మళ్లీ ఓడిన టైటాన్స్


Mon,July 22, 2019 03:13 AM

-రెండో మ్యాచ్‌లో తలైవాస్ చేతిలో పరాజయం
-మెరిసిన రాహుల్ చౌదరి, మన్‌జీత్ చిల్లర్
గత ఆరు సీజన్లుగా తెలుగు టైటాన్స్‌కు సేవలందించిన రైడ్ మెషీన్ రాహుల్ చౌదరి పాత జట్టుపై కసి తీరా ఆడటంతో.. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు వరుసగా రెండో పరాజయం తప్పలేదు. గతంలోనూ ఒకే ఆటగాడిపై ఎక్కువగా ఆధారపడి మూల్యం చెల్లించుకున్న టైటాన్స్ ఈ సీజన్‌లో సిద్ధార్థ్‌పై అతి నమ్మకంతో మరోసారి భంగపాటుకు గురైతే.. స్టార్లతో నిండిన తలైవాస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి సీజన్‌లో బోణీ కొట్టింది.
kabaddi
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తొలి మ్యాచ్‌లో పరాజయం వెక్కిరించినా.. మలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ సత్తా చాటుతుందనుకుంటే.. వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 26-39తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమి పాలైంది. మొన్న మొన్నటి వరకు మన జట్టు తరఫున ఆడిన రాహుల్ చౌదరి అద్భుత ప్రదర్శనకు మన్‌జీత్ చిల్లర్ ఉడుం పట్టు తోడవడంతో తలైవాస్ అలవోకగా గెలుపొందింది. రాహుల్ (12 పాయింట్లు)కు బెస్ట్ రైడర్ అవార్డు దక్కగా.. మన్‌జీత్ (6 పాయింట్లు)ను బెస్ట్ డిఫెండర్ పురస్కారం వరించింది. టైటాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న కబడ్డీ బాహుబలిసిద్ధార్థ్ దేశాయ్ (6 పాయింట్లు) మరోసారి నిరాశ పరిచాడు.

రాహుల్ విజృంభణ

సొంత మైదానంలాంటి గచ్చిబౌలిలో రాహుల్ చౌదరి చెలరేగిపోయాడు. తలైవాస్ తరఫున తొలి రైడ్‌కు వచ్చిన రాహుల్ పాయింట్ సాధించగా.. డూ ఆర్ డై రైడ్‌లో రజనీశ్ పాయింట్ తేవడంతో టైటాన్స్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత వరుసగా సిద్ధార్థ్ దేశాయ్, రజనీశ్‌ను పట్టేసిన తలైవాస్ ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికే డూ ఆర్ డై రైడ్‌లో రాహుల్‌ను పట్టేసిన టైటాన్స్ తిరిగి పుంజుకొని ఆధిక్యంలోకి దూసుకెళ్లినా.. ముగ్గురే ఉన్న కోర్టులోకి వెళ్లిన సిద్ధార్థ్ దేశాయ్ ఔట్ కావడంతో తలైవాస్ ముందంజ వేసింది. ఇక అక్కడి నుంచి అదే జోరు కొనసాగించిన తంబీల జట్టు వరుస పాయింట్లతో అదరగొట్టింది. ఫలితంగా తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 10-20తో వెనుకంజలో నిలిచింది.

స్టార్ల ముందు నిలువలేక..

రెండో సగంలోనైనా.. మ్యాజిక్ చేస్తారనుకుంటే అదీ సాధ్యపడలేదు. అజయ్ ఠాకూర్, రాహుల్ చౌదరి, మన్‌జీత్ చిల్లర్, మోహిత్ చిల్లర్, షబ్బీర్ బాబుతో కూడిన తమిళ్ తలైవాస్‌కు తెలుగు టైటాన్స్ ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. ముఖ్యంగా పటిష్టమైన డిఫెన్స్‌తో మన్‌జీత్, మోహిత్.. టైటాన్స్ రైడర్లను కట్టిపడేశారు. ట్యాక్లింగ్‌లో టైటాన్స్ 8 పాయింట్లే సాధించగా.. తలైవాస్ 15 పాయింట్లు సాధించడమే దీనికి నిదర్శనం. మ్యాచ్‌లో మన జట్టు రెండు సార్లు ఆలౌట్ కాగా.. ప్రత్యర్థి జట్టు కోర్టు ఒక్కసారి కూడా ఖాళీ కాలేదు. ఆఖర్లో కొన్ని పాయింట్లు సాధించినా.. అప్పటికే అలస్యమైపోవడంతో టైటాన్స్‌కు వరుసగా రెండో పరాజయం తప్పలేదు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 42-24తో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది.

492

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles