సంచలనాల మోత


Tue,July 9, 2019 04:31 AM

-టాప్‌సీడ్ బార్టీ, మూడో సీడ్ ప్లిస్కోవా ఓటమి
-యువ సంచలనం గాఫ్ నిష్క్రమణ
-క్వార్టర్స్‌కు సెరెనా, హలెప్
-ముందడుగేసిన జొకో, ఫెదరర్, నాదల్

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో సంచనాల హోరు కొనసాగుతున్నది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ఆష్లే బార్టీ.. అన్‌సీడెడ్ క్రీడాకారిణి చేతిలో పరాజయం పాలవగా... మూడో సీడ్ ప్లిస్కోవా సైతం ఇంటిబాట పట్టింది. 15ఏండ్ల వయసులో అసాధారణ విజయాలతో దూసుకొచ్చిన కోరీ గాఫ్ కూడా నిష్క్రమించింది. సెరెనా విలియమ్స్, ఏడో సీడ్ హలెప్ అదరగొట్టే ఆటతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
Simona-Halep
లండన్: తొలి రౌండ్‌లో వీనస్ విలియమ్స్ నిష్క్రమణ.. రెండో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కెర్బర్ ఓటమి.. తాజాగా ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ ఆష్లే బార్టీకి షాక్.. ఇలా సంచనాలతో వింబుల్డన్ టోర్నీ మోతెక్కిపోతున్నది. సోమవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ ప్లేయర్ అలిసోన్ రిస్కే(అమెరికా) చేతిలో 6-3, 2-6, 3-6తో టాప్ సీడ్, ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా) పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోమ్యాచ్‌లో మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్‌రిపబ్లిక్) 6-4, 5-7, 11-13తో తన దేశానికే చెందిన కరోలినా ముచోవా(అన్‌సీడెడ్) చేతిలో పోరాడి ఓడింది. 3గంటల 17నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ముచోవా ఏకంగా 14ఏస్‌లు, 54 విన్నర్లను సాధించింది. మరోవైపు ఆరో సీడ్ పెట్రా క్విటోవా(చెక్‌రిపబ్లిక్)ను 4-6, 6-2, 6-4 తేడాతో 19వ సీడ్ జొహన్నా కొంటా(బ్రిటన్) ఓడించి, క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్(అమెరికా) 6-2, 6-2 తేడాతో సువారెజ్ నవార్రో(స్పెయిన్)ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌లో అడుగు పెట్టింది. అలాగే 15ఏండ్ల అమెరికా సంచలనం కోరీ గాఫ్ 3-6, 3-6తో ఏడో సీడ్ హలెప్ చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ సిటోలినా(ఉక్రెయిన్), ఎస్.జంగ్(చైనా), ైస్ట్రెకోవా(చెక్ రిపబ్లిక్) విజయాలు సాధించి క్వార్టర్స్‌కు అర్హత సాధించారు.

ఆడుతూ పాడుతూ..

పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో... మూడో సీడ్ రఫెల్ నాదల్(స్పెయిన్) 6-2, 6-2, 6-2తో అన్‌సీడెడ్ ప్లేయర్ జొవావో సౌసా(పోర్చుగల్)పై, ఫెదరర్(స్విట్జర్లాండ్) 6-1, 6-2, 6-2తో బెరేటిని(ఇటలీ)పై, నిషికోరి 6-3, 3-6, 6-3, 6-4తో కుషిష్కిన్(కజకిస్థాన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. మరోమ్యాచ్‌లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్(సెర్బియా) 6-3, 6-2, 6-3తో యుగో హంబెర్ట్(ఫ్రాన్స్)ను చిత్తు చేశాడు. అలాగే 21సీడ్ డి. గోఫిన్ (బెల్జియం) 7-6(11/9), 2-6, 6-3, 6-4తో వెర్‌డాస్కోను ఓడించగా... బౌటిస్టా అగట్(స్పెయిన్) 6-3, 7-5, 6-2తో బెనోయిట్ పెయిర్(ఫ్రాన్స్)ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో సామ్ క్వెర్రీ(అమెరికా) 6-4, 6-7(7/9), 7-6(7/3), 7-6(7/5)తో టెన్నీస్ సాండ్‌గ్రెన్‌ను చెమటోడ్చి ఓడించాడు.

260

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles