సాకర్‌లో యూరప్ హవా..


Mon,July 9, 2018 03:28 AM

-సెమీస్‌లో ఫ్రాన్స్, బెల్జియం, ఇంగ్లండ్, క్రొయేషియా
1982లో తొలిసారి.. 2006లో రెండోసారి.. రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మరోసారి యూరప్ ఖండ జట్లు మెరిసాయి. ఫిఫా చరిత్రలో సెమీఫైనల్ చేరిన నాలుగుజట్లూ యూరప్ ఖండానికి చెందినవే కావడం విశేషం. అపజయమే లేకుండా ఫ్రాన్స్, బెల్జియం ..అసమాన పోరాటంతో క్రొయేషియా.. అసాధారణ ఆటతీరుతో ఇంగ్లండ్ ఈసారి సెమీస్‌లో చోటు దక్కించుకున్నాయి.. ఈ ప్రపంచకప్‌లో యూరప్ ఆధిపత్యం సంపూర్ణంగా కనిపిస్తుండగా.. దక్షిణ అమెరికా జట్ల ఆధిపత్యానికి చెక్ పడింది..

ఈ ప్రపంచకప్‌లో ఫుట్‌బాల్ అభిమానులు సాంబా ైస్టెల్ ఫుట్‌బాల్..జర్మనీ తరహా మెరుపుదాడులు.. స్పెయిన్ టికీటకా పాసెస్.. ఎంజాయ్ చేయలేకపోయారు.. మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్ లాంటి స్టార్ల మెరుపులు ఫిఫాలో కానరావు.. కొత్తగా బెల్జియం స్టార్ లుకాకు.. ఫ్రాన్స్ టీనేజ్ సంచలనం ఎంబాప్పే, వెటరన్ రాఫెల్ వారనే, క్రొయేషియా వెటరన్ క్రామరిక్, ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీకేన్, హ్యారీ మాగురే.. వీరే సెమీస్‌తోపాటు ఫైనల్లో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు.. కాసింత కళతప్పినట్లుగా అనిపించినా..కొత్త తారల సరికొత్త ఆటతీరు అభిమానులను ఉర్రూతలూగించనుంది..

పోటీలో 32 జట్లు.. ఆసియా నుంచి 4 దేశాలు.. ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా నుంచి 5 దేశాలు, ఉత్తర, మధ్య అమెరికాలతోపాటు కరీబియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ దేశాల నుంచి 3, ఆఫ్రికా నుంచి 5 దేశాలు..మిగిలిన 14 దేశాలు యూరప్ నుంచి ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి. రష్యా ఆతిథ్యదేశం హోదాలో నేరుగా పోటీలకు అర్హత సాధించింది.. పోటీల ప్రారంభం నుంచి ఈ ప్రపంచకప్‌లో యూరప్ జట్ల హవా కొనసాగింది. నాకౌట్ చేరిన 16 జట్లలో 10 జట్లు యూరప్ ఖండానివే.. క్వార్టర్ ఫైనల్లో 8 జట్లకు గాను 5 జట్లు చేరగా.. సెమీస్ రేసులో నాలుగు యూరప్ జట్లు నిలవడం సంచలనం కలిగించింది.. ఈ గణాంకాలు చాలు..2018 ఫిఫా ప్రపంచకప్‌లో యూరప్ హవా ఎలా కొనసాగిందో.. ఉరుగ్వే, కొలంబియా, బ్రెజిల్ జట్ల పోరాటం యూరప్ వేగం ముందు తేలిపోయింది.. గ్రూప్‌బీ నుంచి స్పెయిన్, గ్రూప్ సీ నుంచి ఫ్రాన్స్, గ్రూప్ డీ నుంచి క్రొయేషియా, గ్రూప్ ఎఫ్ నుంచి స్వీడన్, గ్రూప్ జీ నుంచి బెల్జియం ఆయా గ్రూపులలో అగ్రస్థానంతో , ఆతిథ్యదేశం రష్యాతో సహా డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్ రెండోస్థానంతో రెండోరౌండ్ చేరడం ఫిఫా ప్రపంచకప్‌లో యూరప్ పూర్తిస్థాయి ఆధిపత్యానికి నిదర్శనం.. ఫిఫా ప్రపంచకప్ స్థాయికి సమానంగా యూరోకప్‌లో పెరిగిన పోటీ.. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో యూరప్ ఆటగాళ్లు సత్తా చాటుతుండగా..అటు క్లబ్ ఫుట్‌బాల్‌తోపాటు యూరప్ ఖండ దేశాల జాతీయ జట్ల సామర్థ్యం మిగిలిన దేశాలతో పోలిస్తే పెరిగింది. ఫుట్‌బాల్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న క్లబ్స్‌తోపాటు స్పాన్షర్‌షిప్‌తో ఆటను కొత్త పుంతలు తొక్కిస్తున్న బహుళజాతి సంస్థలు ..వెరసి యూరప్ ఆటలో వేగం పెరిగింది..అందుకే ఫిఫా ప్రపంచకప్ 2018లో యూరప్ జట్ల హవా కొనసాగుతున్నది..

దక్షిణ అమెరికా దేశాలకు చెక్: సాకర్ అంటే బ్రెజిల్..లేదంటే అర్జెంటీనా..గల్లీలో చిన్నప్లేస్ దొరికినా..పిల్లలనుంచి పెద్దవారి వరకు ఫుట్‌బాల్ ఆడేందుకే ఇష్టపడుతారు.. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండుజట్లకు వీరాభిమానులు ఉంటారు.. కానీ..రష్యాలో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మాత్రం వారికి షాక్ తగిలింది.. అర్జెంటీనా జట్టు నాకౌట్‌లో వెనుదిరగగా.. కొలంబియా, బ్రెజిల్, ఉరుగ్వే జట్లు క్వార్టర్‌ఫైనల్లో పరాజయం పాలయ్యాయి.. బ్రెజిల్ ఇప్పటికి 5, ఉరుగ్వే, అర్జెంటీనా తలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్లుగా సాకర్ ప్రపంచంలో సంచలన జట్లుగా నిలిచాయి. కాగా, కొలంబియా కూడా ఎన్నో ఆశలతో ప్రపంచకప్ బరిలోకి దిగడం.. రిక్తహస్తాలతో వెనుదిరగడం మామూలుగా మారింది..

గతంలో పీలే.. మారడోనా ..రొమారియో, రొనాల్డో, రొనాల్డినోలాగా సహజసిద్ధమైన ఆటగాళ్లు పుట్టుకురావడం లేదు..ప్రస్తుతం అర్జెంటీనా నుంచి మెస్సీ మాత్రమే స్టార్‌ఆటగాడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోగలిగాడు.. తాజాగా బ్రెజిల్ జట్టులో నెయ్‌మార్ ఉన్నా..అతను అంతగా అభిమానులను ఆకట్టుకోవడం లేదు.. అభిమానులను ఊపేయడంలోనూ .. అద్భుతమైన డ్రిబ్లింగ్..మైదానంలో మిసైల్‌ను మించిన వేగం.. గ్యాప్‌ల ద్వార బంతిని తరలించడంలో చురుకుదనం.. క్లిష్టమైన కోణం నుంచి కూడా గోల్ కొట్టగలగడం.. ఫ్రీకిక్‌లను గోల్‌గా మలిచే మాయాజాలం.. అంతా అమెరికా సొగసైన ఫుట్‌బాల్ ఆటతీరుకు చిరునామాగా మారినా.. అదంతా గతం.. ఇప్పటికే ఫుట్‌బాల్‌లో వీరి ఆధిపత్యం యూరప్ చేతికి వెళుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..

433

More News

VIRAL NEWS

Featured Articles