పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్న కోహ్లీ


Wed,June 13, 2018 01:38 AM

బీసీసీఐ వార్షిక అవార్డులు
Virat-Kohli
బెంగళూరు: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ ఏడాది అత్యుత్తమ క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ) అవార్డును అందుకున్నాడు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీసీసీఐ వార్షిక అవార్డులను అందజేసింది. 2016-17, 2017-18 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనకుగానూ విరాట్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. పాత, ప్రస్తుత క్రికెటర్లతో పాటు భారత్‌తో ఏకైక టెస్టు ఆడేందుకు వచ్చిన అఫ్ఘనిస్థాన్ జట్టు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. ప్రతిష్టాత్మక పటౌడీ స్మారక ఉపన్యాసాన్ని ఇచ్చాడు. ఒక విదేశీ క్రికెటర్ ఈ ఉపన్యాసాన్ని ఇవ్వడం ఇదే తొలిసారి. మాజీ కోచ్ అంశుమన్ గైక్వాడ్, సుధా సాహా.. కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. దేశవాళీ క్రికెటర్లు జలజ్ సక్సేనా, పర్వేజ్ రసూల్.. ఉత్తమ ఆల్‌రౌండర్ అవార్డులను స్వీకరించారు. విజయ్ హజారే వన్డే చాంపియన్‌షిప్‌లో మెరుపులు మెరిపించిన క్రునాల్ పాండ్యా.. భారత్-ఎ జట్టుతో ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. మెడ గాయంతో ఇబ్బందిపడుతున్న విరాట్.. శుక్రవారం ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ పరీక్షను ఎదుర్కొనున్నాడు.

Mithali-Raj

డేనైట్ టెస్టులు రావాలి: పీటర్సన్

ఓవైపు డేనైట్ టెస్టులకు తాము సిద్ధంగా లేమని బీసీసీఐ బల్లగుద్ది చెబుతున్నా.. పీటర్సన్ మాత్రం వీటికి మద్దతివ్వాల్సిందేనని పటౌడీ స్మారక ఉపన్యాసంలో చాలా బలంగా విన్నవించుకున్నాడు. ఆటగాళ్లందరూ టెస్టు క్రికెట్ ఆడేందుకు కట్టుబడి ఉండాలి. ఇదే సమయంలో వాళ్లకు డబ్బులు కూడా బాగానే ఇవ్వాలి. అలాంటప్పుడు వాటిని ఎలా చెల్లించాలి? దీనికి సులువైన పరిష్కారం ఒక్కటే. ఐదు రోజుల క్రికెట్‌ను మరింత జనరంజకంగా మార్చటం. వాణిజ్య హంగులు తీసుకొస్తూ డేనైట్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం. విపరీతంగా మార్కెటింగ్ చేస్తూ అభిమానుల్లో క్రేజ్ తీసుకురావాలి. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌తో మార్కెటింగ్ మరింత విస్తరిస్తుందనుకుంటా. మైదానాల్లో తక్కువ రేట్లకు సీట్లతో పాటు టీవీల్లో ప్రసారాల నాణ్యత పెంచండి. పొట్టి ఫార్మాట్ వైపు వెళ్లిపోయిన ప్రేక్షకులను తిరిగి రప్పించండి. బ్యాట్‌కు బంతికి మధ్య సమతూకాన్ని తీసుకురండి. ఎంటర్‌టైనమెంట్ విషయంలో అసలు సంతృప్తిపడొద్దు. టెస్టు క్రికెట్‌ను చూడముచ్చటగా తీర్చిదిద్దండి. అభిమానులు స్టేడియాలకు తరలి వచ్చేలా ఫైర్‌వర్క్స్, కలర్లతో నింపేయండి. సాయంత్రాలలో ఆటను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేయండి. అంపైర్లకు మైక్రో ఫోన్లు ఇవ్వండి. ఓ పరిమితి మేరకు స్లెడ్జింగ్‌ను అనుమతించండి. అభిమానులకు చేరువయ్యేలా చర్యలు తీసుకోండి. ఇలా చేస్తే అనతి కాలంలో ఐదు రోజుల ఫార్మాట్‌కు మరింత ఆదరణ పెరుగుతుంది అని కేపీ పేర్కొన్నాడు. సచిన్, షేన్ వార్న్, మాల్కమ్ మార్షల్, స్టీవ్ వా, రిచర్డ్ హ్యాడ్లీ, కపిల్ దేవ్, దివంగత హ్యాన్సీ క్రానేలాంటి ఆటగాళ్లు వన్డేలకు ఎంత ప్రాధాన్యమిచ్చారో.. టెస్టులో అంతకంటే ఎక్కువ రికార్డులు సృష్టించారని పీటర్సన్ వ్యాఖ్యానించాడు.

912

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles