రూపిందర్, సునీల్ ఔట్


Fri,November 9, 2018 12:39 AM

- 18 మందితో ప్రపంచకప్ ఆడే హాకీ జట్టు ప్రకటన
manpreet-singh
న్యూఢిల్లీ: భారత సూపర్ మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సారథిగా ప్రపంచకప్‌లో ఆడే 18 మంది సభ్యుల భారత జట్టును గురువారం హాకీ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 16వరకు ప్రపంచ కప్ జరగనుంది. ఆసియా చాంపియన్‌షిప్ నుంచి మోకాలి గాయంతో తప్పుకున్న వెటరన్ సునీల్, గత నెలలో జరిగిన కాంటినెంటల్ కప్ నుంచి జట్టుకు దూరమైన రూపిందర్ పాల్ సింగ్‌లకు ప్రపంచకప్ ఆడే జట్టులో స్థానం దక్కలేదు. ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్, పాకిస్థాన్‌తో కలిసి సంయుక్త విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో జట్టును అద్భుతంగా నడిపించిన మన్‌ప్రీత్ సింగ్..సొంతగడ్డపై జరగనున్న ప్రపంచకప్‌లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో సారథ్యం దక్కించుకున్నాడు. సెంటర్ విభాగంలో యువ ఆటగాళ్లు సుమిత్, నీలకంఠ శర్మ, హార్ధిక్ సింగ్‌లతోపాటు సీనియర్ చింగ్లేన్‌సానా ఎంపికయ్యాడు. ఇక ఫార్వర్డ్ విభాగంలో భారత్ అనుభవజ్ఞులతో కూడిన లైనప్‌ను ఎంచుకుంది. ఆకాశ్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయతోపాటు జూనియర్ ప్రపంచకప్ గెలిచిన మన్‌దీప్ సింగ్, సిమ్రన్‌జిత్ సింగ్ ఫార్వర్డ్స్‌గా సేవలందించనున్నారు. ప్రపంచ నంబర్ 3 బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికాలతో కూడిన పూల్ సీలో భారత్ గ్రూప్ మ్యాచ్‌లలో తలపడనుంది. 34 మంది ప్రాబబుల్స్ జాబితా నుంచి అర్హులైన 18 మంది జట్టును ఎంపిక చేసేందుకు కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకున్నాం. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల నుంచి అద్భుతమైన మేళవింపుతో కూడిన జట్టును ప్రకటించాం అని భారత హాకీ జట్టు కోచ్ హరీంద్ర సింగ్ అన్నాడు.

భారత జట్టు: (గోల్‌కీపర్లు):పీఆర్ శ్రీజేశ్, క్రిషన్ బహదూర్ పాఠక్ (డిఫెండర్లు):హర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్రా, వరుణ్ కుమార్, కోతాజిత్ సింగ్, ఖడాంగ్‌బమ్, సురేంద్ర కుమార్, అమిత్(మిడ్‌ఫీల్డర్స్): మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), చింగ్లేన్‌సానా(ఉపసారథి), నీలకంఠశర్మ, హార్ధిక్ సింగ్, సుమిత్(ఫార్వర్డ్స్): ఆకాశ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, లలిత్‌కుమార్ ఉపాధ్యాయ, సిమ్రన్‌జీత్ సింగ్.

216

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles