జాతీయ చెస్‌ చాంప్‌ రాజా రిత్విక్‌


Thu,July 18, 2019 03:43 AM

chess
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: అండర్‌-15 జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ క్రీడాకారుడు, అంతర్జాతీయ మాస్టర్‌ రాజా రిత్విక్‌ పసిడి పతకంతో మెరిశాడు. ఈరోడ్‌(తమిళనాడు) వేదికగా బుధవారం ముగిసిన టోర్నీలో రిత్విక్‌ తనదైన ప్రతిభతో సత్తాచాటాడు. ఇదే టోర్నీలో బరిలోకి దిగిన రాష్ట్ర చెస్‌ ఆటగాడు కుశాగ్ర మోహన్‌ రజతం సాధించాడు. మొత్తం 11 రౌండ్లలో 9.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన రిత్విక్‌ చాంపియన్‌గా నిలిచాడు. 11 గేముల్లో ఎనిమిది గెలిచిన ఈ కుర్రాడు మూడింటిని డ్రాగా ముగించుకుని టోర్నీలో అజేయంగా నిలిచాడు. ఫైనల్లో తమిళనాడుకు చెందిన అజయ్‌ కార్తీకేయన్‌ను రిత్విక్‌ అద్భుత రీతిలో ఓడించాడు. నల్ల పావులతో బరిలోకి దిగిన ఈ యువ సంచలనం ఆది నుంచి దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని 40 ఎత్తుల్లో చిత్తు చేశాడు. 33వ ఎత్తులో అజయ్‌ గేమ్‌ను డ్రా చేసుకునేందుకు మొగ్గుచూపినా రిత్విక్‌ మాత్రం కడదాకా పోరాడి విజేతగా నిలిచాడు. ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌(ఏఐసీఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 150 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు. అండర్‌-15 జాతీయ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ విజయం ద్వారా రిత్విక్‌ శ్రీలంకలో జరిగే ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌తో పాటు వరల్డ్‌, కామన్వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌నకు భారత్‌ తరఫున ఆడేందుకు అర్హత సాధించాడు. నగరంలోని అర్కిడ్స్‌ అంతర్జాతీయ స్కూల్‌లో ప్రస్తుతం పదో తరగతి చదువుతూ జాతీయ చాంప్‌గా నిలిచిన రిత్విక్‌కు రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరసింహ రెడ్డి, కార్యదర్శి కేఎస్‌ ప్రసాద్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

245

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles