ప్రియమైన చీకూకు..


Wed,November 6, 2019 12:36 AM

-గమ్యం కాదు.. ప్రయాణం ముఖ్యం..
-తనకు తాను రాసుకున్న లేఖలో విరాట్ కోహ్లీ

kohli
న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 31వ పుట్టిన రోజున తనకు తానే ఓ భావోద్వేగ లేఖ రాసుకున్నాడు. తన ప్రయాణం, జీవిత పాఠాలను 15 ఏండ్ల విరాట్‌కు వివరిస్తున్నానంటూ ఆ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. హాయ్ చీకూ (కోహ్లీ ముద్దుపేరు), ముందుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తు గురించి నీకు చాలా ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు. వాటిలో చాలా వరకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నందుకు క్షమాపణలు. ఏముందో తెలియకుంటేనే ప్రతి సర్‌ప్రైజ్ తీయగా.. ప్రతి సవాలు ఉత్సాహంగా.. ప్రతి నిరాశ ఓ గుణపాఠంగా ఉంటుంది. నీకు ఈ రోజు తెలియదు... ప్రయాణమే ముఖ్యం. గమ్యం కాదు. నీ ప్రయాణం సూపర్.
విరాట్ కోసం జీవితం ఎన్నో గొప్ప విషయాలను దాచిపెట్టిందని నేను నీకు చెప్పాలనుకుంటున్నా. అయితే, నీ ప్రయాణంలో వచ్చే ప్రతి అవకాశాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండాలి. వచ్చినప్పుడు ఒడిసిపట్టాలి. ప్రతి ఒక్కరిలాగే నువ్వూ విఫలమవుతావు. అయితే మళ్లీ పుంజుకోవడం మర్చిపోనని నీకు నీవు ప్రమాణం చేసుకో. ఒకవేళ మొదట విఫలమైనా మళ్లీమళ్లీ ప్రయత్నించు. నిరంతరం నిన్ను నువ్వు నమ్ముకో! మీ నాన్న నీకు బహుమతిగా ఇవ్వలేకపోయిన షూ గురించి ఈ రోజు ఆలోచిస్తుంటా వని నాకు తెలుసు. ఆయన ఈ రోజు ఇచ్చిన కౌగిలి, ఉదయం నీ ఎత్తుపై పేల్చిన జోక్‌తో పోలిస్తే అది ఏ పాటిది. దానికి సంతోషించు. కొన్నిసార్లు ఆయన (నాన్న) కఠినంగా ఉండొచ్చు. నీ నుంచి అత్యుత్తమం రాబట్టేందుకు ఆయన అలా ఉన్నారని తెలుసుకో. మా తల్లిదండ్రులు నన్ను కొన్నిసార్లు అర్థం చేసుకోవడం లేదని నువ్వు ఫీలవుతుంటావు. కానీ ఒకటి గుర్తుంచుకో కేవలం మన కుటుంబం మాత్రమే ఎలాంటి షరతులు లేకుండా మనల్ని ప్రేమిస్తుంది. వారికి ప్రేమను తిరిగివ్వు, గౌరవమివ్వు. ఎంత వీలైత అంత ఎక్కువ సమయం వారితో ఉండు. నిన్ను చాలా ప్రేమిస్తున్నానని నాన్నకు చెప్పు. ఈ రోజు.. రేపు ఇలా చెబుతూనే ఉండు. చివరగా.. నీ మనసును అనుసరించు. నీ కలలను వెంటాడు. దయా గుణంతో ఉండు. గొప్పగా స్వప్నిస్తే ఎంత ఉన్నతంగా ఎదగగలమో ప్రపంచానికి చూపించు. నీలాగ నీవుండుఅని కోహ్లీ తనకు తాను 15 ఏండ్ల వయసులో ఉన్నట్టుగా లేఖరాసుకున్నాడు. విరాట్ కోహ్లీకి 18 ఏండ్ల వయసులో అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే.
ASHWIN-virushka

అభినందనల వెల్లువ

ముప్పై వసంతాలు పూర్తిచేసుకొని మంగళవారం 31వ పడిలోకి అడుగుపెట్టిన టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభినందనలు వెల్లువెత్తాయి. సహచరులు, మాజీ ఆటగాళ్లు కోహ్లీకి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 20 వేల పరుగులు పూర్తి చేసిన అత్యుత్తమ ఆటగాడికి జన్మదిన శుభాకాంక్షలు అని ఐసీసీ పేర్కొంటే.. విరాట్ బ్యాటింగ్ చేస్తుంటే.. కంప్యూటర్‌లో ఎఫ్5 బటన్ నొక్కినట్లు ఉంటుందని వీరేంద్ర సెహ్వాగ్ చమత్కరించాడు.

జన్మదిన శుభాకాంక్షలు విరాట్. ఇదే దూకుడుతో పరుగుల వరద పారి స్తూ.. టీమ్‌ఇండియాను ముందుకు తీసుకెళ్లు.
- సచిన్ టెండూల్కర్

అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 20 వేల పరుగులు, టెస్టు కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు, వరుసబెట్టి ఐసీసీ అవార్డులన్నీ గెల్చుకున్న కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు.
- ఐసీసీ

రన్ మెషీన్ విరాట్ 31వ పడిలోకి అడుగుపెట్టేశాడు. ఈ పరుగుల వరద ఎక్కడ ప్రారంభమైందో దానిపై ఓ కన్నేద్దాం.
-బీసీసీఐ

విరాట్ నువ్వు బ్యాటింగ్ చేస్తుంటే కంప్యూటర్‌లో ఎఫ్5 బటన్ నొక్కినట్లే ఉంటుంది. ప్రతీ ఒక్కరు రీఫ్రెష్ అయిపోతారు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు.
- వీరేంద్ర సెహ్వాగ్

కోహ్లీ నీకు ఈ ఏడాది అద్భుతంగా గడవాలని కోరుకుంటున్నా. కొత్త ప్రమాణాలు నెలకొల్పే విషయంలో అస్సలు తగ్గకు.
- వీవీఎస్ లక్ష్మణ్

నీ దయార్ద హృదయం ఎల్లప్పుడు మంచి నాయకుడిగా నిలబెడుతుంది. ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనుకుంటున్నా. పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రియతమా.
-అనుష్క శర్మ

532

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles