దాదాను దాటేనా!


Tue,November 14, 2017 02:11 AM

-మరో రికార్డుకు చేరువలో విరాట్
-లంకను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యం
-నెట్ ప్రాక్టీస్‌లో టీమ్‌ఇండియా
virat-kohli
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్.. దీన్ని క్లీన్‌స్వీప్ చేయాలని విరాట్ లక్ష్యం..! భారత కెప్టెన్లలో ఒకప్పుడు గంగూలీది తిరుగులేని విజయాల రికార్డు.. ఇప్పుడు దాన్ని అధిగమించాలని కోహ్లీ పట్టుదల..!! ఫార్మాట్ ఏదైనా ఇప్పటివరకు భారత కెప్టెన్‌కు ఓటమన్నదేలేదు.. 2015లో మొదలైన జైత్రయాత్ర.. స్వదేశం, విదేశం అన్న తేడాలేకుండా న్యూజిలాండ్‌తో సిరీస్ వరకు దిగ్విజయంగా కొనసాగింది. యాధృచ్చికం కాకపోయినా.. అప్పుడు లంకతోనే కోహ్లీ విజయాల బాట మొదలుపెట్టాడు. ఇప్పుడు అదే లంకేయులను వైట్‌వాష్ చేసి దాదా రికార్డును అధిగమించాలని చూస్తున్నాడు. మరి విరాట్ కల నెరవేరుతుందా..!!!

కోల్‌కతా: భారత క్రికెట్ విజయాలను కొత్త పుంతలు తొక్కిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. టెస్టుల్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (21) విజయాల రికార్డును అధిగమించేందుకు మరో మూడు అడుగుల దూరంలో నిలిచాడు. ఇప్పటివరకు 29 టెస్టుల్లో సారథ్యం వహించిన విరాట్.. 19 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాడు. అయితే లంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి దాదా రికార్డును సవరించాలని భావిస్తున్నాడు. ఈ లక్ష్యంతో ఈనెల 16 నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్ కోసం సర్వం సన్నద్ధమవుతున్నాడు. ఏ విధంగా చూసి నా.. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌గా కనిపిస్తున్నది. బలమైన బ్యాటింగ్, పదునైన బౌలింగ్‌తో రెండు నెలల కిందట లం కను వాళ్ల గడ్డపైనే 9 మ్యాచ్‌ల్లో ఓడించింది. కాబట్టి ఈ సిరీస్ గెలువడం విరాట్‌సేనకు పెద్ద ఇబ్బందికాకపోవచ్చు.

రివర్స్ స్వీప్‌లపై దృష్టి..

సిరీస్ నేపథ్యంలో భారత్ జట్టు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. వారం రోజుల విశ్రాంతి తర్వా త జట్టు సభ్యులందరూ సోమవారం ఈడెన్ గార్డెన్స్ నెట్స్‌లో చెమటోడ్చారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ ప్రాక్టీస్‌లో క్రికెటర్లందరూ రివర్స్ స్వీప్, షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొవడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. భారత జట్టు కోచింగ్ సిబ్బంది త్రోడౌన్స్‌తో షార్ట్ పిచ్ బంతులను విసురుతూ బ్యాట్స్‌మెన్‌తో ప్రాక్టీస్ చేయించారు. అందరికంటే ముందుగా నెట్స్‌కు వచ్చిన ధవన్, రాహుల్.. పేస్, స్పిన్‌ను మార్చిమార్చి ఎదుర్కొంటూ బ్యాటింగ్ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. స్పిన్ బౌలింగ్‌లో ధవన్ ఎక్కువగా రివర్స్ స్వీప్ షాట్లు కొట్టాడు. తర్వాత వచ్చిన రహానే దాదాపు 30 నిమిషాల పాటు షార్ట్ పిచ్ బంతులను ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా అశ్విన్, కుల్దీప్ వేసిన షార్ట్ బంతులను భారీ షాట్లుగా మలిచే ప్రయత్నం చేశాడు. లంక సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్, లక్షన్ సందాకన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కసరత్తులు చేశాడు. సోమవారం కోల్‌కతా చేరుకున్న కెప్టెన్ కోహ్లీ కొద్ది వ్యవధిలోనే ఈడెన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ముందుగా స్ట్రెచ్చింగ్స్‌తో కాస్త వామప్ అయిన విరాట్ కూడా రహానేతో కలిసి కాసేపు త్రోడౌన్స్‌ను ప్రాక్టీస్ చేశాడు. తర్వాత నెట్స్‌లోకి వెళ్లి షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొవడం, స్పిన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌లకు పదును పెట్టుకున్నాడు. ఆదివారం రంజీ మ్యాచ్ ఆడి వచ్చిన పుజార, జడేజా విశ్రాంతికే పరిమితమయ్యారు. వీళ్లిద్దరు మంగళవారం ప్రాక్టీస్‌లో పాల్గొంటారని టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. తర్వాత రోహిత్, రహనే, కోచ్ రవిశాస్త్రి వ్యక్తిగతంగా పిచ్‌ను పరిశీలించారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈనెల 16న తొలి టెస్టు ప్రారంభమవుతుంది.

లంక కూడా..

వామప్ మ్యాచ్ ముగియడంతో లంక ప్రాక్టీస్ చేయలేదు. అయితే కెప్టెన్ చండిమల్, సహాయక సిబ్బందితో కలిసి ఈడెన్ పిచ్‌ను పరిశీలించాడు. చీఫ్ కోచ్ నిక్ పొతాస్, బ్యాటింగ్ కోచ్ సమరవీర, బౌలింగ్ కన్సల్టెంట్ రుమేశ్ రత్నాయకే, టీమ్ మేనేజర్ గురుసింఘే ఇందులో ఉన్నారు. మంచు ప్రభావం వల్ల వికెట్‌ను కవర్లతో కప్పి ఉంచారు. పిచ్ వివరాలను క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో చర్చించారు.

ముగ్గురు పేసర్లతో

రాబోయే దక్షిణాఫ్రికా టూర్‌ను దృష్టిలో పెట్టుకుని లంకతో తొలి టెస్టులకు ముగ్గురు ప్రధాన పేసర్లను బరిలోకి దించాలని భారత్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. మూడు టెస్టులకు పచ్చిక లేకుండా కఠినమైన బౌన్సీ పిచ్‌లను రూపొందించాలని క్యూరేటర్లకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దక్షిణాఫ్రికాలో ఇదే తరహాలో పిచ్‌లు ఉంటాయి. దీంతో ఈడెన్ గార్డెన్స్ వికెట్‌పై సోమవారం గ్రౌండ్స్‌మెన్ పచ్చికను తొలిగించారు. షమీ, ఉమేశ్‌కు తోడుగా భువనేశ్వర్, ఇషాంత్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. ఇటీవల రంజీల్లో ఇషాంత్ ప్రదర్శన అద్భుతంగా ఉండటంతో అతనికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉదయం సెషన్‌లో భువనేశ్వర్ స్వింగ్ ప్రధాన ఆయుధం కానుంది. స్పిన్నర్లలో అశ్విన్‌కు తోడుగా చైనామెన్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవచ్చు.

427

More News

VIRAL NEWS