అడుగో అతనే..


Sun,August 5, 2018 01:44 AM

crime
-మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఓ పోలీస్ ఆఫీసర్‌కి రక్తం అంటిన ఓ గొడ్డలి కనపడింది. కానీ, రాబర్ట్ క్రితం చలికాలం తను కట్టెలు నరుకుతుంటే తన వేలు తెగి దానికి రక్తం అంటిందని ప్రశాంతంగా జవాబు చెప్పాడు. ఆ భార్యాభర్తల బ్లడ్ గ్రూప్ ఒకటే. దాంతో పోలీసులు ఏగ్నెస్ ఏమైందో తెలుుకోలేక పోయారు. ఆమె ఏమైందో ఎప్పటికీ, ఎవరికీ తెలీకపోవచ్చని ఆ నలుగురూ భావించారు.

నేను అనుకోవడం అతను తన భార్యని లేపేసాడని. పొరుగింటావిడ చెప్పింది.మిగిలిన వాళ్ళు అవునన్నట్లుగా తలలు ఊపారు. ఆ నలుగురూ చేతిలో వేడి కాఫీ కప్పులతో ఒకరింట్లో కూర్చుని మిస్టర్ రాబర్ట్ తన ఇంటి పెరడులో తిరుగుతుండటం గమనించారు. చాలా కాలంగా కనపడని అతని భార్య గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారు.ఆ భార్యాభర్తల మధ్య ఎన్నడూ సఖ్యత లేదు. ఇది ఇరుగు పొరుగు అందరికీ తెలుసు. రాబర్ట్ భార్యకి తన భర్త మీద కోపం వస్తే అది ఊరందరికీ తెలిసేంత గట్టిగా అరుస్తుంది. కానీ, ఆమె ఊరికి వెళ్ళిందని రాబర్ట్ అడిగిన వాళ్ళకి చెప్పాడు. తన భార్య కేలిఫోర్నియాలోని తన అత్తగారింటికి వెళ్ళిందని చెప్పాడు.

కానీ, రాబర్ట్‌కి అతని భార్య నించి ఒక్క ఉత్తరం కూడా రాకపోవడం ఆ నలుగురు ఆడవాళ్ళు గమనించారు. వారిలోని ఒకరికి కొద్ది రోజుల క్రితం పచారీ దుకాణంలో రాబర్ట్ తారసపడ్డాడు. ఏగ్నెస్ నించి ఉత్తరం వచ్చిందా? ఆవిడ నవ్వుతూ అడిగింది.ఆ తర్వాత కొద్ది రోజులకి ఏగ్నెస్ నించి ఓ పోస్ట్ కార్డ్ వచ్చింది.అది ఆమె చేతిరాత కాదు. నాకు ఆమె చేతి రాత బాగా తెలుసు. వాళ్ళ అనుమానంలో భాగం పంచుకున్న పోస్ట్‌మేన్ వాళ్ళకి చెప్పాడు.
ఆ నలుగురు రాబర్ట్ తన భార్యని చంపడం గురించి, ఏగ్నెస్‌కి తగిన న్యాయం జరపడం గురించి మాట్లాడుకున్నారు. రాబర్ట్ తన ఇంటిని అమ్ముతాట్ట. మా ఆవిడకి కేలిఫోర్నియా నచ్చింది. నేను ఎక్కడైనా నా వృత్తిని చేసుకోగలను అని ఎవరికో చెప్తూంటే విన్నాను ఒకావిడ చెప్పింది.రాబర్ట్ ఈ మధ్య తరచూ బయట రెస్టారెంట్లలో భోజనం చేస్తున్నాడు. మరొకావిడ చెప్పింది.

భార్య ఇంట్లో లేనప్పుడు అది సహజం.
అతనితో పాటు బేంక్‌లో పని చేసే బంగారు రంగు జుట్టు గల ఓ అమ్మాయి కూడా తిరుగుతోంది.
ఏగ్నెస్ ఇంట్లో ఉంటే అతను అంత సాహసం చేసే రకం కాదు.
ఆమె ఇక ఎన్నటికీ తిరిగి రాదనే ధైర్యంతో ఆ సాహసం చేస్తున్నాడేమో?
అవును. అతను ఏగ్నెస్‌ని చంపడానికి ఇదే కారణమై ఉండవచ్చు.
* * *
ఏగ్నెస్ తల్లి పోయిందిట.
ఉత్తరం వచ్చిందా?
ఉత్తరమా? పాడా? నా కజిన్ కేలిఫోర్నియాకి వెళ్తూంటే ఏగ్నెస్‌ని కలవమని అడ్రస్ ఇచ్చాను. ఏగ్నెస్ తల్లి రెండేళ్ళ క్రితమే పోయిందిట.
బహుశ మనం పోలీసులకి ఈ విషయం చెప్పాలేమో?
కాదు. మనం మన భర్తలకి ఈ విషయం చెప్పాలి.
* * *
ఐతే భర్తల్లో ఎవరూ పోలీసులకి చెప్పలేదు. రాబర్ట్ తన ఇంట్లోని సామాండ్లన్ని పేక్ చేయడం అంతా గమనించారు. వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకున్నారు. ఐనా, ఎవరూ పోలీసులకి ఏగ్నెస్ గురించి ఫిర్యాదు చేయలేదు.
ఓ మధ్యాహ్నం రాబర్ట్ ఓ పొడుగాటి చెక్క పెట్టెని ఇంటి వెనక కాల్చేసాడు. అది పాడవడంతో కాల్చేసానని అడిగిన వాళ్ళకి చెప్పాడు. ఆ పెట్టెలో ఏం ఉందో అనే అనుమానం ఆ నలుగురి ఆడవాళ్ళనీ తొలచసాగింది. వాళ్ళు తమ భర్తలని తొలచసాగారు. చివరికి గుర్తు తెలీని ఓ వ్యక్తి పోలీసులకి ఫోన్ చేసి రాబర్ట్ తన భార్య ఏగ్నెస్‌ని చంపేసి పారిపోతున్నాడని ఫిర్యాదు చేసాడు.
ఓ మధ్యాహ్నం రాబర్ట్ టి.వి చూస్తూ, ప్రశాంతంగా కాఫీ తాగుతుంటే డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఇద్దరు మఫ్టీలోని పోలీసులు తమ ఐడెండిటీ కార్డ్‌ని చూపించి అతని భార్య గురించి విచారించారు.

ఆమె కేలిఫోర్నియాలో ఉంది చెప్పాడు.
కానీ, ఆమె తల్లి మరణించిందిగా?
అతనిలో ఎలాంటి కలవరపాటు లేదు.
జెంటిల్‌మేన్. నిజం చెప్తాను. నా భార్య ఎక్కడ ఉందో నాకు తెలీదు. ఓ రాత్రి తీవ్రంగా పోట్లాడుకున్నాం. తను ఎక్కడికి వెళ్తోందో, ఎప్పుడు తిరిగి వస్తుందో చెప్పకుండా వెళ్ళిపోయింది. వెళ్ళాక ఉత్తరం రాయమని నేను అర్థించినా ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. రాబర్ట్ వివరించాడు.
పోలీసులకి ఫిర్యాదు చేయాలని మీకు అనిపించలేదా? ఒకతను నవ్వుతూ ప్రశ్నించాడు.
మీకు ఆమె గురించి తెలీదు. ఆమెకి చాలా డబ్బుంది. ఎక్కడున్నా తనని తాను పోషించుకోగలదు. తన గురించి ఇతరులకి ఫిర్యాదు చేయడం ఆమెకి ఇష్టం ఉండదు.

కానీ, మీరు ఇంటిని, సామానుని అమ్మేస్తున్నారు. అందుకు ఆమెకి అభ్యంతరం ఉండదా? రెండో అతను సీరియస్‌గా చూస్తూ ప్రశ్నించాడు.
నేను చాలా కాలం ఏగ్నెస్ తిరిగి వస్తుందని వేచి చూసాను. ఈ ఇల్లు నాది. దాన్ని నేను అమ్మేయాలనుకుంటే అందుకు ఆమె అనుమతి అవసరం లేదు. ఒకవేళ ఆమె తిరిగి వస్తే నా కోసం వెదకాలి.
పోలీసులకి అతను చెప్పింది సబబని అనిపించినా కోరారు.
సారీ! కానీ, ఓ సారి మేం మీ ఇల్లు మొత్తాన్ని చూడొచ్చా?

ఎందుకు? నాకు అర్థం కాలేదు? మీరెందుకు నన్ను అనుమానిస్తున్నారు? అసలు మీరు ఎందుకు వచ్చారు? ఏం జరిగింది అనుకుంటున్నారు? నేను ఏగ్నెస్‌ని చంపేసానని అనుకుంటున్నారా? అతను సీరియస్‌గా, చూస్తూ ప్రశ్నించాడు.
తర్వాత ఆ నలుగురికీ తెలిసింది, ఆ ఇంటిని పోలీసులు వెదికితే ఏగ్నెస్ బట్టలు, వస్తువులు చాలా ఇంట్లో ఉన్నాయి. అవి చూసి పోలీసులు ఆమె తిరిగి రావాలని వెళ్ళిందని భావించారు. బంగారు ఆభరణాలు, ఖరీదైన చలి దుస్తులు కనబడ్డాయి. ఆమె కోపం తెలిసిన రాబర్ట్ ఆమె మరణిస్తే వాటిని అమ్మే ధైర్యం చేయడు. ఏగ్నెస్‌ని అతను చంపాడనే సాక్ష్యాధారాలేం పోలీసులకి దొరకలేదు.
ఓ పోలీస్ ఆఫీసర్‌కి రక్తం అంటిన ఓ గొడ్డలి కనపడింది. కానీ, రాబర్ట్ క్రితం చలికాలం తను కట్టెలు నరుకుతుంటే తన వేలు తెగి దానికి రక్తం అంటిందని ప్రశాంతంగా జవాబు చెప్పాడు. ఆ భార్యాభర్తల బ్లడ్ గ్రూప్ ఒకటే. దాంతో పోలీసులు ఏగ్నెస్ ఏమైందో తెలుుకోలేక పోయారు. ఆమె ఏమైందో ఎప్పటికీ, ఎవరికీ తెలీకపోవచ్చని ఆ నలుగురూ భావించారు.
* * *
తర్వాత ఏగ్నెస్ అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. అంతా గుసగుసలాడుతూ భయంగా రాబర్ట్‌ని చూస్తున్న రోజుల్లో ఓ సాయంత్రం అతని ఇంటి ముందు ఓ టేక్సీ ఆగింది. అందులోంచి ఏగ్నెస్ అరుస్తూ దిగింది.
రాబ్! వచ్చి టేక్సీకి డబ్బు చెల్లించు. వాళ్ళెవరు?
ఆ వాళ్ళు మరోసారి ప్రశ్నించడానికి వచ్చిన పోలీసులు. ఆమెని చూసి ఇబ్బంది పడ్డ వాళ్ళు వెంటనే మాయమయ్యారు.
ఏమిటిదంతా? నేను పిట్స్‌బర్గ్‌లోని నా కజిన్ మేరీ దగ్గరకి వెళ్ళానని నీకు తెలీదా? కావాలనే నీకు ఉత్తరాలు రాయలేదు. మనం ఇక్కడి నించి ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఆమె అరుపులు ఆ నలుగురు ఆడవాళ్ళకీ వినపడ్డాయి.
* * *
ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు రాబర్ట్‌తో మాట్లాడటానికి సిగ్గుపడ్డారు. అందువల్ల అతను వెళ్ళడాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. రాబర్ట్ కేలిఫోర్నియాకి వెళ్ళిపోయాడు.
ఏగ్నెస్ నిన్న రాత్రే వెళ్ళిపోయింది. గుడ్ బై. అతను అందరికీ చెప్పాడు.
అతను ఓ పొడుగాటి చెక్క పెట్టెని బండిలోకి ఎక్కిస్తుంటే అంతా నిశ్శబ్దంగా చూసారు.
ఏగ్నెస్‌ని అతను లేపేసాడు అని ఒకరితో మరొకరు ఈ సారి చెప్పలేకపోయారు.
(షైర్లీ యాన్‌ఫే కథకి స్వేచ్ఛానువాదం)

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles