పేసర్లను ఐపీఎల్‌లో ఆడించొద్దు!


Fri,November 9, 2018 12:54 AM

సీవోఏ ముందు విరాట్ కొత్త ప్రతిపాదన
ఫ్రాంచైజీల మద్దతు కష్టమే

bumrah
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ కొత్త ప్రతిపాదన చేశాడు. ప్రధాన పేస్ బౌలర్లందర్ని.. వచ్చే ఐపీఎల్‌లో ఆడించొద్దని ఇటీవల హైదరాబాద్‌లో పరిపాలన కమిటీ (సీవోఏ)తో జరిగిన సమావేశంలో ప్రతిపాదించాడు. ముఖ్యంగా భువనేశ్వర్, బుమ్రాను లీగ్ మొత్తానికి దూరంగా ఉంచాలని కోరాడు. వీళ్లకు ఫ్రాంచైజీలు ఇవ్వాల్సిన డబ్బులను బీసీసీఐ సమకూర్చాలని కూడా కమిటీకి విజ్ఞప్తి చేశాడు. షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే 30 నుంచి జూన్ 14 వరకు ఇంగ్లండ్‌లో వరల్డ్‌కప్ జరుగనుంది. ఐపీఎల్ కూడా వచ్చే ఏడాది మార్చి 29న మొదలై మే 19న ముగుస్తుంది. అంటే ఈ రెండు టోర్నీలకు మధ్య 15 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో బౌలర్లు గాయపడకుండా తాజాగా ఉండాలనే ఉద్దేశంతో విరాట్ ఈ ప్రతిపాదనను చేశాడు. ప్రతి రోజు ఐపీఎల్ మ్యాచ్ ఆడటం వల్ల బౌలర్లు బాగా అలసిపోతారు. ఒకవేళ గాయాలకు గురైతే మొత్తానికే సమస్యలు వస్తాయి. దీంతో ప్రపంచకప్ నాటికి వాళ్లు పూర్తి ఫిట్‌నెస్ సాధించడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీని ప్రభావం కచ్చితంగా వరల్డ్‌కప్‌పై పడుతుంది అని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే కోహ్లీ చేసిన ఈ ప్రతిపాదనకు పెద్దగా మద్దతు లభించలేదని సమావేశంలో పాల్గొన్న ఓ సీనియర్ అధికారి వెల్లడించాడు. పేసర్లకు విశ్రాంతి ఇవ్వడం కుదిరే పని కాదన్నాడు. ఇది కేవలం పేసర్లకు మాత్రమేనని, బ్యాట్స్‌మెన్‌పై ఎలాంటి చర్చ జరుగలేదన్నాడు. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, అజింక్యా రహానే, చీఫ్ కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Kohli

బుమ్రా ఫిట్‌గా ఉంటే ఆడిస్తా: రోహిత్


కోహ్లీ ఈ ప్రతిపాదన చేయగానే అక్కడే ఉన్న రోహిత్‌ను అభిప్రాయం చెప్పాల్సిందిగా సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ కోరారని సదరు అధికారి తెలిపాడు. దానికి ఈ ముంబైకర్ స్పందిస్తూ.. ఒకవేళ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్, ఫైనల్స్‌కు అర్హత సాధించి, బుమ్రా ఫిట్‌గా ఉంటే తప్పకుండా ఆడిస్తానని సమాధానమిచ్చాడన్నాడు. భువనేశ్వర్, బుమ్రాను ఐపీఎల్‌కు దూరం చేస్తే ప్రపంచకప్‌నకు ముందు వాళ్లకు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదనే వాదన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. పేసర్లందరికీ విశ్రాంతి ఇవ్వాలనేది వింత కోరిక అని మరో అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై టీమ్‌ఇండియా సహాయక సిబ్బంది, ఐపీఎల్ ట్రెయినర్లు, ఫిజియోలు చాలా కసరత్తులు చేస్తున్నారు. గత కొన్నేండ్లుగా ఇది కొనసాగుతూనే ఉన్నది. వచ్చే ఏడాది కూడా దీనినే అనుసరిస్తాం. అవసరమైతే ఫాస్ట్ బౌలర్లు అన్ని మ్యాచ్‌లు ఆడకుండా చూస్తారు. ఇక్కడ సమస్యల్లా భువీ, బుమ్రా, షమీ గురించే. ఉమేశ్, ఖలీల్ ఫ్రాంచైజీల మొదటి ఎంపిక కాదు. వాళ్లు 14 మ్యాచ్‌లు ఆడటం కూడా కష్టమే అని అధికారి వ్యాఖ్యానించాడు. వేలంలో ఏదైనా ఫ్రాంచైజీ ఖలీల్‌ను తీసుకోవాలని భావించినప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. బౌలర్‌ను తీసుకోని పక్కనబెట్టడానికి ఏ ఫ్రాంచైజీ ఒప్పుకోదని, వీలైనంత వరకు అతని సేవలను వినియోగించుకుంటూనే పనిభారాన్ని పర్యవేక్షిస్తామని అధికారి వెల్లడించాడు. మొత్తానికి కోహ్లీ చేసిన ఈ ప్రతిపాదనకు ఫ్రాంచైజీలు కూడా అంత సుముఖంగా లేనట్లు సమాచారం.

bhuvi

515

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles