నాలుగుకు అయ్యరే బెస్ట్


Tue,August 13, 2019 02:10 AM

న్యూఢిల్లీ : ఏడాది తర్వాత జట్టులోకి వచ్చి.. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్(71)పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానానికి అయ్యర్ సరైన ఆటగాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. అతడిని నాలుగులో పంపి, మిడిల్‌ఆర్డర్‌లో రిషభ్ పంత్‌కు ఓ స్థానాన్ని కేటాయించాలని సూచించాడు. ధోనీ లాగే పంత్‌ను కూడా ఫినిషర్‌లా ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. అదే అతడి సాధారణ ఆట. ఒకవేళ టాపార్డర్ బాగా ఆడి మ్యాచ్ 40 ఓవర్ల వరకు వస్తే అప్పుడు పంత్ నాలుగో స్థానంలో వస్తే బాగుంటుంది. కానీ 30-35 ఓవర్లు మిగిలి ఉంటే మాత్రం ఆ స్థానానికి శ్రేయస్ సరైన ఆటగాడు. పంత్ ఆ తర్వాత రావాలి అని గవాస్కర్ అన్నాడు. అయ్యర్‌ను నాలుగో స్థానంలో పంపుతారని అందరూ భావించిన తరుణంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో మేనేజ్‌మెంట్ పంత్‌వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్ 71 పరుగులు చేయడం సహా కెప్టెన్ కోహ్లీతో కలిసి 125 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు 279 పరుగుల స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. నాన్‌స్ట్రయికర్ నుంచి ఎంతో ఆటను నేర్చుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో ఎండ్‌లో ఉండగా శ్రేయస్ అయ్యర్ అదే చేశాడు. ఈ ప్రదర్శనతో జట్టులో అతడి స్థానం పదిలమవుతుందనుకుంటున్నా అని సన్నీ అన్నాడు.
sunny

బాగా ఆడతానని తెలుసు : అయ్యర్

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో చేసిన ప్రదర్శన ద్వారా జట్టులో తన స్థానం పదిలంగా ఉంటుందని భావిస్తున్నట్టు అయ్యర్ తెలిపాడు. తాను తుదిజట్టులో ఉండి, నిలకడగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పాడు. నేను ఇక్కడ(విండీస్‌లో) బాగా ఆడతానని తెలుసు. ఇండియా ఏ తరఫున ఈ మైదానాల్లోనే ఆడా. ఇన్నింగ్స్‌లో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని అనుకున్నా. చివరి దాకా భాగస్వామ్యం ఉండాలని విరాట్ చెప్పాడు. అతడు నాకెంతో మద్దతునిచ్చాడు. మేం సింగిల్స్, డబుల్స్ తీశాం. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాం. 250 పరుగులు సరిపోతాయని భావించినా, ఎక్కువ పరుగులే వచ్చాయి. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా అని శ్రేయస్ అన్నాడు.

441

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles