పట్టు పడతారా


Sat,September 14, 2019 12:24 AM

punia

- నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
- బరిలో బజరంగ్, సుశీల్, వినేశ్, సాక్షి


నూర్ సుల్తాన్ (కజకిస్థాన్): ప్రతిష్ఠాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్ మెగాటోర్నీ బరిలో దిగనున్నారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న చాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ (2020)కు అర్హత సాధించేందుకు మన రెజ్లర్లు సిద్ధమవుతున్నారు. ఈ చాంపియన్‌షిప్‌లో మూడు స్టయిల్స్‌లో కలిపి ఆరు విభాగాల్లో 6 ఒలింపిక్స్ కోటాలు కేటాయించారు. కజకిస్థాన్ వేదికగా జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ భారీ బృందాన్ని బరిలో దించుతున్నది. ఈ ఏడాది పాల్గొన్న నాలుగు టోర్నీల్లోనూ స్వర్ణాలు నెగ్గిన ప్రపంచ నంబర్‌వన్ బజరంగ్ (65 కేజీలు) అదే జోరులో చాంపియన్‌షిప్‌లోనూ పసిడి పతకం కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.

ఇప్పటి వరకు చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన బజరంగ్‌కు బంగారు పతకం మాత్రం అందని ద్రాక్షగానే ఊరిస్తున్నది. భారత రెజ్లింగ్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం సుశీల్ కుమార్ (74 కేజీలు) మాత్రమే ఫ్రీ స్టయిల్ విభాగంలో టైటిల్ సాధించాడు. ఇప్పుడు బజరంగ్ ఆ ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. అయితే రష్యా, బహ్రెయిన్ రెజ్లర్ల నుంచి అతడికి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. గతంలో ఈ వేదికపై స్వర్ణం గెలిచిన సుశీల్ ఎనిమిదేండ్ల తర్వాత తిరిగి చాంపియన్‌షిప్ నెగ్గాలని భావిస్తున్నా.. ఇటీవల అతడి ప్రదర్శన గమనిస్తే అది కష్టమే అనిపిస్తున్నది. జూనియర్ ప్రపంచ చాంపియన్ టైటిల్ నెగ్గిన దీపక్ పునియా (86 కేజీలు) నుంచి అద్భుతాలు ఆశించొచ్చు. గ్రీకో రోమన్ విభాగంలో గుర్‌ప్రీత్ సింగ్ (77 కేజీలు), హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు) పతకాలు నెగ్గే అవకాశాలు ఉన్నాయి.

వినేశ్‌పైనే ఆశలు..

ప్రపంచ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఇప్పటివరకు భారత్‌కు స్వర్ణం దక్కలేదు. ఈ లోటును ఈసారి వినేశ్ ఫోగట్ పూడుస్తుందేమో చూడాలి. ఇటీవలే 50 కేజీల విభాగం నుంచి 53 కేజీలకు మారిన వినేశ్.. కొత్త కేటగిరీలో ఐదు ఫైనల్లలో పాల్గొంది. అందులో యాసర్ డోగు, స్పెయిన్ గ్రాండ్ ప్రి, పోలండ్ ఓపెన్‌లో స్వర్ణాలు నెగ్గింది. గాయం కారణంగా గతేడాది చాంపియన్‌షిప్‌నకు దూరమైన వినేశ్ ఈసారి మరింత బలంగా పోరాడేందుకు సిద్ధమైంది. రియో ఒలింపిక్స్(2016) కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ (62 కేజీలు) ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బంది పడుతున్నది. 2017 కామన్వెల్త్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత సాక్షి ఇప్పటి వరకు మరో పతకం నెగ్గలేకపోయింది. ఈ సీజన్‌లో రెండు స్వర్ణాలు సాధించి మంచి జోరు మీదున్న యువ రెజ్లర్ దివ్య కక్రాన్ (68 కేజీలు) చాంపియన్‌షిప్‌లోనూ అదే దూకుడు కొనసాగించి పతకం కైవసం చేసుకోవాలని చూస్తున్నది. 59 కేజీలు విభాగంలో పూజా దండా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

155

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles