మిథాలీ మెరిసే.. భారత్ సెమీస్ చేరే


Fri,November 16, 2018 01:02 AM

ఐర్లాండ్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం.. అర్ధసెంచరీతో రాణించిన హైదరాబాదీ
కలల ట్రోఫీ కోసం భారత మహిళల జట్టు టీ20

ప్రపంచకప్‌లో మరో అడుగు ముందుకేసింది. వరుసగా మూడో విజయంతో సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. హైదరాబాద్ స్టార్ మిథాలీ రాజ్ అర్ధసెంచరీతో మెరిసిన వేళ.. ప్రత్యర్థుల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినా.. నాణ్యమైన బౌలింగ్‌తో విజేతగా నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి
6 పాయింట్లతో గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉన్న టీమ్‌ఇండియా.. టాప్ కోసం ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఐర్లాండ్ దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.


ప్రొవిడెన్స్: టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టుకు ఎదురన్నదే లేకుండా పోయింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ గురువారం జరిగిన గ్రూప్-బి మూడో లీగ్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 52 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. ఫలితంగా సెమీస్ ఫైనల్‌కు అర్హత సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ (56 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మందన (29 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చిన మిథాలీ.. స్మృతి మందనతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రాత్రి కురిసిన వర్షం వల్ల పిచ్ మందకొడిగా తయారుకావడంతో బంతి బ్యాట్‌పైకి రాలేదు. దీనికితోడు ఐర్లాండ్ స్లో బౌలర్ల కారణంగా టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌లో అనుకున్నంత జోరు కనిపించలేదు. అవుట్ ఫీల్డ్ కారణంగా బంతి రోప్ దాటడం కష్టంగా మారడంతో.. ఐదో ఓవర్‌లో మిథాలీ తొలి సిక్స్ బాదింది. ఆరో ఓవర్‌లో మరో మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టి స్కోరును 42/0కు చేర్చింది. నిలకడగా సాగుతున్న ఈ జంటను 10వ ఓవర్‌లో మందనను ఔట్ చేయడం ద్వారా గార్త్ (2/22) విడగొట్టింది. దీంతో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రోడ్రిగ్స్ (11 బంతుల్లో 18; 3 ఫోర్లు)ను మూడో స్థానంలో ఆడించాలన్న వ్యూహం బెడిసికొట్టింది. భారీ హిట్టింగ్ చేయాలన్న మిథాలీ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేయలేకపోవడంతో రోడ్రిగ్స్‌పై ఒత్తిడి నెలకొంది. ఉన్నంతసేపు వేగంగా ఆడినా.. 15వ ఓవర్‌లోనే వెనుదిరిగింది. మిథాలీ, రోడ్రిగ్స్ మధ్య రెండో వికెట్‌కు 40 పరుగులు జతయ్యాయి. తొలి బంతినే సిక్స్‌గా మలిచిన కౌర్ (7).. ఆరు బంతుల తేడాలో వికెట్ సమర్పించుకోగా, 18వ ఓవర్‌లో వేదా కృష్ణమూర్తి (9) ఔటైంది. ఓవరాల్‌గా 18 బంతుల్లో మూడు వికెట్లు పడటంతో భారత్ ఇన్నింగ్స్ కష్టాల్లో పడింది. కానీ రెండో ఎండ్‌లో బ్యాట్ ఝుళిపించాల్సిన మిథాలీ కేవలం సింగిల్స్‌కే పరిమితమైంది. ఈ క్రమంలో 54 బంతుల్లో కెరీర్‌లో 17వ అర్ధసెంచరీ పూర్తి చేసింది. చివరకు 19వ ఓవర్‌లో గార్త్ వేసిన స్లో బంతిని ఆడే క్రమంలో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆఖరి ఓవర్‌లో హేమలత (4) పెవిలియన్‌కు చేరినా.. దీప్తి శర్మ (11 నాటౌట్) ఓ మాదిరిగా ఆడింది. చివరి 10 ఓవర్లలో 78 పరుగులే రావడంతో టీమ్‌ఇండియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. మిథాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
MITHALI

పెవిలియన్‌కు క్యూ..


146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 93 పరుగులకే పరిమితమైంది. జోయ్‌సీ (38 బంతుల్లో 33; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. పేసర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడితే.. స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. వికెట్‌కు దూరంగా ఊరించే బంతులు వేస్తూ బ్యాట్స్‌వుమెన్స్‌ను బోల్తా కొట్టించారు. దీనికితోడు వికెట్ల వెనుక తానియా భాటియా అద్భుతమైన పనితనాన్ని చూపెట్టింది. ఆరంభ ఓవర్లలో ఒకటి, రెండు ఫోర్లు బాదినా.. ఆరో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ లెవిస్ (9) ఔటైంది. దీంతో పవర్‌ప్లేలో ఆ జట్టు 30/1 స్కోరే చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన జోయ్‌సీ కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చినా.. రెండో ఎండ్‌లో షిల్లింగ్టన్ (23) నిరాశపర్చింది. పూనమ్ యాదవ్ టర్నింగ్ బంతిని అంచనా వేయలేక 9వ ఓవర్‌లో స్టంపౌటైంది. డిలానీ (9)తో కలిసి జోయ్‌సీ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నా.. భారత బౌలర్ల ధాటికి సింగిల్స్ కూడా రాలేదు. తొలి 10 ఓవర్లలో 43 పరుగులే రావడంతో ఐర్లాండ్ ఏ దశలో లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. 11వ ఓవర్‌లో జోయ్‌సీ రెండు ఫోర్లు బాదినా.. తర్వాతి ఓవర్లలో మళ్లీ స్కోరు వేగం మందగించింది. ఓవర్‌కు 3, 4, 6 పరుగులే వచ్చాయి. 15వ ఓవర్ నుంచి గేర్ మార్చిన బౌలర్లు వరుసపెట్టి వికెట్లు పడగొట్టారు. స్వల్ప విరామాల్లో డిలానీ, కవాంగ్ (2), జోయ్‌సీని ఔట్ చేస్తే.. 19 ఓవర్‌లో రాధా యాదవ్ (3/25) మూడు బంతుల్లో గార్త్ (3), రిచర్డ్‌సన్ (4), మార్టిజ్ (0)ను ఔట్ చేసి పరాజయాన్ని మిగిల్చింది.

స్కోరు బోర్డు


భారత్: మిథాలీ (సి) వాల్డ్రోన్ (బి) గార్త్ 51, మందన (బి) గార్త్ 33, రోడ్రిగ్స్ (స్టంప్) వాల్డ్రోన్ (బి) డిలానీ 18, కౌర్ (సి) కవాంగ్ (బి) రిచర్డ్‌సన్ 7, వేద (బి) ఒ రియాల్లీ 9, హేమలత రనౌట్ 4, దీప్తి శర్మ నాటౌట్ 11, రాధా యాదవ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 145/6.
వికెట్లపతనం: 1-67, 2-107, 3-116, 4-127, 5-133, 6-143.
బౌలింగ్: రిచర్డ్‌సన్ 4-0-27-1, ఒ రియాల్లీ 4-0-32-1, గార్త్ 4-0-22-2, మార్టిజ్ 2-0-23-0, రాక్ 1-0-8-0, జాయ్‌సీ 2-0-11-0, డిలానీ 3-0-21-1.
ఐర్లాండ్: షిల్లింగ్టన్ (స్టంప్) భాటియా (బి) పూనమ్ 23, లెవిస్ (బి) శర్మ 9, జోయ్‌సీ (సి) పూనమ్ (బి) కౌర్ 33, డిలానీ (స్టంప్) భాటియా (బి) యాదవ్ 9, కవాంగ్ ఎల్బీ (బి) శర్మ 2, గార్త్ (బి) యాదవ్ 3, రిచర్డ్‌సన్ రనౌట్ 4, వాల్డ్రోన్ నాటౌట్ 2, మార్టిజ్ (స్టంప్) భాటియా (బి) యాదవ్ 0, రాక్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు:7, మొత్తం: 20 ఓవర్లలో 93/8.
వికెట్లపతనం: 1-27, 2-42, 3-70, 4-82, 5-84, 6-90, 7-91, 8-91.
బౌలింగ్: జోషీ 3-1-12-0, రాధా యాదవ్ 4-0-25-3, దీప్తి శర్మ 3-0-15-2, పూనమ్ యాదవ్ 4-0-14-1, కౌర్ 4-0-10-1, హేమలత 1-0-10-0, రోడ్రిగ్స్ 1-0-6-0.

547

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles