ఇంగ్లండ్ హెడ్డర్ తలొంచిన స్వీడన్


Sun,July 8, 2018 01:27 AM

- స్వీడన్‌పై 2-0తో విజయం
-క్వార్టర్స్‌లో 2-0 గోల్స్‌తో స్వీడిష్ జట్టు ఓటమి..
-28 ఏండ్ల తర్వాత సెమీస్ చేరిన ఇంగ్లీష్ టీమ్..

Harry-Maguire
ఎప్పుడో 1966లో ఫిపా ప్రపంచకప్ విజేతగా నిలిచిన చరిత్ర..అప్పటి నుంచి ఇంగ్లండ్ జట్టుపై వారి అభిమానులకు ఎన్నో ఆశలు..మరెన్నో ఆకాంక్షలు.. ప్రతిసారి ప్రపంచకప్‌లో పాల్గొనడం..ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడం.. ఇంకా చెప్పాలంటే ప్రపంచకప్‌లో ఇంగ్లీష్ టీమ్ సెమీస్ చేరి 28 ఏండ్లు.. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లో మాత్రం ఇంగ్లండ్ గత చరిత్రను తిరగరాస్తూ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. టైటిల్ ఫేవరెట్ జట్లన్నీ వెనుదిరుగుతున్నా సెమీఫైనల్ చేరి ఆశ్చర్యపరిచింది. ఎలాంటి అంచనాలు..మరెలాంటి ఒత్తిడిలేకుండా రష్యా చేరిన ఇంగ్లండ్ అభిమానులను అలరిస్తూ టైటిల్ దిశగా దూసుకెళుతున్నది.. ఇంగ్లండ్‌పై స్వీడన్‌కు మెరుగైన రికార్డున్నా..సమారా ఎరీనాలో జరిగిన క్వార్టర్స్‌లో మాత్రం
విజయం దక్కక పోవడం విశేషం..

సమారా: యువ ఇంగ్లండ్ జట్టు ఫిఫా ప్రపంచకప్ సెమీస్ చేరి సంచలనం సృష్టించింది. ఏమాత్రం అనుభవం లేని అంతా కొత్త ఆటగాళ్లతో 2018 ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇంగ్లీష్ జట్టు క్వార్టర్ ఫైనల్లో స్వీడన్‌పై 2-0 గోల్స్‌తో ఘన విజయం సాధించింది. తద్వారా 1990 తర్వాత తొలిసారి ప్రపంచకప్ సెమీస్ చేరింది. పటిష్ఠమైన స్వీడన్ డిఫెన్స్‌ను నిలువరించేందుకు హెడ్డర్లను నమ్ముకున్న ఇంగ్లండ్ వ్యూహం విజయవంతమైంది. ఆట ప్రారంభం నుంచి ఇంగ్లండ్ జట్టు ఎలాంటి జంకు లేకుండా ఎదురుదాడివ్యూహంతో స్వీడన్‌ను ఎదుర్కొంది. శరపరంపరగా దాడులు చేస్తూ గోల్‌కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో స్వీడన్ డిఫెన్స్ గందరగోళంలో పడింది. ఒకవైపు డిఫెన్స్ ఆడుతూనే స్వీడన్ కూడా ఎదురుదాడి చేసినా ఫలితం దక్కలేదు. పూర్తి స్థాయి ఆధిపత్యంతో ఆడిన ఇంగ్లండ్‌కు 30వ నిమిషంలో తొలిగోల్ లభించింది. కార్నర్ షాట్‌ను హెడ్డర్ ద్వారా హ్యారీ మాగురై గోల్‌పోస్టులోకి పంపి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తొలి అర్ధభాగం ముగిసేవరకు స్వీడన్ గోల్ కోసం ప్రయత్నించినా..ఇంగ్లండ్ ముందు పాచిక పారలేదు.
మరో హెడ్డర్ గోల్.. రెండో అర్ధభాగంలోనూ హ్యారీకేన్ సేన ఆటతీరుకు స్వీడన్ జట్టు పసికూనను తలపించింది. ఆట 59వ నిమిషంలో ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డర్ జెస్సీ లింగార్డ్ అందించిన క్రాస్‌ను హెడ్డర్‌ద్వారా గోల్ పోస్టులోకి పంపిన డెలె అల్లి జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. మరోవైపు స్వీడన్ గోల్ చేసేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడిన ఇంగ్లండ్ జట్టు అద్భుత విజయంతో సెమీస్ చేరగా..పరాజయంతో స్వీడన్ ఇంటిముఖం పట్టింది.ఆట ఆద్యంతం ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగతుండడంతో ఇంగ్లీష్ అభిమానులు ఉత్సాహంతో గంతులేశారు.. లండన్ వీధులలో అభిమానులు కార్ హారన్స్ మోగిస్తూ విజయోత్సవ సంబురాలు చేసుకోవడం విశేషం..

390

More News

VIRAL NEWS