తొలిరోజు పంచ్ అదుర్స్


Sat,November 17, 2018 12:19 AM

-సరితాదేవి, యువ మనీషా శుభారంభం
-అలవోక విజయాలతో ప్రి క్వార్టర్స్ చేరిన భారత బాక్సర్లు
-ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్

Manisha-Moun
న్యూఢిల్లీ: తొలిసారిగా భారత్ ఆతిథ్యమిస్తున్న ఏఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన తొలి బౌట్‌లో భారత యువ బాక్సర్, 20 ఏండ్ల మనీషా మౌనా(55 కేజీలు) పంచ్‌లతో విరుచుకుపడి అమెరికా వెటరన్ క్రిస్టినా క్రుజ్‌ను చిత్తు చేసి ప్రి క్వార్టర్స్ చేరింది. 60 కేజీల విభాగంలో మాజీ ప్రపంచ చాంపియన్ ఎల్ సరితాదేవి.. స్విట్జర్లాండ్ బాక్సర్ డయానా సాండ్రా బ్రుగ్గర్‌ను చిత్తు చేసి రెండోరౌండ్ చేరింది. బరిలోకి దిగిన రెండు బౌట్లలోనూ విజయాలు సాధించడంతో భారత బృందంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఆదివారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో మనీషా ..కజకిస్థాన్‌కు చెందిన దినా జోలమాన్‌తో తలపడనుండగా.. ఐర్లాండ్ బాక్సర్ కెల్లీ హేరింగ్టన్‌తో సరితా దేవి అమీతుమీ తేల్చుకోనుంది. హేరింగ్టన్ 2016 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 64 కేజీల విభౠగంలో రజత పతక విజేత కాగా.. తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 4 కేజీల బరువు తగ్గి 60 కేజీల విభాగానికి మారడం విశేషం. కాగా, జోలమాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగుతుండగా.. ఈ ఏడాది పోలండ్‌లో జరిగిన సిలెసియన్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మనీషా ఆమెను ఓడించడం గమనార్హం. దీంతో ప్రిక్వార్టర్స్‌లో మనీషా మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

ఎదురులేని మనీషా

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అరంగేట్రం చేసిన హర్యానా బాక్సర్ మనీషా ఎలాంటి నదురుబెదరు లేకుండా 2012 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం పతకం సాధించిన క్రుజ్‌తో తలపడింది. ఈ ఏడాది జరిగిన ఇండియా ఓపెన్‌లో స్వర్ణం, పోలండ్ టోర్నీలో రజతం సాధించిన మనీషా మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. బౌట్ అనంతరం 5గురు జడ్జీలు (29-28,30-27,30-26,29-28)స్కోరుతో ఏకగ్రీవంగా మనీషా గెలిచినట్లు ప్రకటించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తలపడిన తొలి బౌట్‌లో విజయం సాధించడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. నేను నా అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తాను. వచ్చే రౌండ్లలోనూ విజయం సాధిస్తా. తర్వాతి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌తో తలపడతాను. తదుపరి రౌండ్‌లోనూ ఆమెను ఓడిస్తాను అని మనీషా అన్నది.
Laishram-Sarita-Devi1

423

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles