ధోనీ దారెటు?


Thu,July 18, 2019 03:56 AM

-రిటైర్మెంట్‌పై మౌనం వీడని మహీ
-జట్టులో రెండో కీపర్‌గా కొనసాగే అవకాశం.. పంత్‌ను తీర్చిదిద్దే బాధ్యత స్వీకరణ!

మహేంద్ర సింగ్‌ ధోనీ.. క్రికెట్‌ చరిత్ర చూసిన అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకడు.. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లను అందించిన ఏకైక సారథి... ఓటమి అంచున ఉన్న జట్టును ఎన్నోసార్లు గెలుపు తీరం దాటించిన బెస్ట్‌ ఫినిషర్‌.. అయితే కెరీర్‌ చరమాంకంలో తడబడుతున్న ధోనీ ప్రపంచకప్‌ తర్వాత రిటైర్‌ అవుతాడన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మహీ మాత్రం మౌనముద్ర వీడడం లేదు.. ఎందరో ప్రముఖులు అతను టీమ్‌ఇండియాలో కొనసాగాల్సిందేనని సూచిస్తున్నారు. మరికొందరేమో జట్టుకు ధోనీ అవసరం అపారంగా ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రిటైరయ్యే అవకాశం లేదని, జట్టుతోనే ఉంటూ యువ క్రికెటర్లకు సలహాలిస్తూ దిశానిర్దేశం చేస్తాడనే వాదన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహీ ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు, టీమ్‌ఇండియాలో అతడి పాత్ర ఎలా ఉండబోతున్నదనే అంశాలపై విశ్లేషణాత్మక కథనం.
MS-Dhoni
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం:ప్రపంచకప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయిన టీమ్‌ ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మరుక్షణం నుంచి క్రికెట్‌ ప్రపంచంలో చర్చంతా ఒకే అంశంపై. అదే మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌. అతడు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతాడని కొందరు... లేదు ధోనీ అవసరం టీమ్‌ఇండియాకు అపారంగా ఉందని మరికొందరు... అసలు వైదొలిగే ఆలోచనే చేయొద్దంటూ ఇంకొందరు అంటూనే ఉన్నారు. ధోనీ మాత్రం ఈ విషయంపై పెదవి విప్పడం లేదు. విశ్వటోర్నీ తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలోని సారథ్య సామర్థ్యంపై ఓ వైపు అనుమానాలు వ్యక్తమవుతుంటే.. జట్టులో విభేదాలు ఉన్నాయన్న వాదనలు గుప్పుమంటున్నాయి. మరోవైపు జట్టు మిడిలార్డర్‌లో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ ఏం చేయనున్నాడు.. రిటైర్మెంట్‌కు మొగ్గు చూపుతాడా... జట్టు కోసం కొనసాగాలని నిర్ణయించుకుంటాడా... టీమ్‌ ఇండియాకు అతడి అవసరమెంత.

యువ క్రికెటర్లకు అండగా..

ధోనీ ఇప్పటికిప్పుడే రిటైరవకుండా జట్టులో రెండో కీపర్‌గా కొనసాగుతాడనే తాజా వాదన వెలుగులోకి వచ్చింది. తదుపరి జరిగే వెస్టిండీస్‌ సిరీస్‌కు అతడు వెళ్లకపోయినా... ఆ తర్వాతి సిరీస్‌లకు ఎంపికవుతాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలా అయితే 15మంది సభ్యుల్లో ఉన్నా.. తుది జట్టులో ఆడకుండా.. రిషబ్‌ పంత్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పంత్‌ను అత్యుత్తమ వికెట్‌ కీపింగ్‌ బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్ది.. తన స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిగా చేసే బాధ్యతను ధోనీ భుజాన వేసుకోనున్నట్లు తెలుస్తున్నది. జట్టులో కొత్తగా వచ్చే ఆటగాళ్లకు అండగా ఉండనున్నారు. ఐపీఎల్‌లో తదుపరి సీజన్‌లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ధోనీ కొనసాగడం తథ్యమనే సంకేతాలొస్తున్నాయి.

తెరవెనుక రథసారథిగా..

ప్రపంచకప్‌లో ఓటమి తర్వాత టీమ్‌ఇండియాలో ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు గుప్పుమన్నాయి. కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పొసగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించాలన్న డిమాండ్‌ ఊపందుకుంటున్నది. ఈ నేపథ్యంలో జట్టులో సీనియర్‌ అయిన ధోనీ దూరమైతే విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తుదిజట్టులో లేకుండా అందరి ప్రదర్శనను విశ్లేషిస్తూ... జట్టు ఐకమత్యంగా ముందుకు సాగేందుకు కృషి చేయాలని ధోనీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

రిటైరవ్వొద్దు ప్లీజ్‌..

ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వొద్దంటూ కొందరు మాజీలు సహా సినీ రంగ ప్రముఖులు, సన్నిహితులు ధోనీకి సూచిస్తూనే ఉన్నారు. రిటైర్మెంట్‌ ఆలోచనను ఎట్టిపరిస్థితుల్లో మనసులోకి రానివ్వొద్దని ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్‌ ఇటీవలే ధోనీకి సూచించారు. ఇక బాలీవుడ్‌ సీనియర్‌ రచయిత జావేద్‌ అక్తర్‌ సైతం ఇలాంటి విన్నపమే చేశారు. చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం మహీ వైదొలగడానికి ఇది సరైన సమయం కాదని అంటున్నారు.

ధోనీ లేనికోహ్లీ ఎలా..

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ లేకుంటే కోహ్లీ సారథిగా ఏ మేరకు జట్టును సమర్థంగా నడిపిస్తాడోనన్న అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతంతా మహీపై వేసి ఏ బౌండరీ లైన్‌ దగ్గరో విరాట్‌ నిలబడడం ఇంతకు ముందు చాలాసార్లు చూశాం. బౌలర్లకు సైతం ధోనీనే సూచనలు, సలహాలు ఇస్తుంటాడు. కష్టకాలంలో తాను ధోనీ సలహాలు స్వీకరిస్తానని కోహ్లీ కూడా అనేక సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా విరాట్‌ సామర్థ్యం పూర్తిగా తేలకముందే ధోనీ వైదొలిగితే టీమ్‌ఇండియా పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

జట్టు అవసరం కోసమే..

ధోనీ ఏం చేసినా జట్టు కోసమే చేస్తాడనేది చాలా మంది వాదన. తన అవసరం టీంకు లేదనుకుంటే ఏ క్షణానైనా అతడు వెళ్లిపోతాడని.. టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలిగిన క్రమాన్ని, పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలను త్యజించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భారత టెస్టు జట్టును కోహ్లీని నడిపిస్తాడన్న నమ్మకం కలిగిన మరుక్షణమే... ఆస్ట్రేలియా సిరీస్‌(2014)మధ్యలోనే ధోనీ సుధీర్ఘ ఫార్మాట్‌ నుంచి తప్పుకున్నాడని చెబుతున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో జట్టుకు తన అవసరం ఉంది కాబట్టే మహీ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నాడని విశ్లేషిస్తున్నారు. జట్టు పరిస్థితుల కారణంగా కనీసం వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకైనా టీమ్‌ ఇండియాతో ధోనీ ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

930

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles