విరాట్ సేన


Tue,April 16, 2019 02:41 AM

-వన్డే వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన
-రాహుల్, కార్తీక్‌కు చోటు
-రాయుడు, పంత్‌కు మొండిచేయి
-పేస్ ఆల్‌రౌండర్‌గా విజయ్ శంకర్

ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్‌కప్ ముద్దాడాలనుకుంటున్న భారత్.. అందుకు తగ్గట్లే పటిష్టమైన పదిహేను మందితో జట్టును ప్రకటించింది. ఉత్కంఠ లేదు.. ఊహించని పేర్లు లేవు. కొంతకాలంగా అందరి నోళ్లలో నానుతున్న వారిలో నుంచే సెలెక్షన్ కమిటీ అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. ముగ్గురు ఓపెనర్లు, ముగ్గురు పేసర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఇలా తక్కెడతో తూచినట్లు సెలెక్షన్ ప్రక్రియ ముగించింది. హైదరాబాదీ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడుకు చాన్స్ దక్కకపోవడం ఒక్కటే కాస్త ఇబ్బంది పెట్టినా.. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సర్దుకుపోవాల్సిందే. మహా సంగ్రామానికి ముందు తొలి అంకం ముగిసింది. ఇక మిగిలిందల్లా దుమ్మురేపి దున్నేయడమే..
virat-kohli
ముంబై: ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. విశ్వసమరంలో తలపడే జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ సుదీర్ఘ చర్చ అనంతరం బరిలో దిగనున్న 15 మందిని తేల్చేసింది. ఇక అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకొని ఇంగ్లండ్ వేదికగా వచ్చే నెల 30 నుంచి ప్రారంభమయ్యే మహా సంగ్రామానికి సిద్ధమవ్వడమే తరువాయి. హైదరాబాదీ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడుకు అవకాశం దక్కకపోవడం.. పంత్‌ను పక్కనపెట్టి కార్తీక్ వైపు మొగ్గుచూపడం మినహా పెద్దగా సంచలనాలేం లేవు.

రాయుడుకు నోచాన్స్

పాండ్యా గైర్హాజరీలో మీడియం పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన శంకర్ నెమ్మదిగా బౌలింగ్‌ను పక్కన పెట్టి బ్యాటింగే ప్రధాన బలంగా చెలరేగి ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధమేనని ని రూపించుకుంటూ రాయుడు ప్లేస్‌కు ఎసరు పెట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ (2017) తర్వాతి నుంచే వరల్డ్ కప్ జట్టు ఎంపికపై దృష్టి పెట్టాం. కానీ ఇటీవలి కాలంలో శంకర్ ప్రదర్శనను విస్మరించలేకపోయాం అని జట్టును ప్రకటించిన అనంతరం ఎమ్మెస్కే అన్నాడు. అదనపు ఓపెనర్‌తో పాటు నాలుగో నంబర్ స్థానం కోసమైనా రాహుల్ ఉపయుక్తమైన ప్లేయర్. రాహు ల్, శంకర్, జాదవ్ వీరిలో ఎవరినైనా ఆ స్థానంలో వినియోగించుకోవచ్చు అదం తా టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక హార్దిక్ హాజరులో అదనపు పేసర్ అవసరం లేదనుకున్నారేమో.. ఆ ప్రస్థావనే తీసుకురాలేదు.

మూడో స్పిన్నర్, మూ డో ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడే జా చోటు దక్కించుకున్నాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించగల జడేజా ఉంటే జట్టుకు వైవిద్యం చేకూరుతుందని సెలెక్టర్లు పేర్కొన్నారు. ఏడాదిన్నరగా కుల్దీప్, చహల్ జోడీ చక్కగా రాణిస్తున్నా.. కొన్ని సందర్భాల్లో మరో స్పిన్ ఆల్‌రౌండర్ అవసరం పడొచ్చు. అందు కే జడేజాకు చోటు కల్పించాం. టోర్నీ సాగుతున్నా కొద్ది వికెట్ పొడిబారుతుంది. అలాంటి సమయాల్లో జడేజా ఎక్కువ ప్రమాదకారిగా నిలుస్తాడు అని ఎమ్మెస్కే తెలిపాడు. పేస్ ఆల్‌రౌండర్లుగా పాండ్యాతో పాటు శంకర్ అం దుబాటులో ఉండటంతో.. అదనపు పేసర్ జోలికి వెళ్లలేదు. బుమ్రా, షమీ ప్రధాన పేసర్లు కాగా.. భువనేశ్వర్ బ్యా కప్ పేసర్‌గా ఉంటాడని.. ఎంపిక సందర్భంగా సైనీ, ఖలీల్ అహ్మద్ పేర్లు చర్చకు వచ్చినా ఆ అవసరం లేదనిపించిందని సెలెక్టర్లు పేర్కొన్నారు.

world-cup-2019

కొత్త పాత కలబోత

గత ప్రపంచకప్ ఆడినవారిలో ఏడుగురికి తిరిగి అవకాశం ఇచ్చిన సెలెక్షన్ కమిటీ.. మరో 8 మంది కొత్తవాళ్లకు చాన్సిచ్చింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకిది నాలుగో విశ్వసమరమైతే.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి మూడోది. రోహిత్, ధవన్, జడేజా, షమీ, భువనేశ్వర్, కార్తీక్ రెండో సారి వరల్డ్‌కప్‌లో ఆడనుండగా.. రాహుల్, జాదవ్, పాండ్యా, శంకర్, కుల్దీప్, చహల్, బుమ్రా తొలిసారి మెగాటోర్నీకి ఎంపికయ్యారు. రోహిత్, ధవన్ ఓపెనర్లుగా చెలరేగిపోతుంటే.. రిజర్వ్ ఓపెనర్‌గా రాహుల్‌కు ఓటేసిన సెలెక్షన్ కమిటీ.. అదనపు వికెట్ కీపర్‌గా వెటరన్ దినేశ్ కార్తీక్‌వైపే మొగ్గు చూపింది. కీపింగ్ నైపుణ్యాలతో పాటు ఒత్తిడిని ఎదుర్కోవడంలో అనుభవమున్నందుకే అతడికీ చాన్స్‌దక్కింది. కార్తీక్, పంత్ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసినా.. అనివార్య కారణాల వల్ల ధోనీ అందుబాటులో లేకుంటేనే తుది జట్టులో చోటు దక్కుతుంది.

అలాంటి సమయంలో కీపింగ్ కూడా ప్రభావం చూపుతుంది. ఆ ఒక్క కారణంతోనే అనుభవం ఉన్న కార్తీక్‌ను ఎంపికచేశాం. లేకపోతే పంత్ దాదాపుగా జట్టులోకి వచ్చేసినట్లే అని ఎమ్మెస్కే తెలిపాడు. ధోనీ కంటే మూడు నెలల ముందే టీమిండియాకు ఆడిన కార్తీక్ పుష్కర కాలం తర్వాత వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు గతంలో 2007 ప్రంపచకప్ జట్టుకూ ఎంపికయ్యాడు. అనూహ్యంగా ప్రస్తుతం టీమ్‌లో అందరికంటే అతడే సీనియర్ కావడం విశేషం. సెలెక్షన్‌కు ఐపీఎల్ ప్రదర్శన ప్రమాణికం కాదని కోహ్లీ ముందే చెప్పినట్లు ప్రస్తుత సీజన్‌లో జోరుమీదున్న పంత్(245)ను పక్కన పెట్టి కార్తీక్ (111)ను ఎంపిక చేశారు.

వరల్డ్‌కప్ భారత జట్టు

-విరాట్ కోహ్లీ (కెప్టెన్)
-రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్)
-శిఖర్ ధవన్
-లోకేశ్ రాహుల్
-మహేంద్ర సింగ్ ధోనీ
-కెదార్ జాదవ్
-హార్దిక్ పాండ్యా
-విజయ్ శంకర్
-కుల్దీప్ యాదవ్
-యుజ్వేంద్ర చహల్
-మొహమ్మద్ షమీ
-జస్ప్రీత్ బుమ్రా
-భువనేశ్వర్ కుమార్
-దినేశ్ కార్తీక్
-రవింద్ర జడేజా
team-players

392

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles