కవాని కమాల్..


Sun,July 1, 2018 03:45 AM

-2-1తో పోర్చుగల్ పరాజయం..
-క్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వే

సోచి: ఉరుగ్వే స్టార్ కవాని అద్భుత ఆటతీరుతో సూపర్‌స్టార్‌గా నిలిచి జట్టును ఒంటిచేత్తో క్వార్టర్ ఫైనల్ చేర్చాడు. శనివారం అర్థరాత్రి పోర్చుగల్‌తో జరిగిన ప్రి క్వార్టర్స్‌లో ఉరుగ్వే చాంపియన్ ఆటతీరుతో చెలరేగింది. 2-1 గోల్స్‌తో పోర్చుగల్‌ను చిత్తు చేస్తూ తుది ఎనిమిది జాబితాలో చోటు దక్కించుకుంది. ఆట (7వ నిమిషం, 62వ నిమిషం)లో ఉరుగ్వే ఫుట్‌బాలర్ ఎడిసన్ కవాని రెండుగోల్స్ సాధించి జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు. జట్టును యూరో చాంపియన్‌గా నిలిపినా..బార్సిలోనా క్లబ్ తరఫున హ్యాట్రిక్ టైటిల్స్ అందుకున్న పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఈ ఓటమితో మరోసారి ఫిఫా ప్రపంచకప్ అందని ద్రాక్షగా మారింది. ఈ టోర్నీకి ముందు సూపర్ ఫాం కనబరిచిన రొనాల్డొను ఉరుగ్వే డిఫెండర్లు అద్భుతంగా కట్టడి చేశారు. మ్యాచ్ ఆసాంతం బంతి దాదాపు 67శాతం పోర్చుగల్ ఆధీనంలో కొనసాగినా..గోల్ మాత్రం సాధించలేకపోయారు.

ఒకవైపు ఉరుగ్వే డిఫెండర్లు అద్భుత నియంత్రణ కనబరిచి రొనాల్డోను మార్కింగ్ చేయడంతో పోర్చుగల్ గోల్ ప్రయత్నాలు ఫలించలేదు. మ్యాచ్ ఏడో నిమిషంలో పోర్చుగల్ గోల్‌పోస్టు సమీపంలో ఉరుగ్వే స్టార్ లూయిస్ సురెజ్ అందించిన కచ్చితమైన పాస్‌ను కవానో హెడ్డర్‌తో గోల్‌పోస్టులోకి పంపి జట్టుకు తొలిగోల్ అందించాడు. అప్పటినుంచి పోర్చుగల్ దాడుల తీవ్రత పెంచినా ఉరుగ్వే డిఫెండర్లను అడ్డు తప్పించలేకపోవడంతో ప్రథమార్ధం ముగిసేసరికి మరో గోల్ నమోదు కాలేదు. రెండో అర్థభాగం 55వ నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు రాఫెల్ గురెరో కొట్టిన కార్నర్ షాట్‌ను పెపె అందుకుని గోల్ కొట్టి 1-1తో స్కోరు సమం చేశాడు. ఈ ఆనందం వారికి ఎంతోసేపు నిలువలేదు. మ్యాచ్ 62వ నిమిషంలో పోర్చుగల్ పెనాల్టీ ఏరియాలో రోడ్రిగో అందించిన పాస్‌ను ..కవాని అద్భుతంగా గోల్‌పోస్టులోకి పంపి జట్టుకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. మ్యాచ్ సమయం ముగిసేవరకు ఈ ఆధిక్యాన్ని కొనసాగించిన ఉరుగ్వే విజయంతో క్వార్టర్స్ చేరగా..పోర్చుగల్ జట్టు ఇంటిముఖం పట్టింది.

353

More News

VIRAL NEWS