సఫా చేశారు


Wed,October 23, 2019 03:26 AM

-రాంచీ టెస్టులో భారత్ ఘన విజయం
-3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్
-సఫారీలకు వైట్‌వాష్

11 నిమిషాలు.. 12 బంతులు.. సొంతగడ్డపై అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఖాతాలో మరో విజయం చేరింది. మూడో రోజు విజయం ముంగిట నిలిచిన టీమ్‌ఇండియా లాంఛనం పూర్తిచేసింది. నాలుగో రోజు రెండు ఓవర్లలోనే మిగిలిన రెండు వికెట్లు కూల్చిన కోహ్లీసేన.. దక్షిణాఫ్రికాపై తొలిసారి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో పాటు స్వదేశంలో వరుసగా 11వ సిరీస్‌ను ఒడిసిపట్టి ఆస్ట్రేలియాను తోసిరాజని అగ్రస్థానానికి చేరింది. పనిలోపనిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లోనూ 240 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. మూడు మ్యాచ్‌ల్లోనూ పైచేయి కనబర్చిన విరాట్ సేన.. సఫారీలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిందనడం అతిశయోక్తి కాదేమో..!
teamindia
రాంచీ: ప్రహసనం పూర్తైంది. ప్రతిష్ఠాత్మక ఫ్రీడమ్ సిరీస్ భారత్ వశమైంది. మూడో టెస్టు నాలుగోరోజు మిగిలిన రెండు వికెట్లను రెండు ఓవర్లలోనే పడగొట్టిన టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మూడు టెస్టుల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కోహ్లీసేన 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే.. దక్షిణాఫ్రికా తొలిసారి భారత్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా 11వ టెస్టు సిరీస్ విజయం కాగా.. కెప్టెన్‌గా కోహ్లీకి కూడా 11వ సిరీస్ విజయమే.
ఓవర్‌నైట్ స్కోరు 132/8తో మంగళవారం ఆట కొనసాగించిన సఫారీలు.. కేవలం ఒక పరుగు మాత్రమే జతచేసి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయారు. షాబాజ్ నదీమ్ వేసిన రెండో ఓవర్‌లో డిబ్రుయన్ (30), రబాడ (0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరడంతో భారత్ గెలుపు ఖాయమైంది. సిరీస్‌లో 2 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో మొత్తం 529 పరుగులు చేసిన నయా ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌అవార్డులు దక్కాయి. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ మరో 40 పాయింట్లు ఖాతాలో వేసుకొని 240 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది.

ఈ దాహం తీరనిది

20, 31, 254, 12.. కెప్టెన్ విరాట్ స్కోర్లివి. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కోహ్లీ.. పుణెలో లెక్కసరిచేశాడు. ఓ వైపు రోహిత్, మయాం క్ రెచ్చిపోతుంటే.. తానేమి తక్కువ తినలేదన్నట్లు డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అంతకుమించి సిరీస్‌లో తన కెప్టెన్సీతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. పోరాట పటిమ కనబర్చడంలో వెనక్కి తగ్గని ప్రొటీస్‌ను వరుసగా రెండు టెస్టుల్లోనూ ఫాలోఆన్ ఆడించడం కోహ్లీ దూకుడుకు నిదర్శనం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చీకూ కెప్టెన్సీపై ఎన్ని ప్రశ్నలు తలెత్తినా.. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత అత్యుత్తమ కెప్టెన్ అతడేననే విషయాన్ని మరోసారి స్పష్టం చేశాడు. వేదికను బట్టి జట్టును ఎంపిక చేయడంతో పాటు సరైన సమయాల్లో బౌలింగ్ మార్పులు చేసి భళా అనిపించుకున్నాడు. ముఖ్యంగా పుణేలో ట్రిపుల్ సెంచరీ చాన్స్ ఉన్నా.. జట్టు ప్రయోజనాల కోసం ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం కోహ్లీ కెప్టెన్సీ నైపుణ్యానికి అద్దం పడుతున్నది. మూడు టెస్టుల్లోనూ టాస్ నెగ్గడం కూడా కోహ్లీకి కలిసొచ్చిందనే చెప్పాలి.

టెస్టులకు శాశ్వత వేదికలు..!

సుదీర్ఘకాలం నుంచి సంప్రదాయ క్రికెట్‌కు పెద్దపీట వేస్తున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తరహాలో మన దేశంలోనూ టెస్టు మ్యాచ్‌లకు శాశ్వత వేదికలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌లో మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్, బ్రిస్బెన్, అడిలైడ్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అదే ఇంగ్లండ్‌లో అయితే.. లార్డ్స్, ఓవల్, ట్రెంట్‌బ్రిడ్జ్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ఎడ్జ్‌బాస్టన్, సౌథాంప్టన్, హెడింగ్లే వేదికలవుతాయి. ఇలా భారత్‌లో కూడా నిర్దిష్టమైన ఓ ఐదు వేదికలు ఉంటే బాగుంటుందని కోహ్లీ పేర్కొన్నాడు. మనకూ ఐదు టెస్టు వేదికలుంటే మంచింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు వన్నె తేవాలంటే శాశ్వత వేదికలు ఉండాల్సిందే అని కోహ్లీ అన్నాడు.
virat

ధోనీ గురించి దాదా మాట్లాడలేదు: కోహ్లీ

మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై.. అతణ్ని అడిగి తెలుసుకుంటానని బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. కోహ్లీ, దాదా ఈ అంశంపై చర్చించుకున్నారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా కోహ్లీ మాట్లాడుతూ.. ధోనీ కెరీర్ గురించి గంగూలీ ఇప్పటివరకు నాతో మాట్లాడలేదు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న దాదాకు అభినందనలు. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా రావడం గొప్పగా ఉంది. ఇప్పటివరకు ధోనీ గురించి కానీ జట్టు గురించి కానీ దాదా నాతో ఏమీ మాట్లాడలేదు అని విరాట్ స్పష్టం చేశాడు.

టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన తొలి సిరీస్‌లోనే రోహిత్ శర్మ అదరగొట్టాడు. ఆందోళనను పక్కకు నెట్టి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ ప్రశంసలకు అతడు అర్హుడు. మయాంక్, జింక్స్ (రహానే) ఆకట్టుకున్నారు. భారత పేసర్ల ఫిట్‌నెస్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఈ సిరీస్ తేటతెల్లం చేసింది. ఆటకన్నా ఆలోచన ధోరణి ఎంతో ముఖ్యం. దాంతోనే విజయాలు సాధించగలం. ఈ సిరీస్‌లో మా ప్రదర్శన బాగుంది. జట్టుగా రాణించడం సానుకూలాంశం. ప్రపంచంలో ఎక్కడైనా మేం విజయం సాధించగలమని నమ్ముతున్నాం.
- విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్.

కోచ్, కెప్టెన్ సహకారం వల్లే..

కెప్టెన్, కోచ్ అందించిన సహకారం ఉపయోగపడింది. ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్ (2013లో)గా దిగినప్పుడే.. ఈ స్థానంలో ఆడాలంటే ప్రత్యేకమైన క్రమశిక్షణ అవసరం అని తెలుసుకున్నా. సంప్రదాయ ఆటలోనూ ఓపెనర్‌గా శుభారంభం దక్కింది. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఫార్మాట్ ఏదైనా చెలరేగిపోవచ్చు. ఇలాగే భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నా.
-రోహిత్ శర్మ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్.
du-plesis
ప్రతి ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోర్లు నమోదు చేసిన టీమ్‌ఇండియా మా జట్టును మానసికంగా ఆందోళనలోకి నెట్టేసింది. దీంతో మేము వారికి సరైన పోటీ
ఇవ్వలేకపోయాం. ఈ పర్యటనలో భారత బ్యాట్స్‌మెన్ మామీద కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. వైజాగ్ టెస్టులో మా ప్రదర్శన ఫర్వాలేదనిపించినా.. సిరీస్ సాగేకొద్దీ దిగజారింది. ఇక భారత సీమర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మావాళ్లు 30, 40 నిమిషాలు ప్రభావం చూపగలిగిన చోట వారు రోజంతా ధాటిగా బౌలింగ్ చేశారు. ఇది మేము ఊహించనిది. ఓవరాల్‌గా ప్రస్తుతం జోరు మీదున్న టీమ్‌ఇండియాను ఓడించడం కష్టమైన పని.
- డుప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్.

ఫెరారీ ప్రయాణంలా..

ముంబై అయినా.. మెల్‌బోర్న్ అయినా పిచ్‌తో సంబంధం లేకుండా 20 వికెట్లు తీయడమే మా లక్ష్యం. భాడ్ మే గయా పిచ్ (వికెట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు) అనే తత్వంతోనే ముందుకు సాగుతున్నాం. ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయగలిగితే ఆ తర్వాత మ్యాచ్‌లు నెగ్గడం ఫెరారీ ప్రయాణమంత సాఫీగా సాగినట్లే. సిరీస్‌లో ప్రతిఒక్కరు ఆకట్టుకున్నారు. రహానే మిడిలార్డర్‌కు నిలకడ తెస్తే.. రోహిత్ తన క్లాస్‌తో ఓపెనింగ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు.
- రవిశాస్త్రి, భారత కోచ్.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 497/9 డిక్లేర్డ్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 162, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: డికాక్ (బి) ఉమేశ్ 5, ఎల్గర్ (రిటైర్డ్ హర్ట్) 16, హమ్జ (బి) షమీ 0, డుప్లెసిస్ (ఎల్బీ) షమీ 4, బవుమా (సి) సాహా (బి) షమీ 0, క్లాసెన్ (ఎల్బీ) ఉమేశ్ 5, లిండే (రనౌట్/నదీమ్) 27, పీట్ (బి) జడేజా 23, డిబ్రుయన్ (సి) సాహా (బి) నదీమ్ 30, రబాడ (సి) జడేజా (బి) అశ్విన్ 12, నోర్జే (నాటౌట్) 5, ఎంగ్డీ (సి అండ్ బి) నదీమ్ 0, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 48 ఓవర్లలో 133. వికెట్ల పతనం: 1-5, 2-10, 3-18, 4-22, 5-36, 6-67, 7-98, 8-121, 9-133, 10-133, బౌలింగ్: షమీ 10-6-10-3, ఉమేశ్ 9-1-35-2, జడేజా 13-5-36-1, నదీమ్ 6-1-18-2, అశ్విన్ 10-3-28-1.

దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి. గత పర్యటనలో ఓ టెస్టు డ్రాచేసుకొని మూడింట ఓడిన సఫారీలు.. ఈ సారి వైట్‌వాష్‌కు గురయ్యారు.

1 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ స్థానం. రెండు సిరీస్‌లు క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీసేన 240 పాయింట్లతో టాప్‌లో ఉంది.

దక్షిణాఫ్రికాపై భారత్‌కిదే అతిపెద్ద విజయం. ఇదే సిరీస్ రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల గెలుపు రెండో స్థానానికి చేరింది.

1935-36 తర్వాత దక్షిణాఫ్రికా వరుస టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో ఓడటం ఇదే తొలిసారి.

11 స్వదేశంలో భారత్‌కిది వరుసగా 11వ సిరీస్ విజయం. 2012-13లో ఇంగ్లండ్ చేతిలో ఓడాక సొంతగడ్డపై భారత్ సిరీస్ కోల్పోలేదు.

సారథిగా విరాట్ కోహ్లీ సిరీస్ విజయాల సంఖ్య.

4 టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాకు ఇది నాలుగో అతిపెద్ద ఓటమి. భారత్ చేతిలో ఇదే పెద్దది.

6 సొంతగడ్డపై ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కిది ఆరోసారి.

7 కోహ్లీ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాతో ఆడిన 10 టెస్టుల్లో భారత్ సాధించిన విజయాలు. కోహ్లీకి ముందు భారత్ సఫారీలపై 29 టెస్టులాడి ఏడింట మాత్రమే నెగ్గింది.

1043

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles