అదృశ్య యుద్ధం


Sun,September 9, 2018 01:49 AM

AdrushyaYuddam
జీవితం అనే దాని గురించి వ్యక్తపరుచమంటే, అదొక యజ్ఞమనీ, యుద్ధమనీ, మహోన్నతమైనదనీ, దుర్లభమైనదనీ, విలువైనదనీ, వంచించబడేదనీ, స్వాతంత్య్రమైనదనీ.. ఇలా ఎన్నో రకాలుగా నిర్వచిస్తూనే ఉంటాం. జీవితానికి ఆరంభం ఉన్నట్టే, అంతమూ ఉంటుందనీ, జీవితం అంటేనే అశాశ్వతమైనదనే విషయాన్నే మర్చిపోతాం. మన లోపల మనం చేసే నిజమైన పోరాటం జీవితం. అందుకే దాన్ని అదృశ్య యుద్ధం అన్నారు. ఆ అదృశ్య యుద్ధంలో గెలువాలన్నా, ఓడాలన్నా మనమే. మన జీవితం గురించి ప్రేలాపనలు పలుకడానికి, తమదాకా వస్తేగానీ తెలియదు జీవితపు విలువ అన్నట్లు అదృశ్యయుద్ధం నిక్షిప్తంగా ప్రకటించే జీవిత కోణానికి ఈ కథనానికి ఉదాహరించే చిన్న నిరూపణే దారి చూపాలి.
- ఇట్టేడు అర్కనందనా దేవి

ఈప్రపంచంలో ఎన్నో జీవరాసులు. అందులో మనిషి కూడా ఒక భాగం. మనిషికీ, మిగతా వాటికీ వ్యత్యాసం ఉందనేది నిర్వివాదాంశం. అలా ఈ లోకంలో ఒక జింక, ఒక ఏనుగు, ఒక మిడత, ఒక చేప, ఒక తుమ్మెద... వాటితో పాటు మనిషి కథలోని పాత్రలు. జింక రూపం వేరు, గుణం వేరు. అలాగే ఏనుగు, మిడత, చేప, తుమ్మెదల రూపాలు వేరు. వాటి వాటి గుణాలూ వేరు వేరు. వీటన్నింటికీ భిన్నమైనవాడు మనిషి. ఎవరి జీవితాలు వారివి, ఎవరి బతుకుదెరువు వారిది. ఎవరి బతుకు పరిమితి కూడా వారిదే. అలా ఎవరి ప్రపంచంలో వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాలప్రవాహంలో మునిగిపోకుండా ఈదే ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నారు. ఎవరెవరి జీవితాల గురించి వారు వారు ఆలోచన చేస్తూనే అంతర్యుద్ధం కూడా చేస్తూనే ఉన్నారు. కానీ.. విధి ఎవరెవరిని, ఎప్పుడెప్పుడు ఎలా చేరదీస్తుందో, ఎలా విడదీస్తుందో తెలియదు. ఒకనాడు అనుకోని పరిస్థితుల ప్రభావంతో జింక, ఏనుగు, మిడత, చేప. తుమ్మెద, మనిషి ఒకే చోటుకు చేరుకోవాల్సి వచ్చింది. పరిచయం చేసుకున్నాక ప్రపంచం అందరికీ ఒక్కటే అయినప్పటికీ శాశ్వతమైన ప్రపంచంలో మనకెందుకు అశాశ్వతమైన జీవితాలు లభించాయని చర్చ ఆ ఆరుగురిలో మొదలైంది.

అందులో భాగంగా వారిలోని విశేషాలూ, వారిలోని లోపాలు ఒక్కొక్కరిగా విశ్లేషించడం మొదలుపెట్టారు. ఆ విశ్లేషణ, విచారణ పరీక్షల వరకు వెళ్లిపోయిది. అసలే సంక్లిష్ట పరిస్థితి. ఆ కారణంగానే వారంతా ఒక్కటైనారు. అయినా బుద్ధి ఊరుకోదుగా అదృశ్య యుద్ధం ఆగదుగా. జింక మొదటగా తనను తాను వ్యక్త పరుస్తూ తనలోని లోపం శబ్దం-శ్రవణం అని చెప్పింది. అంతలోనే ఒక కిరాతకుని వేణుగానం వినిపిస్తుంది. ఆ భ్రమలో పడి పరుగెత్తుకుంటూ పోయి వలలో చిక్కుకొని మరణిస్తుంది. ఏనుగు కూడా స్పర్శను అర్థం చేసుకోలేకపోవడం తన లోపమని చెబుతుంది. అయినా ఆడ ఏనుగు స్పర్శనుకొని వెళ్లి లోయలో పడి మరణిస్తుంది. మిడత రూపం గుర్తించలేకపోవడం తన లోపమని తెలిసినా అగ్నిజ్వాలను చూసి భ్రమపడి మంటల్లో పడి మాడిపోయింది. ఇక చేప వంతు. ఆశకు లొంగి ఎరకై ఎదురు చూస్తుంది. పైగా ఎర చేపను ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుందట. వస్తావూ పోతావూ నా కొరకు. వచ్చి కూర్చున్నాడు జాలరి నీ కొరకు. సగం చచ్చిపోయాను నీ కొరకు. సగం చచ్చిన నాకై నీవొస్తే చస్తావు అంటూ చెవిలో మొత్తుకున్నా వినక ఎరకై వెళ్ళిన చేప వలలో చిక్కుకొని చనిపోయింది. తుమ్మెదకు పూల పరిమళం తెలుసు, పూలలోని వ్యత్యాసం తెలుసు. ఏది మంచిదో, ఏది ప్రమాదకరమైందో తెలుసు. కానీ చంపకమనే పుష్పం వాసనకు ఆశపడి ఆ పువ్వుపై వాలగానే అది మూసుకుపోతుంది. ఊపిరాడక ప్రాణం కోల్పోయింది. వాటన్నింటినీ ప్రత్యక్షంగా చూసిన మనిషి ఇంద్రియ బలహీనతలకు లోబడి జీవితం ముగించేశాడు.

ఒక్కొక్క ఇంద్రియ బలహీనతకు లోబడి జింక, ఏనుగు, మిడత, చేప, తుమ్మెద మరణించాయంటే అర్థముంది. కానీ పంచేంద్రియాలూ మనిషిని సతమతం చేస్తాయి, కాదనలేం అయినా మనిషిలో నిరంతరం జరిగే అదృశ్యయుద్ధం మాటేమిటి? మనపై మనం చేసే యుద్ధంలో మనం గెలువాలంటే ఇంద్రియ బలహీనతను జయించి, పాపంచిక విషయాలను విస్మరించి సహజ మరణం దాకా నిశ్చయంగా బతికి చూపించడమే! అదృశ్య యుద్ధమంటేనే మనల్నిమనం గెలువడమే..

ఎవరి బతుకు పరిమితి కూడా వారిదే. అలా ఎవరి ప్రపంచలో వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాలప్రవాహంలో మునిగిపోకుండా ఈదే ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నారు. ఎవరెవరి జీవితాల గురించి వారు వారు ఆలోచన చేస్తూనే అంతర్యుద్ధం కూడా చేస్తూనే ఉన్నారు.

246
Tags

More News

VIRAL NEWS