రోహిత్ రాణిస్తాడా..!


Sat,September 14, 2019 12:30 AM

Rohit-Sharma
లోకేశ్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధవన్, పార్థివ్ పటేల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి.. 2018 ఆరంభం నుంచి టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో ఓపెనింగ్ చేసిన బ్యాట్స్‌మెన్ జాబితా ఇది. వరుస వైఫల్యాల కారణంగా విజయ్, ధవన్ టెస్టు కెరీర్‌కు బ్రేక్ పడితే.. సుదీర్ఘ కాలం జట్టుకు సేవలందిస్తాడనుకున్న యువ సంచలనం పృథ్వీ షా ముందు గాయం, ఆ తర్వాత నిషేధం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. స్వతహాగా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అయిన విహారి తిరిగి తన స్థానానికి వెళ్లిపోయాడు. ఇప్పటికే జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో పార్థివ్ సోదిలోనే లేకుండా పోయాడు. ఇక ఎటొచ్చి మిగిలింది. మయాంక్, రాహుల్. ఇందులో మయాంక్ కాస్తో కూస్తో నిలకడగా ఆడుతుంటే.. రాహుల్ మాత్రం పూర్తిగా నిరాశ పరిచాడు. ఈ దశాబ్దంలోనే ఎవరికీ రానన్ని అవకాశాలు వచ్చినా.. వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమై జట్టులో చోటుకు ఎసరు తెచ్చుకున్నాడు. ఇలాంటి సమయంలో టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమ్‌ఇండియా నిఖార్సైన ఓపెనర్ కోసం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో పాటు యంగ్‌తరంగ్ శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసింది. మరి ఒకప్పుడు సెహ్వాగ్, గంభీర్ తరహాలో మంచి ఇన్నింగ్స్‌లతో రోహిత్ మైమరిపిస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి!

నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ఆస్ట్రేలియా తరఫున ఒకప్పుడు వన్డేల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ టెస్టుల విషయానికి వచ్చేసరికి ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఇంగ్లండ్ వన్డే ఓపెనర్ జానీ బెయిర్‌స్టో.. సంప్రదాయ క్రికెట్‌లో ఆరో స్థానంలో బరిలో దిగుతున్నాడు. వీళ్లేకాదు చాలా జట్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధాటిగా ఆడే బ్యాట్స్‌మన్‌ను సంప్రదాయ క్రికెట్‌లో చివర్లో బరిలో దించుతాయి. వేగంగా పరుగులు చేయడం కోసమే వారిని ఉపయోగించుకుటాయి. ఇదే బాటలో వన్డేల్లో (2007) అరంగేట్రం చేసిన ఆరేండ్ల తర్వాత 2013లో రోహిత్‌కు తొలి టెస్టు ఆడే చాన్స్ దక్కింది. ఆరంభంలో ఎక్కువ అవకాశాలు లభించకపోవడంతో రోహిత్ పెద్దగా వెలుగులోకి రాలేదు. మిడిలార్డర్‌లో వచ్చిన ఒకటీ రెండు అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం కూడా అతడికి ప్రతిబంధకంగా మారింది. అయితే వస్తూ పోతూ సాగిన టెస్టు కెరీర్‌లో రోహిత్ 27 టెస్టుల్లో (47 ఇన్నింగ్స్‌లు) 39.62 సగటుతో 1585 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు 10 అర్ధసెంచరీలు ఉన్నాయి.

సగటు తక్కువేం కాదు..

టెస్టుల్లో దాదాపు 40 సగటు అంటే మరీ అంత చెత్త ప్రదర్శనేం కాదు. కానీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న హిట్‌మ్యాన్ స్థాయికి అది తక్కువగా కనిపిస్తున్నది. వన్డేల్లో మూడు ద్విశతకాలు బాది ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రోహిత్ టెస్టు అత్యధిక స్కోరు 177 పరుగులే. గతేడాది ఆరంభంలో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 78 పరుగులే చేయడంతో రోహిత్ జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా.. వ్యక్తిగత కారణాల వల్ల చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో పాలుపంచుకోలేకపోయాడు. తాజాగా వెస్టిండీస్ టూర్‌కు వెళ్లినా.. ఆరోస్థానంలో విహారి కోసం బెంచ్‌కే పరిమితమయ్యాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం గురువారం జట్టు ఎంపికకు ముందే రాహుల్‌పై వేటు పడుతుందని అంతా ఊహించారు. ఎందుకంటే గత 12 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని రాహుల్.. 2018 తర్వాత 13 టెస్టుల్లో (23 ఇన్నింగ్స్‌లు) ఓపెనర్‌గా దిగి.. 22.31 సగటుతో 491 పరుగులే చేశాడు. దీంతో ఈ సారి రోహిత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇస్తున్నట్లు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.
GILL

గిల్‌కు నిరీక్షణే

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిలకడ కనబరుస్తున్న యంగ్‌తరంగ్ శుభ్‌మన్ గిల్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చినా.. తుది జట్టులో ఉండే అవకాశాలు మాత్రం పెద్దగా కనిపించడం లేవు. మయాంక్ అగర్వాల్‌తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేసే చాన్సే ఎక్కువ. దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న గిల్‌ను.. అంతర్జాతీయ అనుభవం కోసమే ఎంపిక చేసినట్లు కనిపిస్తున్నది. అవసరమైతే మిడిలార్డర్‌లోనూ ఆడగలగడం గిల్ అదనపు బలం. ప్రొటీస్ టూర్‌కు టీమ్‌ఇండియా ఎంపిక సమయంలోనూ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇదే విషయం వెల్లడించాడు. గిల్ అదనపు ఓపెనర్‌గానే కాకుండా.. మిడిలార్డర్‌లో స్టాండ్‌బైగా కూడా ఉపయోగపడుతాడుఅని ఎమ్మెస్కే పేర్కొన్నాడు. ఈ లెక్కన ఈ సిరీస్‌లో కాకున్నా రానున్న సిరీస్‌ల్లోనైనా శుభ్‌మన్‌కు శుభం జరిగే అవకాశాలున్నాయి.

కొత్త అవతారంలో మరిపిస్తాడా..

అరంగేట్ర వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో రోహిత్ బ్యాటింగ్‌కే దిగలేదు. తొలి టీ20 మ్యాచ్‌లోనైతే చిత్రంగా పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌కు బ్యాటింగ్ చాన్స్ దక్కినా.. రోహిత్‌కు మాత్రం క్రీజులో అడుగుపెట్టే అవకాశం రాలే దు. కెరీర్ ఆరంభంలో ఆరు, ఏడో స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఈ ముంబైకర్.. ఓపెనర్‌గా మారిన తర్వాత తనలోని అసలుసిసలు ఆట బయటపెట్టాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడటమే తెలిసిన రోహిత్ అక్కడి నుంచి వరుస సెంచరీలతో విజృంభించాడు. అదే కోవలో టెస్టుల్లో కూడా మిడిలార్డర్ నుంచి మొదలెట్టిన హిట్‌మ్యాన్ ఓపెనర్‌గా నిలదొక్కుకుంటాడని మాజీలు బలంగా నమ్ముతున్నారు. వన్డే ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 5 శతకాలు బాదిన రోహిత్‌ను టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా పంపాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఎప్పటి నుంచో అంటున్నాడు. తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు గిల్‌క్రిస్ట్ కూడా దాదాకు వంతపాడాడు. అందుకు తగ్గట్లే ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న 32 ఏండ్ల రోహిత్ ఇప్పటి వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మూడుసార్లు మాత్రమే ఇన్నింగ్స్ ఆరంభించాడు. అది కూడా 2009-12 మధ్య. మరి ఇప్పుడు సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మైమరిపించి స్థానం సుస్థిరం చేసుకుంటాడా అంటే.. అత్యధికుల నుంచి ఔననే సమాధానం వస్తున్నది. ఒకవేళ ఓపెనర్‌గాను రోహిత్ ఆకట్టుకోలేకపోతే.. నవంబర్ 15తో నిషేధం పూర్తి చేసుకోనున్న పృథ్వీ షా నుంచి ముప్పు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి సఫారీలతో మూడు రోజుల టూర్ మ్యాచ్‌కు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రోహిత్ అక్కడ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

1496

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles