సౌరభ్ స్వర్ణ గురి


Thu,October 11, 2018 01:32 AM

-10మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో పసిడి పతకం
-టీటీలో అర్చనా కామత్ సంచలనం
-యూత్ ఒలింపిక్స్

saurabh-chaudhary
బ్యూనస్ ఎయిర్స్: ప్రతిష్ఠాత్మక యూత్ ఒలింపిక్స్‌లో భారత పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గత రికార్డులను తిరుగరాస్తూ..యువ షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. సహచరులు అందించిన స్ఫూర్తితో భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి స్వర్ణ పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంటులో సౌరభ్ 244.2 స్కోరుతో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. సంగ్ యున్హో(దక్షిణకొరియా, 236.7), సోలారీ జాసన్(స్విట్జర్లాండ్, 215.6) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఇటీవలి ఆసియా క్రీడలతో పాటు ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలతో చరిత్ర సృష్టించిన సౌరభ్..మరోమారు సత్తాచూపాడు. పార్వీ పోలీడెపోర్టివో రోకా షూటింగ్ రేంజ్‌లో జరిగిన ఫైనల్లో షూటర్లు హోరాహోరీగా తలపడ్డారు. 580 పాయింట్లతో ప్రధాన రౌండ్‌క అర్హత సాధించిన 16 ఏండ్ల సౌరభ్..ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఏ దశలోనూ వెనుకకు తగ్గకుండా అంతకంతకు పాయింట్లను పెంచుకుంటూ పోయాడు. ఈ క్రమంలో ప్రత్యర్థులకు దీటైన సవాలు విసురుతూ ఏకంగా 18 సార్లు 10కి పైగా పాయింట్లు కొల్లగొట్టాడు. కేవలం నాలుగంటే నాలుగుసార్లు మాత్రమే 9 పాయింట్ల స్కోరును అందుకున్నాడు. మొదట్లో కొంత నెమ్మదించినా..ఆఖర్లో అద్భుతంగా పుంజుకున్న సౌరభ్..7.5పాయింట్ల తేడాతో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. గత నాలుగు రోజుల్లో భారత్‌కు ఇది నాలుగో పతకం కావడం విశేషం. మనుభాకర్ , సౌరభ్ చౌదరీ స్వర్ణాలు సాధించగా, మెహులీ ఘోష్, సాహు మానె రజత పతకాలు సాధించారు.

టీటీలో అర్చన సంచలనం

టేబుల్ టెన్నిస్‌లో అర్చనా కామత్..సంచలనం సృష్టించింది. యూత్ ఒలింపిక్స్ టీటీలో సెమీస్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా అర్చన రికార్డు నెలకొల్పింది. క్వార్టర్స్‌లో ఈ కర్ణాటక టీటీ ప్యాడ్లర్ 4-3తో నింగ్ జింగ్(అజర్‌బైజాన్)పై అద్భుత విజయం సాధించింది. అయితే సెమీస్‌లో 1-4తో యింగ్‌షా సన్(చైనా) చేతిలో ఓటమిపాలైంది. అయితే కాంస్య పతక పోరులో భాగంగా అండ్రియా డ్రాగోమన్(రొమేనియా)తో అర్చన తలపడుతుంది.

అమ్మాయిలు అదుర్స్

భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. బుధవారం వాన్‌తౌతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 16-0 తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా తరఫున ముంతాజ్ ఖాన్(8ని, 11ని, 12ని, 15ని) నాలుగు గోల్స్ చేయగా, చేతన(6ని, 14ని, 17ని) హ్యాట్రిక్ గోల్స్‌తో ఆకట్టుకుంది.

803

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles