ఏమని వర్ణించను..


Tue,June 11, 2019 01:55 AM

-అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌సింగ్ వీడ్కోలు
-ఐపీఎల్‌కూ నో.. విదేశీ లీగ్‌లపై ఆసక్తి

నమస్తే తెలంగాణ క్రీడా విభాగం:అసమాన ఆటతీరుతో టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన యువరాజ్ సింగ్ వీడ్కోలు మ్యాచ్ లేకుండానే వెనుదిరిగాడు. 18 ఏండ్ల వయసులో అండర్-19 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడైన యువరాజ్ చాలా త్వరగానే టీమ్‌ఇండియా తలుపు తట్టాడు.

ఘన ఆరంభం..

పోరాట యోధుడి ప్రతిభ ఎక్కువ కాలం దగదన్నట్లు.. ఆడిన రెండో మ్యాచ్‌లోనే యువీ మెరుపులు మెరిపించాడు. ఐసీసీ నాకౌట్ టోర్నీలో భాగంగా రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆకలిగొన్న పులిలా విరుచుకుపడ్డాడి పంజాబ్‌కా పుత్తర్. మెక్‌గ్రాత్, గెలెస్పీ, బ్రెట్‌లీ వంటి ప్రపంచ స్థాయి పేసర్లను ఎదుర్కొంటూ 80 బంతుల్లో 84 పరుగులు చేసి శెభాష్ అనిపించుకున్నాడు. నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ విజయం అనంతరం లార్డ్స్ గ్యాలరీలో గంగూలీ చొక్క విప్పి గర్జించడం వెనుక యువరాజ్ అద్వితీయ పోరాటం ఉందనేది క్రికెట్ ప్రేమికులకు తెలిసిన విషయమే.
Yuvaraj

బ్రాడ్‌కు చుక్కలు చూపిన యువీ..

తొలి టీ20 వరల్డ్‌కప్‌తో యువరాజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. తన దూకుడైన ఆటతో క్రికెట్‌కు సరికొత్త వేగం నేర్పిన యువీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఫ్లింటాఫ్‌తో మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన యువీ.. బ్రాడ్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. వరుస ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆటలో అనేక మా ర్పులు వచ్చినా.. బీభత్సమైన హిట్టర్లు పుట్టుకొచ్చిన అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డు (12 బంతుల్లో) మాత్రం ఇప్పటికీ యువరాజ్ పేరిటే ఉండ టం అతడి దూకుడుకు నిదర్శనం.
Yuvaraj1

క్యాన్సర్ కొరికేస్తున్నా..

28 ఏండ్ల తర్వాత భారత్ రెండో సారి వన్డే ప్రపంచకప్ అందుకోవడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించడమనేది జగమెరిగిన సత్యం. ఫైనల్లో ధోనీ సిక్స్‌తో కప్పు చేతికొచ్చినా.. అక్కడి వరకు తెచ్చింది మాత్రం నిస్సందేహంగా ఈ ఆల్‌రౌండరే. 1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్ నిర్వర్తించిన పాత్రను.. 2011 విశ్వకప్‌లో యువరాజ్ మైమరిపించాడనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. 90.50 సగటుతో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్లో సహచరులంతా వెనుదిరుగుతున్నా తన శైలికి భిన్నంగా ఒక్కో పరుగు జతచేస్తూ అతడు చేసిన అజేయ అర్ధశతకం నభూతో. విజయం అనంతరం పిచ్ మధ్యలో మోకాళ్లపై కూర్చొని చేసిన సింహనాధం ఎవరు మరువగలరు. ఈ మ్యాచ్‌కు ముందు రక్తపు వాంతులు చేసుకున్నానని తన ఆత్మకథలో రాసుకున్న యువరాజ్ మొక్కవోని దీక్షకు సలాం చేయని అభిమానంటూ లేడు.
Yuvaraj4

కెరీర్ డౌన్‌ఫాల్

ప్రాణాంతక క్యాన్సర్‌కు అమెరికాలో చికిత్స తీసుకున్న అనంతరం పునరాగమనం చేసినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై ఆడిన నెమ్మదైన ఇన్నింగ్స్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 21 బంతుల్లో 11 పరుగులే చేయడం అతడి సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. జట్టులో యువ ఆటగాళ్ల నుం చి పోటీ ఎక్కువవడం కూడా యు వీకి దెబ్బ కొట్టింది. దీంతో చోటు కోల్పోవా ల్సి వచ్చింది. మరోసారి అవకాశం వచ్చినా.. అది ముణ్నాళ్ల ముచ్చటే అయింది. ఏదేమైనా.. ప్రపంచ క్రికెట్‌కు భారత్ అందించిన గొప్ప క్రికెటర్లలో యువీ పేరు తప్పక ఉంటుంది.

ముంబై: డాషింగ్ బ్యాట్స్‌మన్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన అద్భత ఆటతీరుతో టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఆల్‌రౌండర్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లతో పాటు ఐపీఎల్‌కూ రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏండ్ల యువరాజ్ సోమవారం భార్య హజల్ కిచ్, తల్లి షబ్‌నమ్‌తో కలిసి వాంఖడే స్టేడియం సమీపంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన నిర్ణయం వెల్లడించాడు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన వరల్డ్‌కప్ హీరో ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుతూ గద్గద స్వరంతో తన భావాలను వెల్లడించాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే..
Yuvaraj2

ఆట అన్నీ ఇచ్చింది

దాదాపు 17 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా చూశాను. క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది. అందుకే ఈ రోజు నేను మీ ముందు నిల్చున్నా. దేశం కోసం 400 మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అరంగేట్రం చేసిన రోజు ఇక్కడి వరకు వస్తానని ఊహించలేదు. ప్రపంచకప్ నెగ్గడం.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలువడం ఓ కల. ఇదంతా ప్రాణాంతక క్యాన్సర్ ఒంట్లో పెట్టుకొని నేనే సాధించానా అనిపిస్తున్నది. కెరీర్‌లో ఎన్నో ఉత్తాన పతనాలు చూశాను. ఒడిదుడుకులను ఎదుర్కొని మొండిగా నిలబడ్డా. నా కెరీర్‌లో గంగూలీ, ధోనీ బెస్ట్ కెప్టెన్‌లైతే.. నేను ఎదుర్కొన్న ఉత్తమ బౌలర్లు మెక్‌గ్రాత్, మురళీధరన్.

యో-యో టెస్టు పాసైతే చాన్సిస్తానన్నారు

యో-యో టెస్టు పాసైతే.. వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం కల్పిస్తామని బీసీసీఐ ముందు మాటిచ్చింది కానీ దాన్ని నిర్వర్తించలేకపోయింది. యో-యో టెస్టు పాస్ కావడం నీ వల్ల కాకపోతే.. చివరి మ్యాచ్ ఆడేయచ్చు అని బీసీసీఐ నుంచి సమాచారం వచ్చింది. నాకు ఒక మ్యాచ్ కావాలని బతిమిలాడి వీడ్కోలు మ్యాచ్ ఆడాల్సిన దుర్గతి పట్టలేదు. రిటైర్మెంట్ మ్యాచ్ అవసరం లేదు అని నేను అప్పుడే చెప్పేశాను. యో-యో టెస్టు పాస్ కాలేకపోతే నాకు నేనుగా తప్పుకుంటా అని చెప్పా.. ఆ తర్వాత టెస్టు పాసైనా మ్యాచ్ అవకాశం మాత్రం ఇవ్వలేదు.

విదేశీ లీగ్‌ల్లో ఆడుతా..

కెరీర్ ఎలా ముంగిచాలని చాలా మదన పడ్డా. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఉంటే సంతృప్తిగా ఉండేది. 2019 ఐపీఎల్ చివరిదని గతేడాదే నిర్ణయించుకున్నా. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా అందుబాటులో ఉండను. బీసీసీఐ నుంచి అనుమతి లభిస్తే విదేశాల్లో టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు ఎదురు చూస్తున్నా. ఈ వయసులో పోటీ క్రికెట్ కాకుండా సరదా ఆట అయితేనే ఆడగలను. అంతర్జాతీయ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఐపీఎల్ లాంటి ఒత్తిడితో నిండిన పెద్ద టోర్నీల్లో ఆడటం కష్టంతో కూడుకున్నది. అందుకే బీసీసీఐ అనుమతిస్తే.. విదేశీ లీగ్‌లు ఆడాలనుకుంటున్నా.

ఏమా క్యాచ్‌లు..

టీమ్‌ఇండియా ఫీల్డింగ్ రూపురేఖలు మార్చిన వారిలో యువరాజ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. తానాడిన రెండో మ్యాచ్‌లోనే అద్భుతం అనదగ్గ క్యాచ్‌తో పాటు.. అసాధ్యం అనదగ్గ రనౌట్‌తో ఔరా అనిపించిన యువీ కెరీర్ అసాంతం కీలక ఫీల్డర్‌గానే కొనసాగాడు. నేటికి భారత ప్లేయర్లు పట్టిన బెస్ట్ క్యాచ్‌లు అని గూగుల్ చేస్తే.. టాప్ 10లో 6 అతడివే ఉంటాయంటే అతడు ఎంతటి చురుకైన ఫీల్డరో అర్థంచేసుకోవచ్చు.
Yuvaraj3

అచ్చిరాని ఐపీఎల్

ఐపీఎల్ ఆరంభంలో యువీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత పుణే వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించినా తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. తొలి సీజన్‌లో సిక్సర్ల కింగ్‌గా భారీ ధరకు అమ్ముడైన యువీ దానికి న్యాయం చేయలేకపోవడంతో కొన్నాళ్ల తర్వాత కింగ్స్ పంజాబ్ యాజమాన్యం అతడిని జట్టు నుంచి తప్పించింది. ఆ తర్వాత వివిధ ఫ్రాంచైజీల తరఫున బరిలో దిగినా ఒకటీ ఆరా మెరుపులు తప్ప గుర్తుంచుకునే ఇన్నింగ్స్‌లు మాత్రం పెద్దగా ఆడలేదు. ఈ సీజన్‌కు ముందు వేలంలో మొదటిసారి అమ్ముడుపోని యువరాజ్ రెండో దఫాలో ముంబై జట్టుతో చేరినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన యువీ 98 పరుగులే చేశాడు.

గతంలో దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌కు కూడా వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దేశానికి ఎన్నో అద్భుత విజయాలు అందించిన వీరికి కనీసం ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఇవ్వకుండానే సాగనంపారు. ఇప్పుడు ఈ జాబితాలో యువీ పేరు చేరింది.

పదేండ్ల పసి ప్రాయంలో పదహారేండ్ల పిల్లలతో పోటీపడి పరుగుతీసినా.. తండ్రి కన్న కలను పూర్తిస్థాయిలో సాకారం చేసినా.. ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతూనే జట్టుకు మరపురాని ప్రపంచకప్ కట్టబెట్టినా అదంతా యువరాజ్‌కే చెల్లింది. 17 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఉత్తాన పతనాలు చూసిన యువీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
చెప్పేశాడు.

ఎంత అద్భుతమైన కెరీర్ యువీ నీది. జట్టుకు అవసరమైన ప్రతిసారి నిజమైన చాంపియన్ అని నిరూపించుకున్నావు. క్రికెటర్‌గా, వ్యక్తిగతంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా.. ఎదురొడ్డి నిలిచిన తీరు అమోఘం. నీ రెండో ఇన్నింగ్స్ బాగుండాలి.. దేశ క్రికెట్‌కు నీవు చేసిన సేవలకు ధన్యవాదాలు.
- సచిన్ టెండూల్కర్

దేశ క్రికెట్‌కు సుదీర్ఘ కాలం పాటు సేవలందించి వీడ్కోలు తీసుకుంటున్న యువీ పాజీ నీకు అభినందనలు. నీ అద్భుత ఆటతీరుతో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించావు. భవిష్యత్తులో నీకు అంత మంచే జరుగాలి.
-కోహ్లీ, భారత కెప్టెన్
LIST

1398

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles