చరిత్రకు చేరువలో..


Sat,July 13, 2019 03:10 AM

Kane-Williamson

- ప్రపంచకప్‌పై కన్నేసిన ఇంగ్లండ్, న్యూజిలాండ్
- ఎవరు గెలిచినా తొలిసారే..


ఇంగ్లండ్, న్యూజిలాండ్.. 44 ఏండ్ల క్రితం ప్రపంచకప్ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ఆడుతూ వస్తున్నాయి. ఐదురోజుల ఫార్మాట్‌పై ఎక్కువ దృష్టి పెట్టి పరిమిత ఓవర్ల ఆటను పెద్దగా పట్టించుకోని జట్టు ఒకటైతే.. బరిలో దిగిన ప్రతీసారి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తూ తమదైన ముద్రవేసిన జట్టు మరొకటి. మూడు సార్లు ఫైనల్ చేరినా.. తుది మెట్టుపై బోల్తా కొట్టిన జట్టు ఒకటైతే.. గత ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడిన జట్టు మరొకటి. బాదుడుతో పాటు నిత్యవివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే ఇంగ్లిష్ జట్టుకు.. జెంటిల్‌మెన్ ఆటకు నిలువెత్తు రూపంలాకనిపించే బ్లాక్‌క్యాప్స్ వ్యవహార శైలికి అసలు పొంతనే ఉండదు. ఒకరిది దూకుడు, దుందుడుకు స్వభావమైతే.. మరొకరిది నిలకడ, నియంత్రణతో కూడిన ఆటతీరు. ఇంతవరకు ప్రపంచకప్‌ను ముద్దాడని ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా చరిత్రే. ఇన్నేండ్లకు దక్కిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పుట్టింటికి కప్ పట్టుకు రావాలని ఇంగ్లండ్.. ఇంకెన్నాళ్లు సెమీస్ స్టార్‌గా మిగిలిపోవడం ఈసారైనా చాంపియన్‌గా నిలువాలని న్యూజిలాండ్ తాపత్రయ పడుతున్నాయి. మరి ఈ రెండు జట్లలో తొలిసారి కప్పుకొట్టి విశ్వవిజేతగా నిలిచేదేవరో తేలాలంటే ఆదివారం ఫైనల్ ఫైట్ వరకు వేచి చూడాల్సిందే.

నమస్తే తెలంగాణ క్రీడా విభాగం..

నాలుగేండ్లలో పూర్తిగా మారి..

మెగాటోర్నీ తొలినాళ్లలో చక్కటి ప్రదర్శనలతో ఇంగ్లండ్ మూడుసార్లు ఫైనల్ చేరినా.. ఒక్కసారి కూడా కప్పు కొట్టలేకపోయింది. ముఖ్యంగా సంప్రదాయ క్రికెట్‌పై దృష్టిపెట్టిన ఇంగ్లిష్ జట్టు ప్రపంచకప్‌లో ఎప్పుడూ ప్రధాన పోటీదారుగా కనిపించలేదు. ఆరంభంలో 60 ఓవర్ల మ్యాచ్‌లు.. ఎరుపు బంతులు.. ఉన్న జమానాలో కాస్త ప్రభావం చూపినా.. ఆ తర్వాత రోజురోజుకూ ప్రభ కోల్పోయింది. ఎంతగా అంటే 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. ఆ తర్వాతి టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలై లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. మొన్నమొన్నటి వరకూ ఇంగ్లండ్ ఆటగాళ్లు, అభిమానులు ప్రపంచకప్ కంటే యాషెస్ సిరీస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లనడంలో అతిశయోక్తి లేదు. కానీ నాలుగేండ్ల నుంచి ఆ జట్టు ఆలోచనా ధోరణి పూర్తిగా మారింది. 2015 ప్రపంచకప్ గ్రూపు దశలో ఇంగ్లండ్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచి నాలుగింట ఓడింది. తమకంటే చాలా బలహీనమైన స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్థాన్‌పై మాత్రమే నెగ్గిన ఇంగ్లిష్ జట్టు.. పెద్దగ ప్రమాదకరం కానీ బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలోనూ ఓడి నాకౌట్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక అక్కడి నుంచి ప్రక్షాళన ప్రారంభమైంది. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యమిస్తూనే.. పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం ప్రత్యేక జట్టును తీర్చిదిద్దింది. అప్పటికే జట్టు కెప్టెన్‌గా ఉన్న మోర్గాన్‌ను కొనసాగిస్తూ.. రూట్, బట్లర్, వోక్స్ వంటి ఆటగాళ్లను మరింత సానబెట్టింది. గత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరఫున ఓపెనర్‌గా బరిలో దిగిన మొయిన్ అలీ ఈ టోర్నీలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడంటే.. ఆ జట్టు ఎంతలా మార్పు చెందిందో అర్థం చేసుకోవచ్చు.

