మిథాలీ సెంచరీ


Sun,July 16, 2017 02:38 AM

-మహిళల వరల్డ్‌కప్ సెమీస్‌లో భారత్
-సెమీస్‌లో భారత్
-186 పరుగుల తేడాతో కివీస్ చిత్తు
-గైక్వాడ్ స్పిన్ మ్యాజిక్

mithali-raj
డెర్బీ: మెగా టోర్నీలో ముందంజ వేయాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాదీ మిథాలీరాజ్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా 186 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 266 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ 25.3 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరీ గైక్వాడ్ (5/15) ధాటికి కివీస్ విలవిలలాడిపోయింది. దీప్తిశర్మ (2/26) రెండు వికెట్లతో రాణించింది. తొలుత కెప్టెన్ మిథాలీరాజ్ (123 బంతుల్లో 109, 11 ఫోర్లు) అద్భుత సెంచరీకి తోడు హర్మన్‌ప్రీత్‌కౌర్ (90 బంతుల్లో 60, 7 ఫోర్లు), వేదా కృష్ణమూర్తి (45 బంతుల్లో 70, 7ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 265/7 స్కోరు చేసింది. కాస్ప్రెక్ (3/45), రోవ్ (2/30) ఆకట్టుకున్నారు. సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన మిథాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గురువారం జరిగే సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.

మిథాలీ సూపర్ సెంచరీ: కెప్టెన్ మిథాలీరాజ్ మరోసారి మెరిసింది. మెగా టోర్నీలో తన అద్భుత ఫామ్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తూ కివీస్‌తో కీలకమైన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ (109)తో కదంతొక్కింది. 21 పరుగులకే ఓపెనర్లు పూనమ్ రౌత్ (4), స్మృతి మందన (13) ఔటైన దశలో క్రీజులోకొచ్చిన మిథాలీ.. ఇన్నింగ్స్ ఆసాంతం బాధ్యతాయుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. వైస్‌కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేసింది. ఈ క్రమంలో మూడో వికెట్‌కు హర్మన్ జతగా 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక్కడే జట్టు గౌరవప్రదమైన స్కోరుకు బాటలు పడ్డాయి. ఇక ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న దశలో పరుగు తేడాతో హర్మన్‌ప్రీత్, దీప్తిశర్మ (0) వెంటవెంటనే నిష్క్రమించారు. వేదా కృష్ణమూర్తి (70) రంగప్రవేశంతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయంది. వచ్చిరావడంతోనే కివీస్ బౌలర్లపై వేద విరుచుకుడింది. దొరికిన బౌలర్‌ను దొరికినట్లు బాదడంతో స్కోరుబోర్డు ఉరకలెత్తింది. బౌండరీలతో చెలరేగిన వేద..మిథాలీతో జతగా ఐదో వికెట్‌కు 13 ఓవర్లలో 108 పరుగులు జోడించింది. ఇన్నింగ్స్ 48వ ఓవర్లో మిథాలీ సెంచరీ పూర్తిచేసుకుంది. అయితే ఆఖరి ఓవర్లో 8 పరుగులకు పరిమితమైన భారత్..మూడు వికెట్లు కోల్పోయింది.

గైక్వాడ్ గర్జన: ఆరు మ్యాచ్‌లు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమై ఆడిన మొదటి మ్యాచ్‌లోనే రాజేశ్వరీ గైక్వాడ్ తన సత్తా ఏంటో చాటింది. కివీస్‌తో కీలకమైన మ్యాచ్‌లో బరిలోకి దిగిన గైక్వాడ్..భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టింది. 266 పరుగుల లక్ష్యఛేదన కోసం బ్యాటింగ్‌కొచ్చిన కివీస్..గైక్వాడ్ గర్జనతో కుదేలైంది. ఇన్నింగ్స్ రెండోవర్లో కెప్టెన్ సుజీ బేట్స్ (1)ను ఔట్ చేసి శిఖాపాండే (1/14) న్యూజిలాండ్ పతనానికి నాందిపలికితే..మిగతా పనిని గైక్వాడ్ పూర్తి చేసింది. రాజేశ్వరీకి తోడు దీప్తిశర్మ జతకలువడంతో కివీస్..వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్..79 పరుగులకే పరిమితమైంది. జట్టులో సాథర్‌వైట్ (26) ది అత్యధిక స్కోరు కాగా మిగతావారిలో సింగిల్ డిజిట్ స్కోరుకే ఎక్కువగా పరిమితమయ్యారు.

338

More News

VIRAL NEWS