నాన్నకు నాతోనే ఉత్తరాలు రాయించేది. చదువు విషయంలోనూ నాకెంతో అండగా నిలిచింది అమ్మ. రాజకీయాల్లోనూ ఆమె ప్రోత్సాహం మరువలేనిది. ఎదిగినా తల్లికి బిడ్డనే. అందుకే ఎప్పటికప్పుడు ఆమె నా క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటుంది.పళ్లై అత్తారింటికి వచ్చాక ఆడపిల్లలు అమ్మను చాలా మిస్సవుతారు. నేనూ అలాంటి ఆవేదనే కొన్నాళ్ల పాటు అనుభవించా. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అమ్మ నాతోనే ఉంటున్నది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పటికీ అమ్మ ఒడిలోనే ఉంటున్నాననే భావన కలుగుతున్నది. ఇంటికెళ్లగానే తల నిమురుతూ క్షేమసమాచారాలను అడిగి తెలుసుకుంటుంది మా అమ్మ. ఒక స్నేహితురాలిగా, గైడ్‌గా, శ్రేయోభిలాషిగా అమ్మ ఎప్పుడూ నా వెన్నంటే ఉండడం అంతులేని సంతోషాన్నిస్తున్నది. ఆడవాళ్లకు సాధికారత రావాలంటే పోరాటం అమ్మ నుంచే ప్రారంభం కావాలి. ఆడపిల్ల చదువులో రాణించాలన్నా, ఉద్యోగం చేయాలన్నా.. అమ్మ సపోర్ట్ చాలా ముఖ్యం. నా వరకు నేను అమ్మ సపోర్ట్‌తోనే ఈ స్థాయికి వచ్చానని సగర్వంగా చెప్పగలను.

PadmaDevender

తొలిగురువు..


జీవిత పాఠాలు నేర్పే తొలిగురువు అమ్మ. పిలుపులో, ప్రేమలో, కోపంలో అన్నింటిలోనూ ప్రేమ కురిపించేది కేవలం అమ్మ ఒక్కతే. నేను చిన్నప్పటి నుంచి అమ్మతో ఎక్కువ గడిపాను. సినిమాల్లోకి వచ్చాక అమ్మను మిస్సవుతున్నా. కాస్త వీలు చిక్కితే చాలు.. అమ్మ ఇక్కడికి రావడమో.. నేను అమ్మ దగ్గరికి వెళ్లడమో జరుగుతుంది. కాలేజ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉండాల్సి వస్తే.. అమ్మ మీద బెంగ పెట్టుకునేవాడిని. పెద్దలు చెప్పారు కదా.. అమ్మను మించిన దైవమున్నదా అని. అంతకంటే పెద్దమాట ఏం కావాలి.. అమ్మ గొప్పతనం గురించి చెప్పడానికి.

sai-ram-shankar

నాన్నను ఒప్పించింది..


అమ్మ గురించి మాటల్లో చెప్పాలంటే నా వల్ల కాదు. అసలు అమ్మ గురించి చెప్పడం ఎవరి వల్లా కాదు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు మన శరీరంలో గుండె ఎలా పనిచేస్తుందో.. పిల్లల కోసం తల్లి కూడా అలాగే పనిచేస్తుంది. మా అమ్మ అయితే.. నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తుంది. చిన్నప్పుడు నేను చాలా అల్లరి చేసేదాన్ని. అమ్మ నా అల్లరిని ఎలా భరించేదో అనిపిస్తుంది ప్పుడు. అల్లరి కాస్త ఎక్కువైతే.. అమ్మ కోప్పడేది. మళ్లీ ఐదారు నిమిషాల తర్వాత దగ్గరికి తీసుకునేది. బాగా చదువుకోవాలి అని అమ్మ ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు నన్ను. నీకేది ఇష్టమో అదే చెయ్యి.. అని ప్రోత్సహించింది. ఇంటర్ తర్వాత రెగ్యులర్ డిగ్రీలు కాకుండా మ్యూజిక్ డిగ్రీలో చేరాను. ప్రాక్టీస్ కోసం, కోర్సు కోసం, అవకాశాల కోసం హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి. అప్పుడు నాన్న ఒప్పుకోలేదు. అమ్మే.. నాన్నను ఒప్పించి, నాకు ధైర్యం చెప్పి, జాగ్రత్తలు చెప్పి హైదరాబాద్‌కి పంపించింది. మాతో పాటు అమ్మ కూడా హైదరాబాద్‌కి వచ్చేసి అక్కను, నన్ను బాగా చూసుకునేది. అమ్మ ప్రోత్సహించకపోతే.. ఈ రోజు నేనెవరో!

damini

ఎంత చెప్పినా తక్కువే..


ఏం ఆశించకుండా ప్రేమించే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మిగతా మానవ సంబంధాలన్నీ నీకు ఇదిస్తే.. నాకు ఏమిస్తావ్? అన్న స్వార్థంతో ఉంటాయి. కానీ అమ్మ ప్రేమ అలా కాదు. నాకు ఏమీ ఇవ్వకపోయినా సరే.. నీకేం కావాలో అడుగు అంటుంది. అమ్మకు ఇవ్వడం తప్పించి తీసుకోవడం తెలియదు. మా అమ్మ నన్ను బాగా గారాబం చేసేది. నేను ఇంట్లో ఆఖరివాడిని కావడంతో.. అందరి కంటే ఎక్కువ ప్రేమ నాకే అందింది. ఏదైనా తినే పదార్థం ఉంటే దాచిపెట్టి మరీ నాకు ఇచ్చేది. చిన్నప్పుడు అడిగనప్పుడల్లా డబ్బులు ఇచ్చేది. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. నాకు మా అమ్మంటే ప్రాణం. అమ్మ గురించి, ఆమె ప్రేమ గురించి చెప్పాలంటే.. నాకున్న జ్ఞానం సరిపోదు. ఎంత చెప్పినా తక్కువే. జీవితాంతం ఆమెకు రుణపడి ఉండడం తప్ప.

brajmaji

అమ్మ ముందు అందరూ పిల్లలే..


నాకు చిన్నప్పుడు ఆస్తమా ఉండేది. శ్వాస ఆడక రాత్రంతా మెలకువ ఉండేవాడిని. మా అమ్మ కూడా నాతో పాటు మెలకువ ఉండి కబుర్లు చెప్పేది. తెల్లవారుతుండగా నిద్రపోయేవాడిని. రాత్రంతా పడుకోలేదు కాబట్టి స్కూల్‌కి డుమ్మా కొట్టి మరీ పడుకునేవాడిని. కానీ అమ్మ మాత్రం రాత్రంతా మేల్కొనే ఉన్నా.. రోజంతా మాకోసం ఏవేవో పనులు చేసేది. మా అవసరాలు తీర్చేది. ఇది చాలదా.. బిడ్డ మీద అమ్మకు ఉండే ప్రేమ గురించి చెప్పడానికి. మాది ఉమ్మడి కుటుంబం. అందరి కోసం అమ్మ పనిచేసేది. నా అల్లరి భరించేవాళ్లు ఎంతమంది ఉన్నా అమ్మ ముందు నేను చేసే అల్లరి కొంచెం ఎక్కువే. ఎందుకంటే.. అమ్మ ఏమీ అనదు అని తెలుసు కదా! అమ్మ గురించి నిర్వచించడం, అమ్మ గురించి చెప్పాల్సి రావడం అనేది సందర్భాన్ని బట్టి ఉండకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే.. ప్రతిరోజూ అమ్మను తలుచుకోవాలి.

Avasarala

సప్తస్వరాలకంటే గొప్పది అమ్మ లాలిపాట..


ఆ దేవుడు ప్రతీ ఇంట్లో ఉండడానికి కష్టం కాబట్టి.. తన కంటే ఎక్కువ శక్తులిచ్చి ఇంటింటికీ అమ్మను దేవతలా పంపించాడు. మూడు ముళ్ల ప్రేమకు గుర్తుగా పుట్టిన బిడ్డను ముల్లోకాలు మెచ్చేలా ప్రేమించగల అమృతమూర్తి అమ్మ. అమ్మ లేనిది ఈ లోకమే లేదు. ఈ ప్రపంచమంతా అమ్మ పాదాక్రాంతం. నలుగురిలో నా బిడ్డ గొప్పగా ఉండాలి. గొప్పగా ఎదగాలి. గొప్పగా బతకాలి అని కోరుకునేది ఒక్క అమ్మ మాత్రమే. సప్తస్వరాలకంటే గొప్పగా ఉండే అమ్మ పాడే లాలిరాగం వెలకట్టలేనిది, కొలువలేనిది. పది జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చుకోలేం మనం. అంత గొప్ప ప్రేమ అమ్మది.

Chakri

అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్


నేను పదకొండేళ్ల వయసున్నప్పుడు అమ్మానాన్న విడిపోయారు. అప్పటి నుంచి నన్ను అమ్మ అన్నీ తానై సాకింది. జన్మనివ్వడమే కాకుండా తండ్రి లేని లోటును తీర్చింది. కష్టసుఖాల్ని చూస్తూ పెరిగాను. ఇంట్లో అమ్మ, నేను ఇద్దరమే ఉండేవాళ్లం. దాంతో మా ఇద్దరి మధ్య అనుబంధం మరింత దగ్గర చేసింది. ప్రతి విషయాన్ని అమ్మతో పంచుకునేదాన్ని.. అమ్మ నాతో అమ్మలా కాకుండా మంచి స్నేహితురాలిలా ఉండేది. నిజం చెప్పాలంటే మా ఇద్దరి శరీరాలే వేరు కానీ మనసులు ఒక్కటే. మనం ఎదుగుతున్న కొద్దీ చిన్న చిన్న పనుల్లో ఉండి తల్లిదండ్రులను మరిచిపోతుంటాం. కానీ అమ్మ అలా కాదు, అనుక్షణం మన గురించి ఆలోచిస్తుంటుంది.

rashmiGoutham

అమ్మ నేర్పిన జీవితం మాది..


మా అమ్మానాన్నలకు మేం నలుగురం పిల్లలం. అందరిలో నేను చిన్నవాణ్ణి. మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి అమ్మ చాలా కష్టపడింది. నాన్న టీచర్. మాకు పెద్దగా ఆస్తులు లేవు. అమ్మ కూలీకి వెళ్లి జొన్నలు, కూరగాయలు, ఇతర గింజలు తెచ్చి మాకు వండి పెట్టేది. చిన్నప్పటి నుంచే ఆకలి అంటే ఏంటో అమ్మను చూసి నేర్చుకున్నాం. బతుకు కోసం ఆరాటం నేర్చుకున్నాం. డబ్బును పొదుపు చేసుకోవడం నేర్చుకున్నాం. మా కోసం ఆమె పడే శ్రమ మాకు శ్రమ విలువను నేర్పింది. ఆకలి పరిణామం ఎలా ఉంటుంది.. అనేది అమ్మను చూసే నేర్చుకున్నాం. ఈ రోజు మేం ఇలా ఉన్నామంటే.. ఆరోజు అమ్మ మాకు ఇచ్చిన జీవితం, చెప్పకనే చెప్పిన జీవిత పాఠాలు. మనసులో గల వ్రణములే.. నేడు తేజమగు దివ్య దీపమ్ముల వెలుగులు అంటాడో కవి. నేను మా అమ్మ కొడుకును. కాబట్టి నేను రాసే పాటలన్నీ మా అమ్మకు అర్థమయ్యేలా రాస్తాను. మా అమ్మకు అర్థమయిందంటే.. సామాన్య ప్రేక్షకుడికి, శ్రోతలకు కూడా అర్థమవుతుంది.

chandrabose

అమ్మ మాటలు మార్చేశాయి..


మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. తమ్ముడికి ఆర్మీలో ఉద్యోగం వచ్చిన రోజే నాన్న చనిపోయాడు. కుటుంబ బాధ్యత అమ్మ మీద పడింది. అప్పటికి నేను ఖాళీ. అమ్మను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక హైదరాబాద్‌కి వచ్చేశా. ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్‌లో ఉన్నా. దాదాపు ఆరు సంవత్సరాలు ఖాళీగా ఉన్నా. అలా ఆరేళ్లు అమ్మ నా కోసం ఖర్చులకు డబ్బులు పంపింది. హైదరాబాద్‌కి వచ్చినవాళ్లు నా రూమ్‌కి వచ్చి వండి పెడితే తిని, ఊరికెళ్లిన తర్వాత ఆ.. నీ కొడుకు ఏం పని చేస్తలేడు. ఖాళీగానే ఉంటున్నాడు. వండిపెట్టడం, తిని పడుకోవడం.. రోజూ ఇదే పని అని నా గురించి అమ్మకు చెప్పేవారు. వాళ్ల మాటలు విని అమ్మ చాలా బాధపడేది. కానీ ఏనాడూ నన్ను అడగలేదు. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అప్పుడు చెప్పంది వాళ్లూ వీళ్లు అన్న మాటలు. ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టడం నుంచి ఇప్పటి వరకు పరిస్థితి మీకు తెలిసిందే. ఇప్పుడు అమ్మ ఫుల్ హ్యాపీ.

kalakeya-prabhakar

అమ్మే సృష్టికర్త :


ప్రకృతికి ప్రతిరూపం అమ్మ. ప్రకృతిలో అణువణువునా అమ్మ కనిపిస్తది. అలాంటి అమ్మ రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. అమ్మ చనుబాల రుణం తీర్చుకోవడం కోసం ఏం చేసినా తక్కువే. ఎన్ని జన్మలైనా అమ్మకు మనం రుణపడే ఉంటాం. జీవితాంతం ఆమెకు సేవ చేసినా తక్కువే. అమ్మ కాళ్ల చెప్పునై ఆమె అడుగుకు హాయినిచ్చినా.. మన జన్మ ధన్యమైనట్టే. అమ్మ గుండె మీద నడక నేర్చుకున్నాం మనం. అమ్మ ఎద మీద పడుకోబెట్టుకుని వెయ్యి కళ్లతో కాపు కాస్తూ లాలిపాడుతది. మూగజీవుల నుంచి మనుషులు, ప్రాణం లేని జీవుల దాకా అమ్మ లేనిదే ఈ లోకం లేదు. బిడ్డను కళ్లారా చూసుకుని, తనువారా ఎత్తుకుని, కడుపు నిండా తినిపించి అదే సర్వం అనుకుని సంతోషపడే తల్లి ప్రేమ ముందు అన్నీ తక్కువే. కొమ్మల్లో కోయిల కూడా తన బిడ్డ కోసం తియ్యటి పాట పాడుతూ జోల పాడుతది. ఆ పాటకు మనం కూడా పరవశిస్తాం. అదే అమ్మ లాలిపాటలోని కమ్మదనం. తల్లి బిడ్డ కోసం పాడే పాట ముందు ఏ పాట అయినా.. తక్కువే. ఈ సృష్టికే కర్త అయిన అమ్మ లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ఇక మా అమ్మ గురించి చెప్పాలంటే.. పేదరికంలో కూడా మాకు కడుపు నిండా తిండిపెట్టింది. ఆమె కట్టుకోడానికి బట్టలు లేకున్నా.. మాకు ఏ లోటు రాకుండా పెంచింది.


దేవుడు కూడా అమ్మ కొడుకే..


లెజెండ్ సినిమాలో బాలకృష్ణ గారిది ఓ డైలాగ్ ఉంటుంది కదా.. దేవుడు కూడా.. అమ్మ కడుపులోంచే పుడుతాడు అని. ఆ సర్వాన్ని కాపాడేవాడు దేవుడు అని నమ్ముతున్నాం మనం. అలాంటి దేవుడు పుట్టింది కూడా అమ్మ కడుపులోనే. అంటే.. అమ్మే దేవుడి కంటే గొప్పది. నన్ను టీచర్‌గా చూడాలన్న అమ్మ కోరిక మేరకు ఓ కాలేజీలో సంవత్సరం పాటు లెక్చరర్‌గా పనిచేశా. ఆ తర్వాత అమ్మ ఓ మాట చెప్పింది ఏ పని చేసినా.. మనసు పెట్టి చెయ్యి. ఇష్టపడి చెయ్యి. చేసే పని మీద ఇష్టం, ప్రేమ లేకుంటే ఏం చేసినా, ఎంత చేసినా వృథానే అని. మా బంధువులతో ఎప్పుడూ చెప్పేదట. నా కొడుకు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. నన్ను కార్లో తిప్పుతాడు అని. ఆ తర్వాత నేను సినిమాల్లోకి ఎంటరయ్యాను. అప్పటికే అమ్మ మమ్మల్ని, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఎంత సాధించినా, ఎంత సంపాదించినా ఒక్క విషయంలో మాత్రం చాలా అసంతృప్తి ఉంది నాకు. నా కొడుకు నన్ను కార్లో తిప్పుతాడు అనే అమ్మ మాటను నిజం చేయలేకపోయాను. మా అమ్మకు జ్ఞాపకార్ధం మా ఊర్లో ఓ వృద్ధాశ్రమం పెట్టబోతున్నా.

Prudvi

మా అమ్మే నాకు స్ఫూర్తి


మా అమ్మ పేరు సరళ. ఆమె క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్. చిన్నపుడు నేను సరిగా అన్నం తినకపోదును. వెంటపడి తినిపించేది. ఆమె చాలా ధైర్యస్తురాలు కానీ నాకు చిన్నగా ఏదైనా అయితే తను విలవిలలాడేది. చిన్నతనంలో మా నాన్న అనారోగ్యానికి గురైతే అన్నీ తానై నన్ను మా తమ్మున్ని చదివించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబమైనప్పటికీ మమ్మల్ని చదివించడంలో ఏనాడూ వెనుకాడలేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అమ్మకు ఉండేది. కానీ డిగ్రీ సెకండియర్‌లో ఉండగానే పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఆడపిల్లలు తమ కాళ్లమీద తాము నిలబడాలని అమ్మ కోరుకునేది. అందుకే కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశాను. ఆమె ఆశయాన్ని కొనసాగించడం కోసం కొంతమంది మహిళలకు వివిధ రకాల వృత్తుల్లో శిక్షణ ఇప్పిస్తున్నాను. శిక్షణ పొందినవారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాను. ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లల్లో చదివే విద్యార్థులను ప్రొత్సహించడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నాము.

Sunitha

అమ్మకోసం వెస్పా స్కూటర్ కొన్నా..


నా తల్లి, నాకు రెండు జన్మలు ప్రసాదించింది. ఒకటి నాకు, రెండోది నా పాటకు. నేను ఏడిస్తే ఊరడించడానికి, నవ్వితే మరింత సంతోషపరచడానికి అమ్మ పాటలు పాడేది. అవే పాటలు నన్ను ఉత్తేజపరిచాయి. ప్రజాగాయకుడిగా నిలబెట్టాయి. వరి చేన్లలో నాట్లు వేసేందుకు వెళ్లేటప్పుడు వేలు పట్టుకుని నన్ను కూడావెంట తీసుకుపోయేది. కష్టాన్ని మరిచిపోయేందుకు చేన్లో అమ్మపాడిన పాటల్ని ఒరం గట్టుమీద కూర్చుని వినేవాణ్ని. అదే శ్రమజీవుల శక్తి పాటైంది. పరిణామక్రమంలాగే నా పాటల పరిణామం కూడా సాగింది. అమ్మ నన్ను ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు. తాను ఉపాసముండి కూడా నాకు చదువు చెప్పించింది. అందుకే టీచర్ ఉద్యోగం రాగానే అమ్మను ఎక్కించుకుని తిరుగాలనే ఉత్సాహంతో నర్మదా వెస్పా టూవీలర్ కొనుక్కున్నా. వచ్చే 1200 రూపాయల జీతంలో 600 ఈఎంఐ కట్టేవాణ్ని. కానీ ఏ వాకిళ్ల ముందు మా అమ్మ తలదించుకుని కల్లాపి చల్లిందో, అదే వాకిళ్ల మీద నుంచి తలెత్తుకుని సగర్వంగా బండిపై తిప్పడం మర్చిపోలేని అనుభూతి.

Rasamai

1659
Tags

More News