కల నెరవేరేనా!


Thu,December 6, 2018 12:36 AM

-నేడు ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్
-అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకున్న టీమ్‌ఇండియా
-ఆరో స్థానం కోసం రోహిత్, విహారి పోటీ
-స్టార్లు లేకున్నా ఆసీస్‌కు స్వదేశీ అనుకూలత
-ఉదయం 5.30 నుంచి సోనీ సిక్స్‌లో
70 ఏండ్ల చరిత్ర.. 11సార్లు పర్యటన.. 44 మ్యాచ్‌లు.. 5 విజయాలు.. 2సార్లు మాత్రమే సిరీస్ డ్రా.. స్థూలంగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్ క్రికెట్ జట్టు చరిత్ర ఇది. దిగ్గజాలు బరిలోకి దిగినా.. హేమాహేమీలు సారథ్యం వహించినా.. కంగారూ దేశంలో టెస్ట్ సిరీస్ విజయం టీమ్‌ఇండియాకు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది. 86 ఏండ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. స్వదేశంలో ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని బెబ్బులిలా వేటాడే భారత్.. విదేశాల్లో మాత్రం అద్భుతాలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు చరిత్రను మార్చే సమయం ఆసన్నమైంది. నంబర్‌వన్ హోదా.. గతంలో ఎన్నడూ లేనంత పటిష్ఠమైన జట్టు.. దీనికితోడు స్టార్లు లేక బలహీనపడ్డ ఆసీస్ .. ఈ నేపథ్యంలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్ల మధ్య నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు గురువారం నుంచి తెరలేవనుంది. అడిలైడ్‌లో జరిగే తొలి టెస్ట్‌లో టీమ్‌ఇండియా.. కంగారూలను ఢీకొట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. పాత చరిత్రను పక్కనబెడుతూ.. సరికొత్త వ్యూహాలతో ఫేవరెట్ ట్యాగ్‌తో బరిలోకి దిగుతున్న విరాట్‌సేన.. కంగారూ గడ్డపై కల నెరవేర్చుకునే దిశగా అడుగులు వేయబోతున్నది.
virat-tim-paine
అడిలైడ్: ఈ ఏడాది టెస్ట్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేని భారత్.. మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. విదేశాల్లో రికార్డును మెరుగుపర్చుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఆసీస్ గడ్డపై తొలి వేట మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగే తొలి టెస్ట్‌లో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. దక్షిణాఫ్రికా (1-2), ఇంగ్లండ్ (1-4)లో సిరీస్‌లు చేజార్చుకున్న చేదు జ్ఞాపకాలు ఇంకా మదిలో మెదులుతున్నా.. కంగారూలను మాత్రం కసిదీరా కొట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ప్రపంచ స్థాయి మేటి బ్యాట్స్‌మెన్‌గా రూపాంతరం చెందిన విరాట్ కోహ్లీ.. సారథిగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన సమయం కూడా ఇదే కావడంతో క్రికెట్ ప్రపంచం ఈ సిరీస్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. గత చరిత్ర ఏమీ బాగాలేదన్న వాస్తవాలను దిగమింగుకుంటూనే ఈ సిరీస్‌లో అద్భుతాలు చేయాల్సిన బాధ్యత టీమ్‌ఇండియాది. మరి దీనిని ఎంత మేరకు నెరవేరుస్తుందో చూడాలి. మరోవైపు బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత దిగజారిన ప్రతిష్ఠకు తోడు స్టార్ బ్యాట్స్‌మెన్ వార్నర్, స్మిత్ లేకపోవడంతో ఆసీస్ బలహీనంగా మారింది. అయితే స్వదేశీ అనుకూలతతో ఆసీస్ గట్టిపోటీ ఇస్తుందనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఓవరాల్‌గా ఆసీస్ బౌలింగ్ బలగానికి భారత బ్యాటింగ్ బలానికి రసవత్తరంగా సాగే ఈ సిరీస్‌లో విజయం ఎవరిని వరిస్తుందో..!

ఐదుగురు బౌలర్ల వ్యూహమా..?

తొలి టెస్ట్‌కు 12 మందితో జట్టును ప్రకటించిన భారత్.. 20 వికెట్లు తీయాలన్న లక్ష్యంతో ఐదుగురు బౌలర్లను ఆడించాలని భావిస్తున్నది. కానీ ముగ్గురు ఫ్రంట్‌లైన్ పేసర్లు, ఒక్క స్పిన్నర్‌కే జట్టులో చోటు కల్పించింది. మరి ఐదో బౌలర్ ఎవరనేది తేలాల్సి ఉంది. ఆరో స్థానం కోసం రోహిత్ శర్మ, హైదరాబాదీ హనుమ విహారి మధ్య పోటీ నెలకొంది. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీతో ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్ లోటును పరిపూర్ణంగా భర్తీ చేయాలంటే రోహిత్ వైపు మొగ్గే అవకాశాలున్నాయి. దక్షిణాఫ్రికాపై చివరి టెస్ట్ ఆడిన ఈ ముంబైకర్.. ఐదో స్థానంలో దిగి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 78 పరుగులే చేయడం ప్రతికూలాంశం. ఇక ఇంగ్లిష్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న విహారి అర్ధసెంచరీ చేయడం కలిసొచ్చే అంశం. అలాగే పార్ట్‌టైమ్ బౌలర్‌గా అతని సేవలను ఉపయోగించుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తే లైన్ క్లియర్ అయినట్లే. ఈ రెండింటిని పక్కనబెడితే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనల్లో కోహ్లీసేనకు రెండు సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపించాయి.

విరాట్ చెలరేగినా.. అతనికి మద్దతు ఇచ్చేవారు లేకపోవడం మొదటిది. రెండోది ఓపెనింగ్ సమస్య. సఫారీ గడ్డపై కోహ్లీ 286 పరుగులు చేస్తే, తర్వాతి స్థానంలో హార్దిక్ (119), మురళీ విజయ్ (102), పుజార (100), రాహుల్ (30) ఉన్నారు. ఇంగ్లండ్‌లో ఓపెనర్ల వైఫల్యం ఏకంగా సిరీస్‌నే కోల్పోయేలా చేసింది. విజయ్ రెండు టెస్ట్‌ల్లో 26 పరుగులు చేస్తే, రాహుల్ ఐదు టెస్ట్‌ల్లో కలిపి 299 పరుగులు చేశాడు. మరి ఈ రెండు సమస్యలను కంగారూ గడ్డపై భారత్ అధిగమిస్తుందా? మిడిలార్డర్‌లో పుజార, రహానే నిలబడితేనే టీమ్‌ఇండియా విజయాన్ని ఆశించొచ్చు. కానీ ఈ ఇద్దరు ఫామ్‌లో లేకపోవడం ప్రతికూలాంశంగా మారింది. యువ సంచలనం పృథ్వీ షా గాయపడటంతో ఓపెనర్లుగా విజయ్-రాహుల్‌ను కొనసాగిస్తారా? లేక రోహిత్‌తో ప్రయోగం చేయిస్తారా? చూడాలి. బౌలింగ్‌లో ఇషాంత్, షమీ, బుమ్రా పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌ను తీసుకోవచ్చు.

hanuma-vihari

హారిస్ అరంగేట్రం

మరోవైపు ఆస్ట్రేలియా కూడా దీటుగానే ప్రణాళికలు రచిస్తున్నది. వార్నర్, స్మిత్ లేని లోటును కనిపించకుండా కొత్తవాళ్లను తీసుకోవాలని భావిస్తున్నది. అందులో భాగంగా 18 ఏండ్ల మార్కస్ హారిస్ అరంగేట్రం ఖాయమైంది. ఫించ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అతను దేశవాళీలో విక్టోరియా తరఫున పరుగుల వరద పారించాడు. ఖవాజ మూడోస్థానంలో ఆడనున్నాడు. అయితే బాల్ టాంపరింగ్ తర్వాత ఆసీస్ ఆడిన ఏ టెస్ట్‌లోనూ గెలువకపోవడం గమనించదగ్గ అంశం. కానీ స్వదేశంలో ఆసీస్‌ను తేలికగా తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇక్కడ పర్యటించిన జట్లలో ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే ఆసీస్‌పై ఆధిపత్యం చూపెట్టింది. మిగతా జట్లన్నీ విఫలమైనవే. అడిలైడ్‌లో భారీ స్కోరు గనుక చేస్తే బలమైన బౌలింగ్‌తో దానిని కాపాడుకోవడం ఆసీస్‌కు చాలా తేలిక. ఆ ఆరంభం దక్కకుండా చూడటమే విరాట్‌సేన ముందున్న లక్ష్యం. మిచెల్ మార్ష్ స్థానంలో దేశవాళీల్లో విశేషంగా రాణించిన హ్యాండ్స్‌కోంబ్‌ను తీసుకొని బ్యాటింగ్ లైనప్‌ను మరింత పటిష్ఠం చేసుకున్నారు. షాన్ మార్ష్, హెడ్, పైనీ మిడిలార్డర్ భారం మోయాల్సి ఉంది. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్‌ను నిలువరించాలంటే భారత బ్యాట్స్‌మెన్ శక్తికి మించి కష్టపడాలి. లియోన్ స్పిన్ మ్యాజిక్‌తో రెడీగా ఉన్నాడు.

జట్లు (అంచనా)

భారత్: కోహ్లీ (కెప్టెన్), రాహుల్, విజయ్, పుజార, రహానే, రోహిత్ / విహారి, రిషబ్, అశ్విన్, షమీ, ఇషాంత్, బుమ్రా.
ఆస్ట్రేలియా: పైనీ (కెప్టెన్), ఫించ్, హారిస్, ఖవాజ, షాన్ మార్ష్, హ్యాండ్స్‌కోంబ్, హెడ్, స్టార్క్, కమిన్స్, లియోన్, హాజిల్‌వుడ్.

పిచ్, వాతావరణం

పిచ్ పొడిగా కనిపిస్తున్నది. తొలి రోజు వాతావరణం వేడిగా ఉంటుందని అంచనా. తర్వాతి రోజుల్లో కొద్దిగా వెచ్చగా, చల్లగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పిన్ కీలక పాత్ర పోషించొచ్చని విశ్లేషిస్తున్నారు. గతంలో ఇక్కడ జరిగిన మూడు డేనైట్ టెస్ట్‌ల్లో ఫలితం వచ్చింది. 2014 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రతి తొలి టెస్ట్‌కు ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వడం సంప్రదాయంగా మారింది.

border-gavasker-trophy

ఇదీ చరిత్ర..

స్వదేశంలో వీరోచిత విజయాలు సాధించే భారత్‌కు.. ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం అత్యంత చెత్త రికార్డు ఉంది. 70 ఏండ్ల చరిత్రలో 11సార్లు ఇక్కడ పర్యటించిన టీమ్‌ఇండియా ఒక్కసారి కూడా సిరీస్ నెగ్గలేదు. రెండుసార్లు మాత్రం డ్రా చేసుకుంది. 1980-81లో సునీల్ గవాస్కర్ నేతృత్వంలో, 2003-04లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని జట్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇప్పటివరకు కంగారూ గడ్డపై ఆడిన 44 టెస్ట్‌ల్లో టీమ్‌ఇండియా కేవలం 5 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మెల్‌బోర్న్, సిడ్నీ (1977-78), మెల్‌బోర్న్ (1980-81), అడిలైడ్ (2003-04), పెర్త్ (2007-08)లో గెలిచింది. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ స్థాయి దిగ్గజాలతో బరిలోకి దిగినా.. సిరీస్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 1999-2000లో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 0-3తో చేజార్చుకుంది. 2003-04లో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. 2007-08లో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. ఇక 2011-12లో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-4తో చేజార్చుకుని చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2014-15లో నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిని డ్రాగా ముగించినా.. తర్వాతి రెండు టెస్ట్‌ల్లో ఓడి 0-2తో సిరీస్‌ను ఆసీస్‌కు అప్పగించింది.

ravi-shastri

బాక్సింగ్ డే టెస్ట్‌కు షా!

అడిలైడ్: ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో యువ ఓపెనర్ పృథ్వీషా ఆడుతాడని భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి బుధవారం పేర్కొన్నాడు. నాలుగు టెస్ట్‌ల సుదీర్ఘ సిరీస్ సన్నాహాల్లో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ఎలెవన్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో షా కాలి మడమ గాయానికి గురైన సంగతి తెలిసిందే. బౌండరీ దగ్గర క్యాచ్ అందుకునే ప్రయత్నంలో కాలు బెణుకడంతో అడిలైడ్‌లో గురువారం మొదలయ్యే తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. అయితే ఈనెల 26న మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్ట్ నాటికి షా పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులోకి వస్తాడని కోచ్ శాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు. సిరీస్‌కు ముందే యువ బ్యాట్స్‌మన్ షా గాయపడటం ఒకింత బాధకల్గించింది. కానీ అతను తొందరగా కోలుకుంటుండటం సానుకూల అంశం. ప్రస్తుతం నడక మొదలుపెట్టిన అతను ఈ వారంతానికి పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేలా కనిపిస్తున్నాడు. సొంతగడ్డపై ఏ జట్టు కూడా బలహీనం కాదు, ప్రతి జట్టు బలంగానే ఉంటుంది. అయితే ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా బరిలోకి దిగితే ఫలితం బాగుంటుంది. జట్టులో ప్రతిభకు తోడు అనువజ్ఞలైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రతిసారి కెప్టెన్ కోహ్లీపైనే ఆధారపడకుండా మిగతా ఆటగాళ్లు కూడా రాణిస్తే..విజయాలు వరిస్తాయి అని శాస్త్రి అన్నాడు.

గీత దాటం.. భావోద్వేగాన్నీ అణుచుకోలేం

అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా పోరు అంటే ఆ మజానే వేరు. దాయాది పాకిస్థాన్‌తో సమరం తర్వాత ప్రపంచ క్రికెట్‌లో అంతటి ఆదరాభిమానాలు కల్గిన పోటీ మళ్లీ ఆసీస్‌తోనే. కడదాకా పోరాడటం కంగారూల శైలి అయితే..పోటీనైనా ఇవ్వాలన్న పట్టుదల భారత్‌ది. ఇలా రెండు సమకాలీన జట్ల మధ్య టెస్ట్ సిరీస్ పోరుకు గురువారం తెరలేవబోతున్నది. అయితే గత అనుభవాలకు భిన్నంగా ఇరు జట్లు పోటీపడబోతున్నాయి. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటలు వింటే అలానే అనిపిస్తుంది. ప్రత్యర్థి ఆటగాళ్ల పట్ల హద్దులు మీరి ప్రవర్తించమని..అదే సమయంలో అన్నీ అనుచుకోని ఆడలేమని విరాట్ అన్నాడు. గతంలో లాగా భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాటల తూటాలు పేల్చుకుంటారని అనుకోవడం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో పోటీ అనేది తప్పనిసరి. ఏ బౌలర్‌నైనా అలా వచ్చి ఇలా బౌలింగ్ చేయమని చెప్పలేము కదా. బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడి గురిచేసేందుకు అప్పుడప్పుడు బౌలర్లు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తారు. అది కూడా నిబంధనలకు లోబడి ఉంటే బాగుంటుంది. అలా గాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతూ వెకిలి చేష్టలకు పాల్పడితే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆత్మవిశ్వాసం కొంత సన్నగిల్లవచ్చు. రెండు జట్లలో అద్భుత ప్రతిభ కల్గిన ఆటగాళ్లకు కొదువలేదు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు హోరాహోరీగా తలపడే అవకాశముంది అని కోహ్లీ అన్నాడు.

కోహ్లీకి అచ్చొచ్చిన అడిలైడ్

ఆస్ట్రేలియాలో మిగతా మైదానాల్లో ప్రదర్శన ఎలా ఉన్నా.. అడిలైడ్ మాత్రం కోహ్లీకి అచ్చొచ్చిన గ్రౌండ్. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 98.50 సగటుతో 394 పరుగులు చేశాడు. మూడు శతకాలు కూడా కొట్టాడు. ఫలితంగా ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ సగటుకు సమానంగా నిలిచాడు. ఈ గ్రౌండ్, నగరం తనకు చాలా ఇష్టమని చెప్పిన విరాట్.. ఒక మైదానంలో కొన్నిసార్లు బాగా ఆడినంత మాత్రానా.. ప్రతిసారి అలాంటి ప్రదర్శనే చేయలేకపోవచ్చన్నాడు. ప్రాథమికాంశాలకు కట్టుబడితే ఆసీస్‌లో రాణించడం సులువేనని చెప్పాడు.
kohli
lyon

258

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles