ఆసీస్‌దే ప్రాక్టీస్


Wed,September 13, 2017 01:32 AM

వామప్ పోరు ఏకపక్షమైంది. ఐదు వన్డేల సిరీస్‌కు మందు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక వామప్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ 103 పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసింది. అనుభవంలేని కుర్రాళ్లతో బరిలోకి దిగిన బోర్డు టీమ్.. ఆస్ట్రేలియాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
practise
చెన్నై: సొంతగడ్డపై భారత్‌ను నిలువరించాలన్న పట్టుదలతో ఉన్న ఆసీస్..ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత టాస్ గెలిచిన స్మిత్ కెప్టెన్సీలోని ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 347/7 భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(64), స్మిత్(55), టిమ్ హెడ్(65), స్టోయినిస్(76) అర్ధసెంచరీలతో అదురగొట్టారు. బోర్డు బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ఆది నుంచే పరుగులు కొల్లగొట్టారు. మంచి ఫామ్‌మీదున్న వార్నర్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లతో చెలరేగాడు. పరుగుల ఖాతా తెరువకుండానే కార్ట్‌రైట్(0) వికెట్ కోల్పోయిన ఆసీస్‌ను స్మిత్(55)తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేశారు.

అప్పటికే ప్రమాదకరంగా పరిణమించిన వార్నర్‌ను కుశాంగ్ పటేల్(2/58) ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన టిమ్ హెడ్..స్మిత్‌కు జతకలిశాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్..వార్నర్‌ను అనుసరిస్తూ వాషింగ్టన్ సుందర్(2/23) బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫించ్ హిట్టర్ మ్యాక్స్‌వెల్(14) తన ఫామ్‌లేమిని మరోమారు నిరూపించుకున్నాడు. సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు పోయి వికెట్ ఇచ్చుకున్నాడు. స్టోయినిస్ రాకతో ఆసీస్ ఇన్నింగ్స్ ఊపందుకుంది. హెడ్‌తో కలిసి స్టోయినిస్..బోర్డు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో విజృంభించిన స్టోయినిస్..హెడ్‌తో 88 పరుగులు జతకలిపాడు. అదే జోరు కొనసాగిస్తూ మాథ్యూ వేడ్(45)తో మరింత దూకుడు పెంచాడు. ఫలితంగా ఆసీస్ 347 పరుగుల స్కోరు అందుకుంది. లోకల్ ప్లేయర్ సుందర్ ఎనిమిది ఓవర్లలో 23 పరుగులకు 2 వికెట్లు తీసి సత్తాచాటాడు. అవేశ్‌ఖాన్(1/40), కేజ్రోలియా(1/37), కర్నెవార్(1/59) ఒక్కో వికెట్ తీశారు.

లక్ష్యఛేదనలో బోర్డు తడబాటు

ఆస్ట్రేలియా నిర్దేశించిన 348 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తడబడింది. జట్టు స్కోరు 10 పరుగులకే రాహుల్ త్రిపాఠి(7) వికెట్ కోల్పోయింది. గోస్వామి(43), మయాంక్ అగర్వాల్(42) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఆసీస్ నిఖార్సైన పేస్‌తో పరుగులు సాధిండచంలో తడబడ్డారు. దీంతో 15 ఓవర్లలో కేవలం 79 పరుగులు చేయగల్గిగారు. ఆస్టన్ ఆగర్(4/44) బౌలింగ్‌లో అగర్వాల్..వార్నర్ క్యాచ్ ద్వారా రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక్కణ్నుంచి బోర్డు ఇన్నింగ్స్ ఏ దశలోనూ కోలుకోలేదు. ఆగర్‌కు తోడు రిచర్డ్‌సన్(2/36) జతకలువడంతో బోర్డు ఎలెవన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. గోస్వామి, నితీశ్ రానా(19), చౌదరీ(4), కెప్టెన్ గురుకీరత్‌సింగ్(27) నిరాశపరిచారు. ఆఖర్లో అక్షయ్ కర్నెవార్(40), పటేల్(41 నాటౌట్) బ్యాట్లు ఝులిపించడంతో బోర్డు స్కోరు 200 మార్క్ అందుకుంది. ఫాల్క్‌నర్(1/35), జంపా(1/59), స్టోయినిస్(1/13) ఒక్కో వికెట్ తీశారు.

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 347/7
(స్టోయినిస్ 76, హెడ్ 65, వార్నర్ 64,
సుందర్ 2/23, పటేల్ 2/58)
బోర్డు ప్రెసిడెంట్స్: 48.2 ఓవర్లలో 244 ఆలౌట్
(గోస్వామి 43, అగర్వాల్ 42, పటేల్ 41 నాటౌట్, అగర్ 4/44, రిచర్డ్‌సన్ 2/36)

460

More News

VIRAL NEWS