అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిందూ మహిళ తులసీ గబార్డ్


Sun,November 25, 2018 02:40 AM

Tulsi-Gabbard
తులసీ గబార్డ్ ఈ పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ముఖ్యంగా హిందూ జనాభాలో, భారతీయుల్లో ఈ పేరు బాగా నలుగుతున్నది. తులసి కర్మరీత్యా హిందువు. శ్రీ కృష్ణుడుకి ప్రతిరూపంగా భావించే చైతన్య మహాప్రభు భక్తురాలిగా మారిన తులసీ గబార్డ్ తన వెంట ఎల్లప్పుడూ భగవద్గీతను తీసుకెళ్తుంటారు. ఆమె మాంసాహారం తినదు. హిందువుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న తులసీ గబార్డ్ అమెరికా అద్యక్ష పదవి రేసులో దూసుకు వస్తున్నారు.

అందరూ అనుకుంటున్నట్లు 37 ఏళ్ల తులసి భారతీయసంతతి మహిళ కాదు. అమెరికన్ సమోవా కేథలిక్ తండ్రి కి, హిందూ తల్లికి పుట్టిన బిడ్డ. చిన్నప్పటి నుంచి హిందువుగానే పెరిగిందీమె. హిందూ పురాణాలు, గ్రంథాలు, కర్మ లు, ఆచారాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. అందుకే ఈమెకు వాళ్ల అమ్మ తులసి అనే పేరు పెట్టింది. ఈమెతో కలిపి ఐదుగురు సంతానం. వారి పేర్లు కూడా భక్తి, జై, నారాయణ్, బృందావన్. ఇలా హిందూ పేర్లే.

వ్యక్తిగత జీవితం

తులసీ గబార్డ్ ఏప్రిల్ 12, 1981లో అమెరికాలోని లిలొయాలో పుట్టింది. 1993లో ఈమె రెండవ యేట తన కుటుంబం హవాయి వలస వెళ్ళింది. అక్కడ తులసి అనేక మతస్తుల మధ్య, అనేక సంప్రదాయాల మధ్య పెరిగారు. ఈమె తండ్రి క్రైస్తవ మతస్తుడయినప్పటికీ, మంత్రం, ధ్యానం కూడా చేస్తూ, కీర్తనలు కూడా అభ్యసించేవాడు. తులసి చిన్నతనంలో హిందూ సంప్రదాయాన్ని స్వీకరించారు. తన ప్రాథమిక విద్యాభ్యాసం ఇంట్లోనే గడిచింది. ఆ తరువాత రెండు సంవత్సరాలు ఫిలిప్పెన్స్‌లో బాలికల పాఠశాలలో చేరారు. 2009 లో హవాయిలోని పసిఫిక్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ బిజినెస్‌లో డిగ్రీ చేశారు.

భారతీయమంటే ప్రాణం

తులసి సైన్యంలో పని చేశారు. అలాగే ఆమె మార్షల్‌ఆర్ట్స్ ఇన్స్‌స్ట్రక్టర్ కూడా. 2002లో ఎడ్వర్డో టమయోను పెండ్లి చేసుకుంది. తరువాత వ్యక్తిగత కారణాల వల్ల 2006లో వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి విడిగానే ఉన్న ఆమె 2015 ఏప్రిల్‌లో వైదిక సంప్రదాయంలో అబ్రహాం విలియమ్స్‌ను పెండ్లి చేసుకున్నారు. ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆమె తన హిందూ మత విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హిందువు అనే కారణంగా ఆమెను అమెరికాలో పనిచేసే, స్థిరపడిన భారతీయులు అధికంగా అభిమానిస్తారు. అంతేకాదు ఆమెకు కూడా భారతదేశమన్నా, భారతీయులన్నా ప్రత్యేక అభిమానం. 2014లో అమెరికాకు వచ్చిన మోడీకి ఆమె హవాయి నుంచి తెప్పించిన ఓ అల్లం పూల దండను, భగవద్గీతను బహూకరించారు. అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి అమెరికా ప్రభుత్వం వీసాను తిరస్కరించిన సమయంలో ఆమె ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తను ఆచరించే హిందూ మత విశ్వాసానికి భారత్ కేంద్రం కాబట్టి ఆమెకు ఇండియా అంటే అమితమైన ప్రేమ. భారతీయులకు నష్టం వాటిల్లే విధంగా ట్రంపు తీసుకువస్తున్న H1B వీసాల ఆంక్షలను ఆమె వ్యతిరేకిస్తున్నది.

ఎన్నికల్లో పోటీ

తులసి ప్రస్థానం 2002 హవాయ్ ఎన్నికలతో మలుపు తిరిగింది. తులసి ఆ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థుల మీద పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఈమెకు 48 శాతం ఓట్లు నమోదయ్యాయి. అంటే ఈమె అక్కడ ప్రజల అభిమానాన్ని ఎంతగా చూరగొన్నారో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆమె వయస్సు కేవలం 21 యేండ్లు. అలా చిన్న వయస్సులో హవాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రికార్డ్ సృష్టించారు. 2004లో ఈమె తిరిగి మధ్యంతర ఎన్నికలలో పోటీకి దరఖాస్తు పెట్టినా, ఇరాక్‌లో నేషనల్ గార్డ్ సర్వీస్ తరుపున సేవాకార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా పోటీ నుంచి విరమించుకున్నారు.

ఒకవేళ తులసి గబార్డ్ అమెరికా సర్వాధికారి అయితే అధ్య క్ష పదవి చేపట్టిన అతిపిన్న వయస్కురాలు, తొలి మహిళా అధ్యక్షురాలుగా ఆమె తిరుగులేని రికార్డు సాధిస్తారు. పైగా తొలి హిందూ అధ్యక్షురాలు కూడా అవుతారు.

అధ్యక్ష ఎన్నికలకు సై..

2020 ఎన్నికల్లో తులసి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే దిశగా ఆమె బృందం విరాళాల సేకరణ, పబ్లిసిటీ వ్యూహాల్లో మునిగిపోయింది. అసలే ట్రంపు అమెరికా జాతీయవాదాన్ని బలంగా ప్రచారం చేసుకుంటూ సాగుతున్న స్థితిలో.. ఓ హిందూ మతవిశ్వాసినిని ఎంతమంది సమర్థిస్తారో తెలియదు. అయినా ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎందుకంటే ముందు నుండీ ఆమె ఓ ఫైటర్. బరిలో ఉన్న ప్రత్యర్థిని చిత్తుచేయడంలో దిట్ట. అందుకే ఆమె తన సంకల్పాన్ని ఏమాత్రం వదలదల్చుకోవడం లేదు.

తొలి హిందూ ప్రతినిధి

ఇటీవల తులసి అమెరికన్ కాంగ్రెస్ తొలి హిందూ ప్రతినిధిగా ప్రమాణం స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారమప్పుడు ఈమె భగవద్గీతపైనే ప్రమాణం చేశారు. ముందుకూడా తులసి భగవద్గీతను తన మార్గదర్శిగా చెప్పుకొనేవారు. అది ఆమో నమ్మకం, ఆచరణ.. తనను తాను కర్మయోగిగా చెప్పుకొనే ఆమెకు భారతదేశంలోని బృందావనం అంటే విపరీతమైన ఆరాధన, ప్రేమ, భక్తి. తులసి తన ప్రమాణ స్వీకారాన్ని తాను అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతపై ప్రమాణం చేయడానికి అనుమతించాల్సిందిగా సవినయంగా కాంగ్రెసును వేడుకొని, అమెరికా పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేయడం అక్కడ సభికుల్ని ఆకట్టుకున్నది.

- మధుకర్ వైద్యుల

346
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles