అనపోతానేని దిగ్విజయ యాత్ర


Sun,February 11, 2018 01:13 AM

జల్లిపల్లి మహా సంగ్రామం అనంతరం కూడా రేచర్ల అనపోతానాయుడు, అతని సోదరుడు మాదానాయుడు తమ దిగ్విజయ యాత్రను కొనసాగించారు. పద్మనాయక సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా ఈ సోదరులు సాగించిన విజయ పరంపర వారిని ఆంధ్రదేశాధీశ్వరులను చేసింది. తరతరాలుగా ఆధిపత్య పోరుకు, కేంద్రాధిపత్యానికి మకుటాయమానంగా ఉన్న ఈ ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదు తెలుగు నాట సరికొత్త చరిత్రను లిఖించింది.
digvijaya-yatra
-నగేష్ బీరెడ్డి
సెల్ : 8096677177


కాకతీయ ప్రతాపరుద్రుని అనంతరం తెలుగు నాట జరిగిన స్వాతంత్య్ర పోరాటాని(మన చరిత్ర 31) కి ముసునూరి నాయకుడు ప్రోలయ, అనంతరం అతని సోదరుడు కాపయ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సుల్తానుల పాలనను ఎదురించి పదమూడేండ్ల తర్వాత తిరిగి ఎంతో మంది తెలుగు రాజుల సహాయంతో ఓరుగల్లు కోటపై తెలుగు జెండా ఎగురవేయగలిగాడు కాపయ నాయకుడు. ఇంతటితో ఆగకుండా ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసురత్రాణ అనే బిరుదులను అలంకరించాడు కాపయ.

పూర్వం కాకతీయ రాజులు పరిపాలించిన రాజ్యంలో చాలా భాగం.. అంటే పడమర కౌలాస్ కోట (ప్రస్తుత కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఉంది) నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు వ్యాపించిన దేశం కాపయ నాయకుని అధికారం కిందకు వచ్చింది. ఆంధ్రదేశాధిపతి అయిన తర్వాత కాపయ తనకు సహకరించిన బంధువులకు నాయకత్వాలిచ్చి తన స్థితిని పటిష్టం చేసుకోసాగాడు. అంతకుముందు సహాయం చేసిన తెలుగు రాజులపై మాత్రం అధికారం చెలాయించసాగాడు. పైగా పక్క రాజ్యమైన బహమనీ సుల్తానుతో చేయి కలిపాడు. ఇదంతా అశీతి వర బిరుదాంకితుడయిన రేచర్ల సింగమనాయుడికి, కొందరు తెలుగు రాజులకు నచ్చలేదు. వారు సహింపక అతని కేంద్రాధిపత్య యత్నాన్ని ధిక్కరించారు.

కాలం గడుస్తున్నది. తెలుగు నాట చిన్న చిన్న రాజ్యాలుగా ఎవరి పాలన వారు సాగిస్తున్నారు. రాజ్య విస్తరణ లక్ష్యంగా కాపయ బహమనీలకు చేసిన సహాయం వారు మరిచి కాపయకే అటుతర్వాత పక్కలో బళ్లెంలా తయారయ్యారు. బహమనీల వరుస దాడుల్లో బలహీనపడుతూ కాపయ వరుసగా తన కోటల్ని వదులుకుంటున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా తిరిగి ఆక్రమించుకునే, విస్తరించుకునే ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాడు. ఇదే ప్రయత్నం ఇతర స్వతంత్ర రాజులు కూడా ఎవరికి వారూ చేస్తూనే ఉన్నారు.

చక్రవర్తిగా చలామణి అయ్యే లక్ష్యంగా కాపయ నాయకుడు రేచర్ల సింగమనాయుడు పాలిస్తున్న అమనగల్లు (నల్లగొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర), పిల్లలమర్రి(సూర్యాపేట జిల్లాలోని గ్రామం)లను ఆక్రమించి ఎరబోతు లెంకను నియమించాడు. అటు తర్వాత సింగమనేని కాపయతో యుద్ధం చేసి ఆ రెండు ప్రాంతాలను క్రీ.శ. 1360 నాటికి తిరిగి సాధించుకున్నాడు. (క్రీ.శ. 1326 నుంచి 1361 మధ్య సింగమనేనికి సంబంధించిన ఏ శాసనాలు దొరకలేదు. కాబట్టి ఈ ఇరువురి నాయకుల మధ్య యుద్ధం ఎప్పుడు, ఏ ప్రాంతంలో జరిగిందో చెప్పడం సాహసమే అవుతున్నది- అని రాచకొండ చరిత్రములో తేరాల సత్యనారాయణ శర్మ రాశారు. క్రీ.శ. 1360 నాటికి తిరిగి జయించినట్లు మాత్రం ఆధారాలు ఉన్నాయి.)

ఈ యుద్ధం తర్వాతనే సింగమనాయుడు తన రాజధానిని పిల్లలమర్రి నుంచి రాచకొండ(యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దు)కు మార్చి దుర్గ నిర్మాణం చేపట్టాడు. తన రాజ్య విస్తరణలో భాగంగా తన కుమారులు అనపోతానాయుడు, మాదానాయకులను దక్షిణ దేశ దండయాత్రకు పంపాడు.

అనపోతానాయుడు చేజెర్ల (గుంటూరు జిల్లా) యుద్ధభూమిలో ఉన్నాడు. రెండో కుమారుడు మాదానేడు మొగుళ్లూరు (కృష్ణా జిల్లా) రణక్షేత్రంలో ఉన్నాడు. ఆ సమయంలోనే జల్లిపల్లి యుద్ధం జరిగింది. కపటోపాయంతో తన తండ్రిని హతమార్చిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నారు. శత్రుశేషం మిగులకుండా ఊచకోత కోశారు. జల్లిపల్లి కోటలోనే కాక, తప్పించుకుపోయిన క్షత్రియులను, వారికి సహాయంగా వచ్చిన వారినీ వెంటాడి పట్టుకొని చంపారు. క్షత్రియులకు సహాయంగా వచ్చిన కొండవీటి రెడ్డి రాజులపై కూడా పోరు సాగించారు. ధరణికోట(అమరావతి)ను ముట్టడించి రెడ్డిరాజ్య ప్రభువైన అనపోతారెడ్డిని ఓడించారు. చర్రితలో పద్మనాయకులకు, రెడ్డి రాజులకు జరిగిన తొలి యుద్ధం ఇది.

భారతంలో రాజసూయ యాగ సమయంలో దిగ్విజయ యాత్ర చేసిన అర్జునునిలా మాదానాయుడు తన అన్న అనపోతను ఆంధ్రదేశాధీశ్వరుడిని చేసేందుకు తెలుగు నాట దక్షిణాన కాంచీపురం (తమిళనాడులోని తొండాయిమండలం) నుంచి ఉత్తరాన సింహాచలం (విశాఖ పట్నం) వరకు విజయయాత్ర సాగించాడు. ఈ విజయాలకు సంబంధించి శాసనాలు కూడా వెలుగు చూశాయి.

జల్లిపల్లి పోరాటం తరువాత రేచర్ల వారి దిగ్విజయ యాత్రను తట్టుకోలేక హతాషులైన క్షత్రియులు, విజయవాడ దుర్గాధీశులైన పూసపాటి వారు కళింగాధీశుల చెంతకు వలస వెళ్లారు. కళింగాధీశులు అటుతర్వాత తమ సామ్రాజ్య తెలుగు ప్రాంత సామంతులుగా పూసపాటి వారిని నియమించుకున్నారు.
ఇక మిగిలింది కాపయనాయకుడు. బహమనీ సుల్తాను మహమ్మద్ షా చేతిలో కాపయ కుమారుడు వినాయకదేవుడు హతమయ్యాక ఇక పోరాడే శక్తి లేక సంధి (క్రీ.శ. 1364-65) చేసుకున్నాడు. యుద్ధ నష్టపరిహారంగా గోల్కొండ కోటను మహమ్మద్ షాకు ఇచ్చుకున్నాడు.

ఇదే సమయంలో పైశాల గన్నమనాయుడు తన మేనల్లుడైన అనపోతానేనిని ఆంధ్రదేశాధీశ్వర బిరుదాంకితుడను చేస్తూ తెలుగు నాడంతా ప్రజారంజకంగా పాలించసాగాడు. క్రీ.శ. 1365 నుంచి పద్మనాయకులు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు వహించినట్లు శాసనాలు లభించాయి. కాపయనాయకునికి అప్పటికే ఈ బిరుదు ఉంది. తెలుగు నాట సర్వాధిపత్యం కోసమే ఈ నాయకులు ఎవరికి వారు ఈ బిరుదులు అలంకరించుకున్నారు.

digvijaya-yatra2

క్రీ.శ. 1369లో పద్మనాయకులకు సంభవించిన ఈ విజయప్రశస్తి గురించి తెలంగాణకంతటికీ రాచకొండ పద్మనాయకులే అధిపతులయ్యారని అయ్యనవోలు శాసనం చెబుతున్నది. పద్మనాయకుల చరిత్రకిది ముఖ్య శాసనం. ఇలా క్రీ.శ. 1361లో మొదలైన పద్మనాయక ప్రాభవం క్రీ.శ. 1475 వరకు కొనసాగింది.

ఇలాంటి పరిస్థితుల్లో రేచర్ల అనపోతా నాయకుడు తన బిరుదును సార్థకం చేసుకునేందుకు తన సోదరులతో కలిసి ఓరుగల్లు పైకి దండెత్తాడు. క్రీ.శ. 1369లో భీమారం (నేటి హన్మకొండలో భాగం) వద్ద రేచర్ల పద్మనాయకులకు, కాపయ నాయకునికి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కాపయనాయకుడు మరణించాడు. ఈ యుద్ధంతో ఓరుగల్లు పతనమై పోయి రేచర్ల పద్మనాయకుల వశమైంది.

ఢిల్లీ సుల్తానును ఎదిరించడంలో సింగమనాయకుడి తోడ్పాటును మరచి చక్రవర్తి కావాలనే దురాశతో కాపయ సింగమనాయుడి అమనగంటి రాజ్యాన్ని ఆక్రమించాడు. అటుతర్వాత తన తండ్రిని చంపడంలో మౌనం వహించాడనే కోపంతో అనపోత నాయకుడు కాపయ నాయకుడితో యుద్ధం చేసి సంహరించాడు.
భీమారం యుద్ధంతో ముసునూరి వంశం అంతరించిపోయింది. ఈ యుద్ధం తర్వాత ఓరుగల్లు, భువనగిరి, సింగవరం మొదలైన ప్రాంతాలు పద్మనాయకుల వశమయ్యాయి. క్రీ.శ. 1369లో పద్మనాయకులకు సంభవించిన ఈ విజయప్రశస్తి గురించి తెలంగాణకంతటికీ రాచకొండ పద్మనాయకులే అధిపతులయ్యారని అయ్యనవోలు శాసనం చెబుతున్నది. పద్మనాయకుల చరిత్రకిది ముఖ్య శాసనం.

ఇలా క్రీ.శ. 1361లో మొదలైన పద్మనాయక ప్రాభవం క్రీ.శ. 1475 వరకు కొనసాగింది. రాచకొండ.. రాజ్య స్థాయి నుంచి సామ్రాజ్య స్థాయికి చేరిన ఈ కాలం పద్మనాయక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపతగినది.

పద్మనాయక రాజధాని రాచకొండకు రాజాద్రి, రాజగిరి, రాజాచలం అనే పేర్లు కూడా ఉన్నాయి. కానీ వీటన్నింటికంటే రాచకొండ అనే పేరే ప్రజాబాహుళ్యంలోనూ, చరిత్రలోనూ ఎక్కువగా వాడుకలో ఉంది.
రాచకొండ దుర్గ ప్రాంతం హైదరాబాద్ విజయవాడ రహదారిపై హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో కొయ్యల గూడానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాచకొండ దుర్గంలో ప్రాకారాలు, రాజభవనాలు, సభా మందిరాలు, పురవీధులు, గజశాలలు, కొలువు కూటములు, దేవాలయాలు, శాసనాలు వెలుగు చూశాయి.

రాచకొండ సామ్రాజ్య స్థాయిని అందుకున్న తరువాత అనపోతా నాయుడు దేవరకొండను ఉపరాజధానిగా నిర్మించాడు. ఈ దుర్గం నిర్మాణం, రక్షణ బాధ్యతలను తన మేనమామ పైశాల గన్నమనాయునికి అప్పగించాడు. గన్నమనాయుని ఆధ్వర్యంలో అతని సోదరుడు కృష్ణమ నాయుడు కూడా కోట నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. ఈయన వాస్తు శాస్త్రం తెలిసిన ప్రతిభాశాలి అని చరిత్రకారులు చెబుతారు. అందుకుగాను కృష్ణభూపమాల్ (కృష్ణభూపతి మహాల్)అనే భవనాన్ని చూపుతారు.
దేవరకొండ దుర్గం చరిత్రలో సాటిలేని దుర్గ రాజమని చరిత్రకారులు రాశారు. ఏడు పర్వాతాల చుట్టూ మహోన్నత శిలాప్రాకారం, 360 బురుజులు, 9 పెద్ద దర్వాజాలు, 32 దిడ్డి దర్వాజలు, 5 కొలనులు, 3 దిగుడు బావులు, ధాన్యపు గిడ్డంగులు, గరిసెలు ఉన్నాయని చరిత్ర చెబుతున్నది.

829
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles