హైదరాబాద్ ఆణిముత్యాలు


Tue,August 13, 2019 02:01 AM

-ఆసియా, ఓషియానా రెగెట్టా టోర్నీకి ఎంపికైన ప్రీతి, ఝాన్సీ, లక్ష్మి
-అంచలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి యువ సెయిలర్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: సెయిలింగ్.. అలలకు ఎదురొడ్డి నిలుస్తూ గాలివాటాన్ని అనుకూలంగా మలుచుకుంటూ గమ్యాన్ని చేరే సాహస క్రీడ. ఏ మాత్రం పట్టు తప్పినా ఫలితం అందకుండా పోయే ఆట. మరి అలాంటి సెయిలింగ్‌లో ప్రత్యర్థులకు దీటుగా నిలుస్తూ రాణించడమంటే మామూలు విషయం కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మన హైదరాబాదీ ఆణిముత్యాలు ప్రీతి కొంగర, ఝాన్సీ ప్రియ, లక్ష్మీ నూకరత్నం. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినా సాధించాలన్న ఏకైక లక్ష్యంతో సెయిలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు వీరు. కష్టాలకు ఎదురొడ్డి నిలుస్తూ సాహసమే ఊపిరిగా పతకాలు కొల్లగొడుతూ రాష్ట్ర, దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. ఒమన్ వేదికగా సెప్టెంబర్ 30 నుంచి మొదలయ్యే ఆసియా, ఓషియానా రెగెట్టా చాంపియన్‌షిప్ టోర్నీకి ప్రీతి, ఝాన్సీ, లక్ష్మి ఎంపికై తమ సత్తాచాటారు. ఇటీవల జరిగిన 11వ హైదరాబాద్ మాన్‌సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో మెరిశారు. ముఖ్యంగా జాతీయ ర్యాంకింగ్ మాన్‌సూన్ రెగెట్టాలో ప్రీతి పసిడి పతకం కొల్లగొట్టింది.
sailing

అంతర్జాతీయ టోర్నీకి తొలిసారి:

ఒమన్ వేదికగా సెప్టెంబర్‌లో జరిగే ఆసియా ఓషియానా చాంపియన్‌షిప్‌నకు ప్రీతి, ఝాన్సీ, లక్ష్మి తొలిసారి ఎంపికయ్యారు. నిలకడైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించారు. దేశం తరఫున మొత్తం 10 మంది సెయిలర్లు బరిలోకి దిగనుండగా, అందులో ఆరుగురు హైదరాబాద్ వాళ్లే కావడం గర్వంగా ఉందని యాచ్ క్లబ్ అధ్యక్షుడు సుహేమ్ షేక్ అన్నారు. ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి ముగ్గురు బాలికలు ఎంపిక కావడం కష్టానికి తగిన గుర్తింపు నిచ్చింది. సరిగ్గా మూడేండ్ల క్రితం నావికా ప్రాజెక్ట్ ద్వారా కొంత మంది అమ్మాయిలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చాం. అందులో ప్రీతి, ఝాన్సీ, లక్ష్మి అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. టోర్నీ టోర్నీకి మెరుగవుతూ తొలిసారి అంతర్జాతీయ వేదికపై పోటీపడబోతున్నారు అని షేక్ అన్నారు.

పేదరికాన్ని జయిస్తూ

సెయిలింగ్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ప్రీతి, ఝాన్సీ, లక్ష్మి పేదరికాన్ని ఎదిరించి ఈ స్థాయికి ఎదిగారు. ఏదైనా సాధించగలమన్న పట్టుదలకు తోడు కఠోర శిక్షణతో రాష్ట్ర ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేస్తున్నారు. నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో ప్రీతి ప్రస్తుతం 10వ తరగతి చదువుతుండగా, సికింద్రాబాద్‌లోని ఉద్భవ్ స్కూల్‌లో లక్ష్మి తొమ్మిది, ఝాన్సీ ఎనిమిదో తరగతులు చదువుతున్నారు. అటు విద్యతో పాటు సెయిలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. రానున్న ఆసియా, ఓషియానా టోర్నీలోనూ పతకాలతో మెరువాలని ఆశిద్దాం.

340

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles