సైనా స్వర్ణ కాంతులు


Mon,April 16, 2018 01:09 AM

సింధు, శ్రీకాంత్‌లకు రజతాలు.. పురుషుల డబుల్స్‌లో కొత్త చరిత్ర.. 26 స్వర్ణాలతో మూడోస్థానంలో భారత్ ఓవైపు అనుభవం.. మరోవైపు కుర్రతనం.. వెరసి ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు జిగేల్ మన్నారు. అంచనాలు పెట్టుకున్న ప్రతి విభాగంలో ఏదో ఓ పతకంతో మెరుస్తూ కంగారుల గడ్డపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. బ్యాడ్మింటన్‌లో సింధుతో జరిగిన ఉత్కంఠ పోరులో సైనా పైచేయి సాధించగా, ఇటీవలే నంబర్‌వన్ ర్యాంక్‌ను చేజిక్కించుకున్న శ్రీకాంత్ రజతంతో సంతృప్తిపడ్డాడు. పురుషుల డబుల్స్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తూ.. స్కాష్, టీటీలోనూ పతకాల వేటలో భారత్ ముందంజ వేసింది. ఓవరాల్‌గా విదేశీ గడ్డపై గతంలో ఎన్నడూ లేనంతగా పతకాలను కొల్లగొట్టిన భారత్ సగర్వంగా గేమ్స్‌ను ముగించింది.
saina-sindhu
గోల్డ్‌కోస్ట్: వారెవ్వా..! ఏం ఆట... ఒకర్నిమించి మరొకరు.. కచ్చితమైన షాట్లు.. సుదీర్ఘమైన స్మాష్‌లు.. నెట్ వద్ద సూపర్ డ్రాప్‌లు.. ఊహకు మించిన పరస్పర వ్యూహాలు.. ఆటలో దూకుడు.. షాట్లలో పరిణతి చూపెట్టిన స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్... కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణకాంతులు వెదజల్లింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సైనా 21-18, 23-21తో పీవీ సింధుపై గెలిచింది. టీమ్ చాంపియన్‌షిప్ పసిడి పతకం గెలువడంలో కీలక పాత్ర పోషించిన సైనా.. వ్యక్తిగత విభాగంలోనూ తనదైన శైలిలో చెలరేగిపోయింది. అయితే చీలమండ గాయంతో బాధపడుతున్న సింధు ఈసారి రజతంతో ఓ అడుగు ముందుకేసింది. గ్లాస్గో గేమ్స్‌లో ఈమె కాంస్యంతో సంతృప్తిపడింది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో సైనా స్వర్ణంతో మెరిసింది. దాదాపు గంట పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరువురు క్రీడాకారిణిలు పాయింట్ల కోసం తీవ్రంగా చెమటోడ్చారు. కొన్నిసార్లు సింధు కొట్టిన బలమైన స్మాష్‌లకు సైనా సమాధానం చెప్పలేకపోగా, సైనా సంధించిన క్రాస్ కోర్టు విన్నర్లను సింధు అడ్డుకోలేకపోయింది. దీనికితోడు నెట్ వద్ద హైదరాబాదీ వేసిన సూపర్ డ్రాప్‌లను తీయలేకపోయింది. ఫలితంగా 9-4 ఆధిక్యంతో తొలి గేమ్‌ను మొదలుపెట్టిన సైనా.. బేస్‌లైన్ గేమ్‌తో మరింత దూకుడును చూపెట్టింది.

sindhu
ఇక నియంత్రణలేని షాట్లతో ఇబ్బందిపడ్డ సింధు నాలుగుసార్లు షటిల్‌ను బయటకు పంపడంతో సైనా ఆధిక్యం 11-6కు పెరిగింది. ఈ దశలో సింధు వ్యూహాత్మకంగా సుదీర్ఘమైన ర్యాలీల వైపు మొగ్గింది. వీటిని అందుకునే క్రమంలో సైనా కాస్త అలసటకు గురికావడంతో ప్రత్యర్థికి చకచకా పాయింట్లు వచ్చిపడ్డాయి. దీంతో సైనా ఆధిక్యం 18-20కి తగ్గింది. వెంటనే సూపర్ స్మాష్‌తో చెలరేగిన సైనా 23 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరూ మరింత పకడ్బందిగా ఆడారు. కోర్టు మొత్తం కలియదిరుగుతూ షాట్లు కొట్టారు. సైనా తన ట్రేడ్ మార్క్ యాంగిల్ షాట్స్‌తో చెలరేగితే.. సింధు స్మాష్‌లతో ఆకట్టుకుంది. దీంతో సింధు 9-7, 13-8 ఆధిక్యంలో నిలిచింది. సింధు క్రమంగా 19-16 స్కోరుతో ముందంజ వేసింది. కానీ ఇక్కడ జరిగిన 64 స్ట్రోక్స్ ర్యాలీలో సింధు వెనుకబడటంతో సైనా 18-19, 19-19తో స్కోరు సమం చేసి మ్యాచ్‌లోకి వచ్చింది. ఇక 20-19 వద్ద సింధు కొట్టిన రిటర్న్ షాట్ నెట్‌కు తాకడంతో సైనా వెంటనే ఓ పాయింట్ నెగ్గి 21-21తో స్కోరు సమం చేసింది. ఈ దశలో సైనా రెండు అద్భుతమైన క్రాస్ కోర్టు విన్నర్లను సంధించింది.

srikanth

రజతంతో సరి..

పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో శ్రీ 21-19, 14-21, 14-21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో ఓడి రెండోస్థానంలో నిలిచాడు. మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో లీ చోంగ్ వీపైనే గెలిచిన తెలుగు కుర్రాడు అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. మ్యాచ్ ఆరంభంలో మంచి ఆత్మవిశ్వాసంతో కనిపించిన శ్రీకాంత్.. తొలి గేమ్‌లో 4-0, 10-7, 11-9తో ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత లీ పుంజుకున్నా.. నెట్ వద్ద మెరుగైన ఆటతో గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. కానీ రెండో గేమ్‌లో లీ తన అనుభవాన్ని రంగరించి షాట్లు కొట్టడంతో శ్రీకాంత్ వరుసగా పాయింట్లు సమర్పించుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో శ్రీకాంత్ గేమ్ గాడి తప్పడంతో లీ 9-5, 11-5, 16-8తో దూసుకుపోయాడు.

gold-coast
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ రణిక్ రెడ్డి-చిరాగ్ శెట్టి కొత్త చరిత్ర సృష్టించారు. ఫైనల్లో భారత ద్వయం 13-21, 16-21తో మార్కస్ ఎల్లిస్-క్రిస్ లాంగ్‌రిడ్జ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడి రజత పతకాన్ని దక్కించుకున్నారు. కామన్వెల్త్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్‌లో భారత్ ఆరు పతకాలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.

satwik

మెరిసిన దీపిక ద్వయం

భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత స్కాష్ ప్లేయర్లు దీపిక పల్లికల్-జోష్న చినప్ప జోడీ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. టైటిల్ పోరులో భారత జంట 9-11, 8-11తో జోయెల్లా కింగ్-అమండా లిండ్రెస్ మర్ఫి (న్యూజిలాండ్) చేతిలో ఓడి రెండోస్థానంలో నిలిచింది. గ్లాస్గో గేమ్స్‌లో స్వర్ణంతో మెరిసిన ఈ జంట.. గోల్డ్‌కోస్ట్‌లో దానిని పునరావృతం చేయలేకపోయింది.

Sathiyan-Gnanasekara-and-Ma

బాత్రాకు 4 పతకాలు

కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్‌లో భారత్ అదరిపోయే ప్రదర్శనను చూపెట్టింది. ఆఖరి రోజు పురుషుల కాంస్య పతక పోరులో ఆచంట శరత్ కమల్ 4-1 (11-7, 11-9, 9-11, 11-6, 12-10)తో సామ్యూల్ వాకెర్ (ఇంగ్లండ్)పై గెలువగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో మానిక బాత్రా-సతీయాన్ జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. వర్గీకరణ పోరులో బాత్రా-సతీయాన్ 11-6, 11-2, 11-4తో శరత్ కమల్-మౌమ దాస్‌పై గెలిచారు. ఓవరాల్‌గా టీటీలో భారత్ 8 పతకాలతో (3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలు) దుమ్మురేపింది. ఈ పోటీల్లో మానికా బాత్రా ఒక్కతే నాలుగు పతకాలు గెలువడం విశేషం. గ్లాస్గో గేమ్స్‌లో భారత్ ఒకే ఒక్క రజతంతో సంతృప్తిపడింది.
sharath-kamal

కామన్వెల్త్‌లో దేశం గర్వపడేలా అద్భుత ప్రదర్శన కనబరిచావు సైనా. అసమాన పోరాట పటిమ ద్వారా దేశంలో ఎందరికో నువ్వు స్ఫూర్తిగా నిలిచావు. కామన్వెల్త్‌లో మరోసారి పసిడి పతకంతో మెరిసినందుకు అభినందిస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని విజయాలు
సాధించాలి.
- గవర్నర్ నరసింహన్

కామన్వెల్త్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం సాధించిన సైనా నెహ్వాల్‌కు ప్రత్యేక అభినందనలు. భవిష్యత్‌లోనూ మరి న్ని విజయాలు సాధించి దేశం, రాష్ర్టానికి మరింత ఖ్యాతి తీసుకురావాలి.
- సీఎం కేసీఆర్

1877

More News

VIRAL NEWS