అందరికీ ఆటలు


Wed,September 13, 2017 01:27 AM

రాష్ట్రంలో వినూత్న ప్రయోగం
ఒలింపిక్స్ తరహాలో 23 క్రీడాంశాలతో చాంపియన్‌షిప్
ప్రభుత్వ అండతో భారీ ఈవెంట్‌కు శ్రీకారం
ప్రతి విద్యార్థికి పోటీలో పాల్గొనే అవకాశం

Venkatesham
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: అభివృద్ధిలో దూసుకుపోతూ విశ్వనగరంగా రూపుదాల్చుతున్న హైదరాబాద్ నగరం క్రీడా రాజధానిగానూ మారబోతున్నదనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఈవెంట్‌ను చెప్పుకోవచ్చు. అవును.. స్పోర్ట్స్ ఫర్ ఆల్ (అందరికీ ఆటలు) అన్న కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లో 35వేల మంది క్రీడాకారులతో అతిపెద్ద స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ప్రతి పాఠశాల విద్యార్థి ఆటలు ఆడేందుకు అవకాశం కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ చాంపియన్‌షిప్‌ను వచ్చేనెల 4 నుంచి 17వ తేదీ వరకు నగరంలోని గచ్చిబౌలీ, ఎల్బీ స్టేడియం వేదికలుగా నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ చాంపియన్‌షిప్‌నకు సంబంధించిన వివరాలను రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ కాన్సెప్ట్‌కు ఆద్యుడైన స్పోర్ట్స్ ఫర్ ఆల్ డైరెక్టర్ రిషికేశ్ జోషి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహణ మాదిరిగా ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 23 క్రీడాంశాల్లో (హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, త్రోబాల్, హాకీ, కబడ్డీ, ఫుట్‌బాల్, వాటర్‌పోలో, ఖోఖో, జూడో, తైక్వాండో, బాక్సింగ్, ఫెన్సింగ్, కరాటే, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీ, క్యారమ్స్, స్విమ్మింగ్, చెస్) పోటీలను నిర్వహించనున్నారు. నగరం నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పాఠశాల విద్యార్థి ఈ చాంపియన్‌షిప్‌లో ఆడొచ్చని వెంకటేశం తెలిపారు.

ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా పేరు నమోదుచేసుకోవాలనీ, అందులో తాను పాల్గొనే క్రీడాంశాన్ని పేర్కొనాలని నిర్వాహక ఈవెంట్ డైరెక్టర్ రిషికేశ్ సూచించాడు. అయితే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులైతే రూ. 200 చొప్పున ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా లేదంటే, పాఠశాల యాజమాన్యం రూ. 12,000 చెల్లిస్తే, సదరు పాఠశాలలోని విద్యార్థులంతా ఈ టోర్నీలో ఆడొచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించకుండానే టోర్నీలో పోటీపడొచ్చు. www.sfanow.in అనే వెబ్‌సైట్‌లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో జరిగే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌ను విజయవంతం చేయాలని సాట్స్ ఎండీ దినకర్‌బాబు కోరారు. రాష్ట్ర క్రీడాశాఖతో పాటు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(సాట్స్) కూడా అతిపెద్ద క్రీడా పండుగకు సహకారం అందిస్తుందని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి చెప్పారు.

196

More News

VIRAL NEWS