సురేఖకు రెండు కాంస్యాలు


Sun,June 16, 2019 03:08 AM

- ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్
surekha
డెన్‌బాచ్(నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. శనివారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో తన అద్భుత ప్రదర్శనతో సురేఖ దేశానికి రెండు కాంస్య పతకాలు అందించింది. తొలుత కాంపౌండ్ మహిళల ఈవెంటు కాంస్య పతక పోరులో సురేఖ, ముస్కాన్ కిరార్, రాజ్ కౌర్ త్రయం 229-226 తేడాతో టర్కీ జట్టుపై విజయం సాధించింది. ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన భారత త్రయం.. టర్కీకి దీటైన పోటీనిచ్చింది. సాయంత్రం జరిగిన కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగం కాంస్య మ్యాచ్‌లో సురేఖ 10-9 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ యెసిమ్ బోస్టన్(టర్కీ)పై అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఇరువురు హోరాహోరీగా తలపడటంతో ఐదు రౌండ్లు ముగిసే సరికి స్కోరు 145-145తో సమమైంది. దీంతో విజేతను నిర్ణయించేందుకు జరిగిన షూటౌట్‌లో సురేఖ విజయం సాధించి కాంస్యాన్ని ముద్దాడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలువడం సంతోషంగా ఉందని గేమ్ అనంతరం సురేఖ పేర్కొంది. మరోవైపు ఆదివారం రికర్వ్ టీమ్ విభాగం ఫైనల్లో భారత పురుషుల జట్టు చైనాతో తలపడుతుంది. 2005లో రజతాన్ని చేజిక్కించుకున్న భారత్.. ఈసారి ఎలాగైనా స్వర్ణం కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

175

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles