ఫెదరర్ కొత్త చరిత్ర


Mon,July 17, 2017 02:16 AM

-ఖాతాలో 8వ వింబుల్డన్ ఫైనల్లో సిలిచ్‌పై విజయం
-సంప్రాస్‌ను అధిగమించిన స్విస్ స్టార్
-ఫైనల్లో ఆశలకు కళ్లెం

fedex
ఘనతలు అతనికి కొత్త కాదు..రికార్డులు అతనికి దూరం కాదు..రివార్డులూ అతనికి లెక్క కాదు..ఈ ఆట పుట్టింది అతని రాకెట్ కోసమే.. ఈ పచ్చిక మొలిచింది అతని పాదస్పర్శ కోసమే..ధీరులు వచ్చారు.. కానీ యోధుడు మాత్రం ఒక్కడే వీరులూ వచ్చారు.. కానీ మేరునగధీరుడు మాత్రం ఇతడే వయసు పెరిగినా పోటీ తగ్గలేదు.. ఆట తగ్గినా ఆకాంక్ష తీరలేదు..కాలచక్రం తిరుగుతున్నా.. కొత్త ప్రత్యర్థులు దూసుకొస్తున్నా.. అతని విజయదుందుభి మాత్రం మోగుతూనే ఉంది. కన్నీండ్ల పర్యంతమైన ప్రత్యర్థిని జాలి లేకుండా కొడుతూ.. ఆల్‌ఇంగ్లండ్ గడ్డపై స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ మరోసారి సింహనాదం చేశాడు.ఇక గెలువలేడేమో అన్న చోటే.. 8వ టైటిల్‌తో వింబుల్‌డాన్‌గా గెలుపు సింహాసనంపై కూర్చొన్నాడు. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ గెలువడమంటే ఇదో పెద్ద మాయాజాలమే. ఇప్పటికీ దీన్ని నమ్మలేకపోతున్నా. ఇది అన్నింటికంటే చాలా ఎక్కువ. ఇలాంటి అత్యున్నత శిఖరాలను నేను అందుకున్నానంటే నమ్మశక్యంగా లేదు. గతేడాది తర్వాత ఇక్కడ మరో ఫైనల్ ఆడుతానని అనుకోలేదు. జొకోవిచ్ చేతిలో రెండుసార్లు ఓడిపోయా. అలాంటిది మళ్లీ ఇప్పుడు ఇలా ట్రోఫీని గెలుస్తానని అనుకోలేదు. కానీ నా కలలపై నేనెప్పుడూ నమ్మకంగా ఉండేవాడ్ని. అవే ఇక్కడి వరకు నడిపించాయి.
-ఫెదరర్


లండన్: గ్రాస్ కోర్టు ఆటకు అచ్చుగుద్దినట్లు సరిపోయే స్విట్జర్లాండ్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్.. ప్రపంచ టెన్నిస్‌లో మరో సంచలనం సృష్టించాడు. ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ ప్రపంచ ఐదో ర్యాంకర్ 6-3, 6-1, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ సందర్భంగా పీట్ సంప్రాస్ (7 టైటిల్స్) రికార్డును అధిగమించాడు. ఓవరాల్‌గా స్విస్ ప్లేయర్‌కు ఇది 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా, ఓపెన్ ఎరాలో వింబుల్డన్ గెలిచిన ఓల్డెస్ట్ మ్యాన్ (35 ఏండ్లు)గా అవతరించాడు. 1976లో 32 ఏండ్ల వయసులో ఆర్థర్ యాషే ఈ టైటిల్‌ను సాధించాడు. 1976 తర్వాత వింబుల్డన్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడు ఫెదరర్. ఇంతకుముందు జోర్న్ బోర్గ్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.

రాకెట్.. పవర్

కెరీర్‌లో 11వ వింబుల్డన్ ఫైనల్ ఆడుతున్న ఫెదరర్ (ఓవరాల్‌గా 29వ ఫైనల్) కోర్టులో చాలా ఉల్లాసంగా కనిపించాడు. భారీ ఏస్‌లు కొడతాడని పేరున్న సిలిచ్‌ను బేస్‌లైన్‌కు పరిమితం చేస్తూ తన రాకెట్ పవరెంటో చూపెట్టాడు. గంటా 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్విస్ స్టార్ ఎక్కడా తడబడలేదు. ఆరంభంలో ఇరువురు సర్వీస్‌లు నిలబెట్టుకున్నా.. నాలుగో గేమ్‌లో వచ్చిన బ్రేక్ పాయింట్‌ను సిలిచ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
fedex-wife
దీన్ని ఫెదరర్ నేర్పుగా ఒడిసిపట్టుకోవడంతో పాటు ఐదో గేమ్‌లో సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ముందంజ వేశాడు. తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకుని 4-2 ఆధిక్యంలో నిలిచాడు. ఏడో గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకున్న క్రొయేషియన్.. 9వ గేమ్‌లో 40-40 వద్ద డబుల్ ఫాల్ట్ చేయడంతో సెట్ 6-3లో ఫెదరర్ సొంతమైంది. రెండోసెట్‌లో మరింత వ్యూహాత్మకంగా ఆడిన ఫెదరర్.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-0 ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. దీంతో కాస్త కలత చెందిన సిలిచ్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. బాధతోనే నాలుగో గేమ్‌ను మొదలుపెట్టి చకచకా పాయింట్లతో సర్వీస్‌ను కాపాడుకున్నా.. తర్వాతి గేమ్‌లో ప్రత్యర్థిని నిలువరించలేకపోయాడు. దీని ఫలితంగా ఫెదరర్ 4-1తో ఆధిక్యాన్ని సాధించాడు. ఆరో గేమ్‌లో మరోసారి సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెదరర్.. సూపర్బ్ ఏస్‌తో ఏడో గేమ్‌ను సాధించి రెండోసెట్‌నూ చేజిక్కించుకున్నాడు.
silich

నొప్పితోనే బరిలోకి...

రెండో సెట్ ముగిసిన తర్వాత ఎడమ పాదం నొప్పికి మెడికల్ టైమ్ ఔట్‌లో సిలిచ్ చికిత్స తీసుకున్నాడు. పెద్ద బ్యాండేజ్ కట్టించుకుని పెయిన్ కిల్లర్స్ తీసుకొని మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టాడు. అయితే మునుపటిలాగా కోర్టులో చురుకుగా కదల్లేకపోవడంతో బలమైన ఏస్‌లు సంధించలేకపోయాడు. గత ఆరు రౌండ్లలో 130 ఏస్‌లు కొట్టిన సిలిచ్.. రెండో సెట్ ముగిసేసరికి రెండు ఏస్‌లకే పరిమితమయ్యాడు. ఇక నొప్పితోనే మూడోసెట్‌ను మొదలుపెట్టిన సిలిచ్.. ఆరు గేమ్‌ల వరకు బాగానే పోరాడాడు. సర్వీస్‌లను కాపాడుకుంటూ 3-3తో స్కోరును సమం చేశాడు. ఏడో గేమ్‌లో సర్వీస్‌ను చేజార్చుకోవడంతో గేమ్ 4-3తో ఫెదరర్ వైపు టర్న్ అయ్యింది. 9వ గేమ్‌లో మళ్లీ సర్వీస్‌ను నిలబెట్టుకున్నా అప్పటికే నష్టం జరిగిపోయింది. 8, 10వ గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకున్న స్విస్ ప్లేయర్.. అద్భుతమైన ఏస్‌తో సెట్‌ను, వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

టాప్-3లోకి ఫెదరర్!


roger
ఈ విజయంతో ఫెదరర్ సోమవారం విడుదల చేయనున్న తాజా ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌కు ఎగబాకనున్నాడు. స్విస్ స్టార్ దాదాపు 11 నెలల తర్వాత మళ్లీ ఈ ర్యాంక్‌కు చేరుతుండటం విశేషం. గతేడాది ఆగస్టులో మూడు నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోయిన ఫెదరర్.. ఆ తర్వాతి సీజన్‌కు పూర్తిగా దూరమవడంతో 17వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఈ జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలువడంతో మళ్లీ విజయాలబాట పట్టిన ఈ స్విస్ ప్లేయర్.. వింబుల్డన్ విజయంతో సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు.

639

More News

VIRAL NEWS