12 టోర్నీల్లో 8 సార్లు సెమీస్ చేరి..

మరోవైపు మొదటి ప్రపంచకప్‌లోనే సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్.. వెస్టిండీస్ చేతిలో ఓడి ఇంటి దారిపట్టింది. ఆ తర్వాత 1979లోనూ సెమీస్ చేరినా ఇంగ్లండ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఆ తర్వాత 1992, 99ల్లో పాకిస్థాన్ చేతిలో.. 2007, 11లో శ్రీలంక చేతిలో.. పరాజయం పాలైంది. గత ప్రపంచకప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై నెగ్గిన కివీస్ తొలిసారి ఫైనల్ చేరి నా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 5 సార్లు విశ్వవిజేతగా నిలిచినా.. సెమీస్ చేరడంలో మాత్రం న్యూజిలాండ్‌దే పైచేయి. మిగిలిన అన్ని జట్లతో పోలిస్తే బ్లాక్‌క్యాప్స్ అత్యధికంగా 8వ సారి సెమీస్ చేరి రికార్డు సృష్టించింది. గత ప్రపంచకప్‌లో కెప్టెన్ మెకల్లమ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు మిడిలార్డర్‌లో విలియమ్సన్, ఇలియట్ నిలకడ తోడవడంతో పైనల్ చేరిన కివీస్ ఈ సారి అందుకు భిన్నంగా నెమ్మదైన ఆట.. ఆల్‌రౌండర్ల అండ.. నాణ్యమైన పేస్ విజృంభణతో ఇక్కడి వరకు వచ్చింది. గత ఫైనల్లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇవ్వలేకపోయిన న్యూజిలాండ్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. ఈ నాలుగేండ్లలో ప్లేయర్లు మారి నా.. జట్టు ఆటతీరులో పెద్దగా మార్పు రాలేదు. సంయమనంతో కూడిన ఇన్నింగ్స్‌లు ఆడటంలో ప్రపంచ మేటి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న విలియమ్సన్ తనదైన శైలిలో జట్టును నడిపిస్తున్నాడు. కేన్ నాయకత్వంలో న్యూజిలాండ్ ఒకరిద్దరి ప్రదర్శనలపై కాకుండా సమిష్టిగా ముందుకు సాగుతున్నది. ఏనాడు ప్రత్యర్థిపై మాట తూలిన దాఖలాలు లేని కివీస్.. జెంటిల్‌మెన్ ఆటకు మరింత వన్నె తెస్తూ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడితే అంతకన్నా కావల్సిందేముంటుంది.

మెకల్లమ్ సునామీ..

2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆడిన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. అప్పటికి జట్టులో యువకుడైన రూట్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ మోర్గాన్ (17) విఫలమయ్యాడు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 25 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడి 77 పరుగులు చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో టార్గెట్ ఛేజ్ చేసి విజేతగా నిలిచింది.
guptil

నా అదృష్టం కొద్ది ధోనీ రనౌట్: గప్టిల్

లండన్: ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో కీలక సమయంలో మహేంద్రసింగ్ ధోనీని రనౌట్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అదృష్టం కొద్ది అది సాధ్యమైందని అన్నాడు. బంతి నేరుగా నా వద్దకు వస్తుందని అనుకోలేదు. ఒకసారి బాల్ అందుకున్నాక వీలైనంత త్వరగా దాన్ని తిరిగి పంపాలి అనుకున్నా. బంతిపై పట్టు సాధించాక ఎదురుగా ఉన్న వికెట్‌కేసి విసిరా.. అదృష్టం కొద్ది అది డైరెక్ట్‌గా వెళ్లి వికెట్లను తాకింది. ధోనీ క్రీజు వదిలి వెళ్లడంతో మా పని తేలికైంది అని గప్టిల్ పేర్కొన్నాడు. భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన సమయంలో రెండో పరుగు కోసం యత్నించిన ధోనీ రనౌట్ అయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా 18 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓడి ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

559

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles