వరుణుడు వరమిచ్చేనా!


Fri,October 13, 2017 12:45 AM

నేడు ఉప్పల్‌లో భారత్, ఆసీస్ మూడో టీ20
మ్యాచ్‌కు వర్షం ముప్పు!
సిరీస్ గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు

ఒకరిదేమో అచంచల ఆత్మవిశ్వాసం..మరొకరిదేమో పుంజుకునేందుకు ఆరాటం..భారత్ బలం లోతైన బ్యాటింగ్..ఆసీస్ ఆయుధం పదునైన బౌలింగ్..ఈ రెండింటి మధ్య పోరుకు ముస్తాబైన భాగ్యనగరం.పోరాటం ఇరుజట్లది.. ఉత్కంఠ అభిమానులది.. ఫలితం మాత్రం వరుణుడిది.మరి.. కరుణిస్తాడో.. వరమిస్తాడో..!గత వారం రోజులుగా ఏదో ఓ క్షణంలో హైదరాబాద్‌ను వర్షం పలుకరిస్తున్న నేపథ్యంలో.. నేడు ఉప్పల్‌లో భారత్, ఆసీస్ మధ్య మూడో టీ20కి సర్వం సిద్ధమైంది. సిరీస్
నిర్ణయించే మ్యాచ్ కావడం.. ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న పరిస్థితుల్లో.. ఉప్పల్‌లో అసలు హీరోలు ఎవరు? విరాట్ వీరులా? వార్నర్‌సేననా.. వాన దేవుడా?
team
హైదరాబాద్: రెండో టీ20లో ఊహించని పరాజయంతో షాక్‌కు గురైన భారత్.. ఇప్పుడు పుంజుకోవడంపై దృష్టిపెట్టింది. ఒక్కరంటే ఒక్కరు కూడా స్థాయికి తగ్గట్లుగా రాణించకపోవడంతో తప్పులను సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మూడో టీ20లో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇరుజట్లు చెరో విజయం సాధించడంతో మూడో టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న కంగారూలు కనీసం టీ20 సిరీస్‌నైనా దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా, పూర్తి ఆధిపత్యం చూపెట్టాలని టీమ్‌ఇండియా భావిస్తున్నది. ఐపీఎల్‌కు రెగ్యులర్ వేదికైన ఉప్పల్ స్టేడియంలో ఇది తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడంతో భారత్ గెలువాలని భాగ్యనగరవాసులు కోరుకుంటున్నారు. అయితే.. గత మ్యాచ్‌లో కంగారూల ఆట చూస్తే విరాట్‌సేన గెలుపు అంత సులభంకాకపోవచ్చు. ఏదేమైనా.. సిరీస్‌ను దక్కించుకోవాలంటే ఇరుజట్లు యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నా.. వర్షం అంతరాయం విలన్‌గా మారే అవకాశము ఉంది.

మిడిల్ సమస్యలు


గువాహటి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమైన భారత్ ఇప్పుడు లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనామక స్వింగ్ పేసర్‌కు భారత్ టాప్ ఆర్డర్ బోల్తా కొట్టడం జీర్ణించుకోలేని అంశమే అయినా.. ఈ మ్యాచ్‌లో అందరూ బెహ్రెన్‌డార్ఫ్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. టీ20లో తొలిసారి డకౌటైన కెప్టెన్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టగా, ఓపెనర్లు రోహిత్, ధవన్ చెలరేగాలని చూస్తున్నారు. మనీష్ పాండే వైఫల్యం ఆందోళన కలిగిస్తున్నది. ఇక ఎన్ని అవకాశాలు ఇచ్చినా కేదార్ జాదవ్ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ లోపాలను అధిగమించి హైదరాబాద్‌లో ఆసీస్‌కు చుక్కలు చూపెట్టాలని టీమ్‌ఇండియా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ వైఫల్యాలు కూడా బహిర్గతమయ్యాయి. కుల్దీప్ పదేపదే షార్ట్, ఫుల్‌లెంగ్త్ బంతులు వేయడం ఆసీస్‌కు బాగా కలిసొచ్చింది. చాహల్, కుల్దీప్‌లలో ఒకర్ని తప్పించి అక్షర్ పటేల్‌కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. భువనేశ్వర్ మెరుగ్గా ఆడినా.. బుమ్రా ధారాళంగా పరుగులు ఇవ్వడం లోటుగా కనిపిస్తున్నది. మంచు ప్రభావం కూడా చాలా కీలకంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో బంతి టర్న్ కాకపోవడం భారత్‌ను బాగా దెబ్బతీసింది. కాబట్టి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉప్పల్‌లో మార్పులు చేసుకుంటేనే విజయం దక్కుతుంది లేదంటే సిరీస్ చేజారడం ఖాయం.

బెహ్రెన్‌డార్ఫ్‌పై ఆశలు..


మరోవైపు రెండో టీ20లో గెలుపుతో ఆసీస్‌లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. గత మ్యాచ్‌లతో పోలిస్తే ఆసీస్ క్రికెటర్ల బాడీ లాంగ్వేజ్‌లో కూడా మార్పు వచ్చింది. స్మిత్ గైర్హాజరీతో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న వార్నర్ అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకున్న తీరు సూపర్బ్. ఆరంభంలో బెహ్రెన్‌డార్ఫ్ స్వింగ్ బౌలింగే ఇందుకు నిదర్శనం. ఇక హెన్రిక్స్‌ను మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దింపి చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో ఆఖరి టీ20లోనూ ఈ తరహా ప్రయోగాలు చేయాలని వార్నర్ భావిస్తున్నాడు. జంపా స్పిన్ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం, పేసర్లు అంచనాలకు అనుగుణంగా రాణించడం బాగా కలిసొచ్చింది. ఉప్పల్‌లోనూ ఇదే విధంగా రాణించాలని వీళ్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓపెనింగ్‌లో వార్నర్, ఫించ్ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. మ్యాక్స్‌వెల్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నా.. తనదైన రోజున మాత్రం బౌలర్లకు చుక్కలు చూపడం ఖాయం. ఓవరాల్‌గా బౌలింగ్‌తోనే భారత్‌ను మరోసారి దెబ్బతీయాలని ఆసీస్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఫ్యాన్లతో అరబెడుతున్నారు


ఉప్పల్, నమస్తే తెలంగాణ: రెండు రోజులుగా నగరంలో వర్షం కురుస్తుండటంతో ఉప్పల్ పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పేశారు. గురువారం ఉదయం కాస్త ఎండ కాసినా.. సాయంత్రానికి మళ్లీ వర్షం పడటంతో కవర్లను తొలగించలేదు. అయితే అవుట్ ఫీల్డ్‌లో అక్కడక్కడ నీరు నిలువడంతో మైదానం సిబ్బంది దాన్ని తొలిగించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే పెద్ద ఫ్యాన్లను ఉపయోగించి అవుట్ ఫీల్డ్‌ను ఆరబెడుతున్నారు. స్టేడియంలో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో మ్యాచ్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని హెచ్‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. గంట సమయంలో స్టేడియాన్ని పూర్తిగా సిద్ధం చేస్తామని క్యురేటర్ వైఎల్ చంద్రశేఖర్ తెలిపారు.

పిచ్, వాతావరణం


బ్యాటింగ్‌కు స్వర్గధామం. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు అధికంగా ఉంది. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ కీలకం.
table

గెలిస్తేనే ఐదు నిలుస్తుంది!


ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ ఐదో స్థానం పదిలంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడు ఒక రేటింగ్ పాయింట్‌తో నాలుగో ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు మరింత చేరువవుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే రెండు జట్ల ర్యాంక్‌లు తారుమారు అవుతాయి. ఒకవేళ కంగారూలు ఓడితే మాత్రం ఏడోర్యాంక్‌కు పడిపోతారు. అప్పుడు దక్షిణాఫ్రికా ఆరో ర్యాంక్‌కు ఎగబాకుతుంది. న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్.. టాప్-5లోనే
కొనసాగుతాయి. శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ వరుసగా 8, 9, 10 ర్యాంక్‌లో ఉంటాయి.

జట్లు (అంచనా):


భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, పాండే / రాహుల్, కేదార్, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్ / చాహల్ / అక్షర్ పటేల్, బుమ్రా.
ఆస్ట్రేలియా: వార్నర్ (కెప్టెన్), ఫించ్, హెన్రిక్స్, హెడ్, స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, పైనీ, కోల్టర్‌నీల్, టై, జంపా, బెహ్రెన్‌డార్ఫ్.

972

More News

VIRAL NEWS

Featured Articles